Cyber Crimes: ఏడాదిలో రూ.22,842 కోట్లు దోచేశారు
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:56 AM
ఒక్క ఏడాది.. ఏకంగా రూ.22,842 కోట్లు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారతీయులు పోగొట్టుకున్న

భారత్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలు.. 2024లో 22 లక్షలకుపైగా
‘డేటా ల్యాబ్స్’ సంస్థ నివేదిక వెల్లడి
మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక టాప్
రాజ్యసభలో కేంద్రం ప్రకటన
దేశంలో నిమిషానికి 761 సైబర్ దాడులు: డీఎ్‌ససీఐ
న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఒక్క ఏడాది.. ఏకంగా రూ.22,842 కోట్లు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారతీయులు పోగొట్టుకున్న సొమ్ము ఇది. అంతేకాదు గత ఏడాది తొలిమూడు నెలలతో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి మూడు నెలల్లో ఎనిమిది రెట్లు అధికంగా సైబర్ నేరాలు జరిగినట్టు గుర్తించారు. ఢిల్లీకి చెందిన ‘డేటా ల్యాబ్స్’ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ దిగ్ర్భాంతికర అంశాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరాల బారినపడి సుమారు రూ.1.2 లక్షల కోట్లు కోల్పోయే అవకాశం ఉందని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)’ అంచనా వేసినట్టు తెలిపింది. సైబర్ నేరాలతో భారతీయులు కోల్పోయిన మొత్తం 2022లో రూ.2,306 కోట్లు, 2023లో రూ.7,465 కోట్లు మాత్రమేనని వివరించింది. సైబర్ నేరాలకు సంబంధించి 2023లో 15.6 లక్షల ఫిర్యాదులు రాగా, 2024లో 20 లక్షల వరకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. 2019తో పోలిస్తే ఈ సంఖ్య పది రెట్లు ఎక్కువని వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ చెల్లింపులతో..
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్ ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా రూ.24.03 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఇది సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. ఓటీపీ మోసాల నుంచి డిజిటల్ అరెస్ట్ దాకా కొత్త కొత్త విధానాలను అనుసరిస్తూ.. ప్రజల నుంచి సొమ్ము కొట్టేస్తున్నారు. వాట్సా్‌పలో ప్రముఖులు, వ్యాపారవేత్తల చిత్రాలను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టి, డీప్‌ఫేక్ వీడియోలు పంపి ఉద్యోగులను బురిడీ కొట్టించడం, యాప్‌లలో పెట్టుబడులపై భారీ లాభాల ఆశచూపి మోసగించడం, ప్రముఖ బ్యాంకుల నుంచి ఆరోగ్య బీమా, వాహన బీమా రెన్యూవల్ పేరిట కాల్స్ చేసి.. డెబిట్, క్రెడిట్‌కార్డులు, బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము కొల్లగొట్టడం, యువతులతో న్యూడ్ కాల్స్ చేయించి, మాట్లాడించి వాటిని బయటపెడతామని బెదిరించి వసూళ్లకు పాల్పడటం వంటివి పెరిగాయి.
నాలుగేళ్లలో నాలుగింతలు నేరాలు
దేశంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని, 2024లో 22 లక్షలకుపైగా సైబర్ నేరాలు జరిగాయని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021లో జరిగిన 4.5లక్షల సైబర్ నేరాలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే 12 లక్షలకుపైగా సైబర్ నేరాలు నమోదయ్యాయని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర (1.6 లక్షల నేరాలు), ఉత్తరప్రదేశ్ (1.4 లక్షలు), కర్ణాటక (లక్ష నేరాలు)లో నేరాలు జరిగాయని తెలిపింది. మరోవైపు బాలలకు సంబంధించిన సైబర్ నేరాలూ పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. 2018-2022 మధ్య చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి 3వేలకుపైగా, పిల్లలపై ఆన్‌లైన్ వేధింపులకు సంబంధించి 500కుపైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇక దేశంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వెబ్‌సైట్లపై సైబర్ దాడులు కూడా బాగా పెరిగాయని ‘డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎ్‌ససీఐ)’ ఇటీవల వెల్లడించింది. దేశంలో ప్రతి నిమిషం 761 సైబర్ దాడులు జరుగుతున్నట్టు తెలిపింది. వినియోగదారుల డేటాను చోరీచేయడం, వెబ్‌సైట్లను బ్లాక్ చేసి సొమ్ముకోసం డిమాండ్ చేయడం పెరిగిందని వెల్లడించింది.