New Mom Blues: కొత్త తల్లికి నిస్పృహ ఎందుకు
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:01 AM
కొత్త తల్లుల్లో కొన్నిసార్లు హార్మోన్ల మార్పుల వల్ల నిరాశ, నిస్పృహలు తలెత్తుతుంటాయి. ఇది పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అని పిలవబడే చికిత్సకు లోబడే సమస్య.

కౌన్సెలింగ్
డాక్టర్, నాకు ఇటీవలే ప్రసవమైంది. తల్లిని అయినందుకు ఉప్పొంగిపోవడానికి బదులుగా తెలియని నిరాశ, నిస్పృహలు వేధిస్తున్నాయి. నాకు ఎందుకు ఇలా జరుగుతోంది?
- ఓ సోదరి, హైదరాబాద్
పేగు తెంచుకుని పుట్టిన పసికందు మీద తల్లికి అవ్యాజ్యమైన ప్రేమ కలగడం సహజమే! కానీ కొందరు బాలింతల్లో ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ అనే సమస్య తలెత్తుతుంది. ప్రతి ఏడుగురు బాలింతల్లో ఒకరు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ బారిన పడుతూ ఉంటారు. ఇది ప్రసవమైన వెంటనే కనిపించవచ్చు, లేదా బిడ్డకు ఏడాది వయసొచ్చేలోపు జరగొచ్చు. అయితే ఎక్కువగా ఈ సమస్య ప్రసవమైన 3 వారాల్లోగానే తలెత్తుతూ ఉంటుంది. నిరాశలో కూరుకుపోవటం, జీవితం మీద ఆసక్తి కోల్పోవటం, అకారణంగా ఏడుస్తూ ఉండటం లాంటి లక్షణాలు ఈసమస్యలో కనిపిస్తాయి.
ఈ డిప్రెషన్‌కు లోనయిన తల్లులు...బిడ్డను సరిగా చూసుకోలేనేమో, తల్లిగా బాధ్యతను సమర్థంగా నిర్వహించలేనేమో, బిడ్డకు ప్రేమను సంపూర్తిగా అందించలేనేమో అనే చిత్రమైన మానసిక స్థితికి లోనవుతూ ఉంటారు. అయితే ఇలాంటి డిప్రెషన్ గురించి భయపడాల్సిన పని లేదు. ప్రసవంతో హెచ్చుతగ్గులకు లోనయ్యే శరీరంలోని హార్మోన్లు, పూర్వం డిప్రెషన్ బారిన పడి ఉండటం, విపరీతమైన ఒత్తిడితోపాటు, కుటుంబసభ్యుల తోడ్పాటు కొరవడటం లాంటి కారణాల వల్ల తల్లులు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు గురవుతారు. అయితే ఈ సమస్యను ‘యాంటీ డిప్రెసెంట్స్’తో చికిత్స చేసి సరిదిద్దవచ్చు. ఈ మందులు డిప్రెషన్‌కు కారణమయ్యే మెదడులోని కొన్ని రసాయనాలను సంతులనపరిచి సమస్యను తొలగిస్తాయి. ఈ మందుల వల్ల తల్లి పాలు తాగే పిల్లలకు ఎలాంటి దుష్ప్రభావాలూ కలగవు. కాబట్టి డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.
- డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల,
పీడియాట్రీషియన్ అండ్ నియో నాటాలజిస్ట్,
హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..