NRI: దుబాయి మండుటెండలో గోదావరి యువకుల ఆకలి ఆర్తనాదాలు
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:34 PM
దళారుల మాటలు నమ్మి దుబాయి వెళ్లిన గోదావరి యువకులు ఇక్కట్ల పాలయ్యారు. నిలువ నీడ కూడా లేకుండా ఉన్న తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: 50 సెల్సియస్ డిగ్రీలు దాటిన తీవ్ర ఎండలో తినడానికి తిండి లేకుండా ఉండడానికి నీడ లేకుండా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 18 మంది యువకులు దుబాయిలో నరకయాతన అనుభవిస్తున్నారు. మధ్యవర్తులను నమ్మి తాము మోసపోయామని, తమ వల్ల పని కావడం లేదని, తమను మాతృభూమికి తిరిగి పంపించాలని వారు అధికారులను ప్రాధేయపడుతున్నారు.
దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 14 మంది, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో నలుగురు మొత్తం 18 మంది యువకులు నెల క్రితం దుబాయికి వెళ్లారు. నెలకు 1600 దిర్హాంల (42 వేల రూపాయాలు) వేతనంతో కూడిన పెయింటర్ ఉద్యోగమని చెప్పి తీసుకొచ్చిన వీరికి వేతనం తగ్గించడమే కాకుండా అది కూడా ఇవ్వకుండా రెండు నెలల జీతం తన వద్ద డిపాజిట్ చేసుకుంటామని సంస్థ యాజమాన్యం చెప్పడంతో వారు అవాక్కయిపోయారు.
దీనికి తోడు తమను పెయింటర్లుగా కాకుండా హెల్పర్లుగా వాడుకుంటూ బహుళ అంతస్తుల భవనాలలో లిఫ్టులకు బదులు మెట్ల మీదుగా నడుచుకుంటూ రంగుల డబ్బాలు మోసుకుని వెళ్ళాలని ఒత్తిడి చేస్తున్నారని యువకులు వాపోయారు. నర్సాపురంలో తమకు దళారులు చెప్పిన పనికి, ప్రస్తుతం ఇక్కడ చేస్తున్న పనికి వ్యత్యాసం ఉందని, ఇది తమను మోసగించడమేనని వారన్నారు.
రంగు డబ్బాలు మోసుకుని రావడం, నిచ్చెనలు ఎక్కి గోడల మీద రంగులు వేయడం పెయింటర్ వృత్తిలో భాగమని అందులో మోసం ఏమీ లేదని సంస్థ వాదిస్తోంది. తమిళుడు ఒకరు దీని యజమాని. వీరి వీసాల జారీకి ఒక్కొక్కరికి 6 వేల దిర్హాంలు ఖర్చయ్యాయని, దాన్ని చెల్లిస్తే తిరిగి భారతదేశానికి పంపిస్తామని సంస్థ చెబుతోందని కార్మికుల ఫిర్యాదు.
జీతం చెల్లించకుండా, చెప్పిన పని కాకుండా మరో పని చేయిస్తున్న తమను తిరిగి పంపించాలని యువకులు సంబంధిత భారతీయ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని చెబుతున్నారు. మండుటెండలో అవస్థలు పడుతూ తాము దుబాయిలోని భారతీయ కాన్సులేటును సందర్శించి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం శూన్యమని వారన్నారు. దుబాయి పోలీసుల వద్దకు వెళ్ళగా, వారు లేబర్ కోర్టుకు వెళ్ళాలని సూచించారని చెప్పారు. తమ ఉపాధి వీసాల జారీకి ఒక్కొక్కరికి 6 వేల దిర్హాంలు ఖర్చయ్యాయని, దాన్ని చెల్లిస్తే తిరిగి భారతదేశానికి పంపిస్తామని సంస్థ చెబుతుందని కూడా కార్మికులు ఫిర్యాదు చేస్తున్నారు.
80 వేల నుండి లక్షా రూపాయల వరకు చెల్లించి వచ్చిన వీరికి కనీసం ఉండడానికి నీడ కూడా లేకుండా చెట్ల కింద ఆకలితో ఉంటున్న ఈ యువకులను దుబాయిలోని తెలుగు సామాజిక సేవకుడు మోహన్ మంగళవారం సందర్శించి వారిని తాత్కాలిక నివాసానికి తరలించి భోజన ఏర్పాట్లు చేసారు.
ఇవీ చదవండి:
లాస్ ఏంజెలెస్‌లో ధీమ్ తానా-2025 పోటీలు విజయవంతం
సీఎం సూచనతో విదేశాల్లో వెంకన్న మందిరాల నిర్మాణానికి కృషి: టీటీడీ ఛైర్మన్