Australia Visa Restrictions: భారత్‌లో ఈ 6 రాష్ట్రాలపై ఆస్ట్రేలియా నజర్.. వీసా నిబంధనలు కఠినతరం
ABN , Publish Date - Apr 21 , 2025 | 02:11 PM
భారత్‌లోని ఆరు రాష్ట్రాల్లో వీసా దరఖాస్తులపై ఆస్ట్రేలియా దృష్టి సారించింది. ఈ రాష్ట్రాల్లో దరఖాస్తుల వెరిఫికేషన్ పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్ణయించింది.

ఇంటర్నెట్ డెస్క్: వీసా దరఖాస్తుల్లో అవకతవకలను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని ఆరు రాష్ట్రాల్లో స్టూడెంట్ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించింది. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రాల్లో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. వీసా మోసాలు అరిట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. స్టూడెంట్ వీసాలను విద్యకు బదులు నివాసార్హత అవసరాలకు వినియోగిస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
ఆస్ట్రేలియా విద్యావ్యవస్థ సమగ్రతను ప్రశ్నార్థకం చేసేలా పలు మోసపూరిత వీసా దరఖాస్తులు వెలుగు చూడటంపై అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించడాన్ని నిలిపివేశాయి. మరికొన్ని యూనివర్సిటీలు తనిఖీలను మరింత కఠినతరం చేశాయి.
ఈ తీరు కారణంగా నిజాయితీగా ఉండే అభ్యర్థులు కూడా ప్రభావితమవుతున్నారు. అనేక మంది తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్నారు. ఈ చర్యలు ఆస్ట్రేలియా విద్యారంగం, దౌత్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ఆస్ట్రేలియా యూనివర్సిటీలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ఎఫైర్స్‌తో కలిసి పనిచేస్తున్నాయి. వీసా ప్రోగ్రామ్‌లో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు కృషి చేస్తున్నాయి. అయితే, మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అసలైన అభ్యర్థుల ప్రయోజనాల పరిరక్షణకు సమప్రాధాన్యం ఇవ్వాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉన్న విషయం తెలిసిందే. 2024 డిసెంబర్ నాటి లెక్కల ప్రకారం, అక్కడ భారతీయ విద్యార్థుల సంఖ్య 139,038. సంఖ్యా పరంగా భారతీయులది రెండవ స్థానం. ఈ నేపథ్యంలో వీసా ఆంక్షల విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఇండస్ట్రీ నిపుణులు ఆంకాంక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని