Detroit: వైభవంగా సాయి సమాజ్ ఆఫ్ సాగినా తొలి వార్షికోత్సవం
ABN , Publish Date - Jul 24 , 2025 | 07:51 AM
సాయి సమాజ్ ఆఫ్ సాగినా తొలి వార్షికోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి నామస్మరణలో తరించారు.

ఇంటర్నెట్ డెస్క్: సాయి సమాజ్ ఆఫ్ సాగినా మొదటి వార్షికోత్సవ వేడుకలు శుక్ర, శని, ఆదివారాల్లో వైభవంగా జరిగాయి. మిషిగన్ రాష్ట్రంతో పాటు కెనడా నుంచి వచ్చిన వందలాది భక్తులు ఈ పవిత్ర వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మురళి శర్మ భువనగిరి, ట్రై సిటీ హిందూ టెంపుల్ ప్రధాన పురోహితుడు యుగంధర్ శర్మ భాగవతుల, మిస్సోరీకి చెందిన శివ శంకర్ ఫణికుమార్ శర్మ, సాయి సమాజ్ ప్రధాన పురోహితుడు చిలకమర్రి వెంకటరామానుజ చార్యులు సమన్వయపరిచారు.
శుక్రవారం మహాగణపతి పూజ, అంకురార్పణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం సర్వ దేవతా మంటపారాధన, సర్వ దేవతా హోమం, మహాలక్ష్మీ హోమం, మహాలక్ష్మీ కుంకుమార్చన పూజలు జరిగాయి. ఆదివారం ముగింపు రోజున సర్వ దేవతా హోమం, మహాపూర్ణాహుతి, సద్గురు సాయిబాబాకి 108 కలశాభిషేకం, వేంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆదివారం నాడు స్థాపక అధ్యక్షుడు మురళి గింజుపల్లి, డైరెక్టర్ శ్రీనివాస వేమూరిలు ప్రసంగిస్తూ ఈ వార్షికోత్సవానికి సహకరించిన భక్తులు-వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో అతిపెద్ద సాయిబాబా మందిరాల్లో ఒకటిగా ఈ ఆలయం ఎదుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవ సమయంలో మందిరంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, సాయి సమాజం కార్యనిర్వాహక కమిటీని ప్రకటించింది. శుభా శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, స్నేహా సుంకర కో-చైర్మన్‌గా ఎంపికయ్యారు. నిర్మాణ కమిటీలో బాబు త్యాగరాజన్, ప్రణీత్ కోనేరు, సాంబశివరావు కొర్రపాటి ఉన్నారు. ఐటి మరియు కమ్యూనికేషన్ బాధ్యతలు కార్తికేయన్ బాలకృష్ణన్, మురళీ తమ్మినానా నిర్వహించనున్నారు. పబ్లిక్ రిలేషన్ బాధ్యతలు రాజేష్ ఓజా, అలంకరణ-అన్నప్రసాదం బాధ్యతలను రోహిణి వైద్య, మోనికా భుటి, విశాఖా పాట్కీ నిర్వహించనున్నారు. యువత మరియు సాంస్కృతిక విభాగాల నేతృత్వం స్వాతి త్యాగరాజన్, నిర్మల్ లోగనాథన్ వహించనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు
చంద్రబాబు సింగపూర్ టూర్.. డయాస్పోరా అమితాసక్తి, భారీ రెస్పాన్స్