Share News

NRI: దుబాయిలో ఆసుపత్రి మంచానికి పరిమితమైన తెలుగు వ్యాపారి

ABN , Publish Date - Jul 24 , 2025 | 07:09 PM

దుబాయిలో ఓ వెలుగు వెలిగిన కడప జిల్లా వాసి పరిస్థితులు అనుకూలించక తీవ్ర కష్టాల్లో కూరుకుపోయారు. ఒత్తిడి పెరిగి పక్షవాతానికి గురై చివరకు ఆసుపత్రిలో మంచానికి పరిమితమై కన్నీరుమున్నీరవుతున్నారు.

NRI: దుబాయిలో ఆసుపత్రి మంచానికి పరిమితమైన తెలుగు వ్యాపారి
Kadapa NRI tragedy

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఒకప్పుడు డబ్బు, దర్పంతో దుబాయిలో దర్జాగా గడిపిన ఓ తెలుగు వ్యక్తి పరిస్థితులు ప్రతికూలించడంతో ప్రస్తుతం ఊహించని కష్టాల్లో కూరుకుపోయారు. ఒక్కసారిగా ఆశల సౌధాలన్నీ కుప్పకూలి.. గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన నిస్సహాయ స్థితిపై కన్నీరుమున్నీరవుతున్న కడప జిల్లా ప్రవాసీ విషాద గాథ ఇది.

కడప జిల్లా కమలాపురానికి చెందిన 46 ఏళ్ళ సి.దామోదర్ రెడ్డి యూఏఈలో ఒక ప్రముఖ సంస్థలో పని చేస్తూ జీవితాన్ని సాఫీగా గడిపేవారు. తన ప్రాంతానికి చెందిన అనేక మందికి దుబాయి, షార్జా తదితర ప్రాంతాలలో ఉద్యోగాలు కల్పించారు. ఆ తర్వాత తాను సొంతంగా అనేక వ్యాపారాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన షార్జాలో ఒక డయాగ్నస్టిక్ సెంటర్‌ను ప్రారంభించి వివాదంలో ఇరుక్కొని నష్టాలను చవి చూసారు. ఇతర వ్యాపారాలలో కూడా అనుకోకుండా నష్టాలు రావడంతో అప్పులను తీర్చలేకపోయారు. భవనాలకు కూడా అద్దె చెల్లించలేకపోవడంతో బకాయిదారులు దామోదర్ రెడ్డిపై కేసులు వేయగా వాటిని తీర్చవల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. అప్పులు చెల్లించే వరకు దామోదర్ రెడ్డి దేశం విడిచి వెళ్ళకుండా ఆంక్షలు విధించింది.


మానసికంగా కుంగిపోయిన అతనికి ఆందోళన ఎక్కువ కావడంతో పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. కుడి చేయి, కాలు పని చేయక, నిస్సహాయ స్థితిలో గత నాలుగు నెలలుగా దుబాయిలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వదేశానికి వెళ్ళి చికిత్స చేయించుకుంటానని దామోదర్ రెడ్డి తాపత్రయపడుతున్నా ఆయనపై నిషేధం ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. మాతృభూమికి వెళ్తానంటూ ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు.

దామోదరరెడ్డిపై ఉన్న కేసులను తెలుసుకుంటానని ఒక తెలుగు ప్రబుద్ధుడు 5 వేల దిర్హాంలు ( ఒక లక్షా 16 వేల రూపాయాలు) తీసుకొని దుబాయిలో కేసులు ఏమి లేవని చెప్పగా, షార్జాలో కనుక్కోవడానికి మరో 10 వేల దిర్హాంలు కావాలంటూ దామోదర్ రెడ్డి కుటుంబాన్ని డిమాండ్ చేసిట్లుగా తెలిసింది.

ఒకప్పుడు మిలియన్ల దిర్హాంల లావాదేవీలను అవలీలగా చేసిన దామోదర్ రెడ్డి ప్రస్తుతం చికిత్సకు కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావడంపై ఆయన గురించి తెలిసిన వారు ఆవేదన చెందుతున్నారు.


ఇవి కూడా చదవండి:

వైభవంగా సాయి సమాజ్ ఆఫ్ సాగినా తొలి వార్షికోత్సవం

ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు

Read Latest and NRI News

Updated Date - Jul 24 , 2025 | 07:22 PM