NATS: నాట్స్ నూతన అధ్యక్షునిగా శ్రీహరి మందడి ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Jun 03 , 2025 | 06:38 PM
నాట్స్‌కు నూతన అధ్యక్షునిగా శ్రీహరి మందడి బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

న్యూ జెర్సీలో బాధ్యతల స్వీకరణ
జులై 4 ,5 ,6 తేదీల్లో టాంపాలో నాట్స్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలని పిలుపు
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు తెచ్చుకున్న నాట్స్‌కు నూతన అధ్యక్షునిగా శ్రీహరి మందడి బాధ్యతలు స్వీకరించారు. న్యూ జెర్సీలో వందలాది మంది సమక్షంలో శ్రీహరితో బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా శ్రీహరి మందడి మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి ఎదగటానికి సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, నాట్స్ కార్యవర్గ సభ్యులందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. నాట్స్ సంస్థ అటు తెలుగు రాష్ట్రాలలో, ఇటు అమెరికాలో వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. జులై 4 ,5 ,6 తేదీలలో ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో జరిగే 8వ నాట్స్ కాన్ఫరెన్స్ సంబరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంబరాల్లో ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్, థమన్, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. నాట్స్ సంబరాల నిర్వహణ కోసం నిధుల సేకరణకు భారీ స్పందన వచ్చిందని తెలిపారు. సుమారు నాలుగు లక్షల డాలర్లకు హామీ లభించిందని అన్నారు.
ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ అధ్యక్షుడు శ్రీహరి స్వశక్తితో ఎదిగారన్నారు. గ్రామీణ వ్యవసాయ రైతు కుటుంబం నుంచి మొదలై.. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్, మాజీ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ మాట్లాడుతూ శ్రీహరికి ఏ భాద్యత అప్పగించినా చిత్తశుద్ధితో పూర్తి చేస్తారన్నారు. సంస్థలో కష్టపడే ప్రతి ఒక్కరికీ ఇలాంటి అవకాశాలు వస్తాయన్నారు. కిరణ్ మందడి ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా.. తెలుగు అమ్మాయిల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తెలుగు మాట, ఆట, పాట, సంస్కృతీ, ఇలా వివిధ అంశాలపై పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన సమీక సుబ్బారావు, నిహారిక భవిరిశెట్టి, వాహిని కాళిదాసులకు బహుమతులు అందించారు. అనంతరం వివిధ రూపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, విందు భోజనాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు
సౌదీలో వైభవంగా తెలుగు దేశం మినీ మహానాడు