Indian Origin Pilot Arrest: యూఎస్‌లో భారత సంతతి పైలట్ అరెస్టు.. కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి మరీ..
ABN , Publish Date - Jul 29 , 2025 | 02:13 PM
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నేరంపై అమెరికాలో భారత సంతతి పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానం ల్యాండవగానే అతడిని అరెస్టు చేశారు. నిందితుడు డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న భారత సంతతి పైలట్ రుస్తుమ్ భగ్వాగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారిపై లైంగిక దాడి చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండవగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి మరీ నిందితుడిని అరెస్టు చేశారు.
అమెరికా మీడియా కథనాల ప్రకారం, ప్రయాణికులు ఇంకా విమానం నుంచి దిగకమునుపే కాంట్రా కాస్టా కౌంటీ పోలీసులు, హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికారులు విమానంలోకి దూసుకెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమను తోసుకుంటూ వాళ్లు లోపలకు వెళ్లారని ప్యాసెంజర్ ఒకరు తెలిపారు. అతడి చేతులకు బేడీలు వేసి బయటకు తీసుకొచ్చారని చెప్పారు.
ఈ ఘటనను చూసి నిందితుడి కోపైలట్ కూడా ఆశ్చర్యపోయారు. అతడిని అరెస్టు చేయబోతున్నట్టు తనకు అసలు తెలీనే తెలియదని చెప్పారు. భగ్వాగర్‌ను అరెస్టు చేయనున్న విషయం ఏరకంగా బయటపడినా అతడు తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. పదేళ్ల చిన్నారిపై అతడు లైంగిక దాడి చేసినట్టు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని మార్టీనెజ్ డిటెన్షన్ సెంటర్‌లో పెట్టారు.
కాగా, ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. అతడిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలను అస్సలు సహించబోమని స్పష్టం చేసింది. ఈ విషయంలో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
యూఎస్ వీసా విధానంలో కీలక మార్పు.. సెప్టెంబర్ 2 నుంచి..
శక్తిమంతమైన భారతీయ పాస్‌పోర్టు.. ఇండియన్స్‌కు ఈ దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ