NRI: డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
ABN , Publish Date - Nov 24 , 2025 | 10:39 PM
డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పలువురు దాతలు విరాళాలను అందించారు.
ఇంటర్నెట్ డెస్క్: డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం నవంబర్ 16న అద్భుతంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. రమణ ముదిగంటి, ప్రతిమ కొడాలి నాయకత్వంలో బృందం (త్రిపుర సుందరి భాగవతుల, వెంకట్ గోటూర్, విజయ్ పెరుమళ్ళ మరియు రవి కవుతరపు) ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది. తమ సేవాస్ఫూర్తి, అంకితభావంతో స్థానికులను ఒక్కచోటకు చేర్చింది.
ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది హాజరయ్యారు. అందుబాటు ధరల్లో ప్రపంచ స్థాయి నేత్ర చికిత్సలను అందించి, నివారించగల అంధత్వాన్ని తొలగించే లక్ష్యం దిశగా సాగుతున్న శంకర నేత్రాలయ సంస్థకు మద్దతు తెలిపారు.
సాయంత్రం ప్రధాన ఆకర్షణలలో ఒకటి, భారతదేశం నుండి విచ్చేసిన ప్రముఖ గాయకులు పార్థు నేమాని, మల్లికార్జున్, అంజనా సౌమ్య, సుమంగళి నిర్వహించిన సంగీత కచేరీ మంత్రముగ్ధులను చేసింది. ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. గాయకుల ఆత్మీయ గాన ప్రదర్శనలతో ఈవెంట్ ఉత్సాహభరితంగా, భావోద్వేగపూర్ణంగా మారింది.

వైష్ణవి నన్నూర్, ఐశ్వ్యర్య నన్నూర్ పాడిన ప్రార్ధనా గీతంతో ఈ కార్యక్రమం మొదలయింది. స్థానిక ప్రతిభావంతులైన కళాకారులు అందించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంధ్యా ఆత్మకూరి నాట్య ధర్మి శిష్యులు, కల్యాణి మంత్రపగడ స్వరాలాపన శిష్యులు, త్రిపుర సుందరి భాగవతుల నృత్యాలయ శిష్యులు అందించిన అందమైన నృత్యాలు కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక మాధుర్యాన్ని జోడించాయి.
వేదికమీద ముఖ్య అతిధి డా. రవి వాలియాను డెట్రాయిట్ చాప్టర్ బృందసభ్యులు శాలువా, పుష్పగుచ్చం, మెమంటోతో సత్కరించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రవి వాలియా రెండు MESU కాంప్‌ల నిర్వహణకు సరిపడా 25,000 డాలర్ల విరాళాన్ని అందించారు. దీనితో 500 మందికి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం లభించింది. ఆయన స్పూర్తితో పలువురు దాతలు తమవంతుగా విరాళాలను అందజేశారు. శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు డా. యస్.యస్. బదరీనాథ్ కళాశాలలో చదువుకున్న రోజుల్లో రవి వాలియా ఆయనకు ఒక సంవత్సరము సీనియర్ కావడము విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి
SATA ఆధ్వర్యంలో జెద్ధా నగరంలో తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయిక
తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబురాలు