Share News

Successful Life: జీవితం సఫలం కావాలంటే

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:08 AM

ప్రస్తుత కాలంలో మనిషి తనను తాను ఒక భిన్నమైన, ప్రత్యేకమైన ప్రాణిలా భావించుకుంటున్నాడు. తన దగ్గర ఎంతో సాంకేతికత ఉన్నదనీ, ఒకప్పుడు లేని ఎన్నో ఉపకరణాలు ఉన్నాయనీ గర్వపడుతున్నాడు. ఎక్కువ సమయం...

Successful Life: జీవితం సఫలం కావాలంటే

చింతన

ప్రస్తుత కాలంలో మనిషి తనను తాను ఒక భిన్నమైన, ప్రత్యేకమైన ప్రాణిలా భావించుకుంటున్నాడు. తన దగ్గర ఎంతో సాంకేతికత ఉన్నదనీ, ఒకప్పుడు లేని ఎన్నో ఉపకరణాలు ఉన్నాయనీ గర్వపడుతున్నాడు. ఎక్కువ సమయం స్మార్ట్‌ ఫోన్‌తోనే గడుపుతున్నాడు. అదో అద్భుతమైన సాంకేతికత అని అనుకుంటున్నాడు. కానీ ఆ సాంకేతికతను ఎందుకు తయారు చేశారో ఎప్పుడైనా ఆలోచించారా? వాటిని కంపెనీలు తయారు చేస్తున్నది మానవ శ్రేయస్సు కోసం కాదు, స్వలాభం కోసం. మనకు సదుపాయాలు కల్పిస్తున్నందుకు డబ్బు తీసుకుంటున్నారు. సిమ్‌ కార్డు లేనిదే ఫోన్‌ పని చెయ్యదు. పైగా రీఛార్జి చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫోన్‌ ఛార్జింగ్‌ ఎంత ఉందో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే ఎక్కువగా ఫోన్‌ వాడుతూ ఉంటారో వాళ్ళు తమతో పవర్‌ బ్యాంక్‌ మోస్తూ ఉంటారు. ఫోన్‌లో ఛార్జింగ్‌ తక్కువగా ఉందని తెలిసిన వెంటనే ఛార్జింగ్‌ పెడతారు.

కొత్త ఫోన్‌ కొనడానికి వెళుతున్నప్పుడు అది మనకు ఎంతో మేలు చేస్తుందనే ఆశతో ఉంటాం. కానీ కొన్న తరువాత ఎప్పుడూ దాని గురించే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడికైనా వెళ్ళేముందు... అక్కడ ఛార్జింగ్‌ చేసుకొనే అవకాశం ఉందో లేదో ఆలోచిస్తారు. ఈ విధంగా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ ఫోన్‌ గురించే ఆందోళన చెందేవారు చాలామంది ఉన్నారు. తనను సతమతం చేసే ఆలోచనల నుంచి కాపాడుకోవడానికి ఏ సాంకేతికతను వ్యక్తులు ఉపయోగించాలనుకుంటారో... ఆ సాంకేతికతే వారికి మరిన్ని ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడూ ఆలోచనలోనే మునిగి ఉండే మనిషికి అసలైన ఆనందానుభూతి ఎలా లభిస్తుంది?


మనమందరం మన జీవితాల్లో ఆనందాన్వేషణలో ఉన్నాం. కానీ చింతలు, చికాకులతో సతమతం అవుతున్నంతకాలం ఆనందానుభూతి పొందలేమనేది గ్రహించాలి. ఈ ప్రపంచంలో ఎన్నో విషయాల మీద వితండవాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ సాధువులు, మహాత్ములు అన్ని విషయాలనూ ఎప్పుడో చెప్పేశారు. రాయాల్సినవన్నీ ఇంతకుముందే రాశారు. ‘ఆత్మానందం లేక మానవుడు, కాశీ మధురలు తిరిగేను - కస్తూరి మృగం తన నాభిలోనే ఉన్న కస్తూరికోసం వనమెల్లా తిరిగినట్టు...’-- ఇది విన్న ప్రతిసారీ నవ్వొస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి విషయాలు మనిషి బుర్రకు ఎందుకు ఎక్కవు? వాటిని అమలు చేయడానికి మనిషి ఎందుకు ప్రయత్నించడం లేదు? వేద వ్యాసుడి లాంటి మహా ఋషులు రచనలు చేయడానికి కారణం ఏమిటి? వాటిని చదవడానికో, గుర్తు పెచ్చుకోవడానికో కాదు... పుస్తకాల్లో ఉన్న విషయాలను గుర్తు పెట్టుకున్నంత మాత్రాన జీవితం సఫలం కాదు. వాటిని ఆచరించాలి. అన్నిటికన్న ముఖ్యంగా మీలో ఉన్న ఆ దివ్య శక్తితో అనుబంధం ఏర్పరచుకోండి. తద్వారా మీ జీవితం సఫలం అవుతుంది.

వేద వ్యాసుడి లాంటి మహా ఋషులు రచనలు చేయడానికి కారణం ఏమిటి? వాటిని చదవడానికో, గుర్తు పెచ్చుకోవడానికో కాదు... పుస్తకాల్లో ఉన్న విషయాలను గుర్తు పెట్టుకున్నంత మాత్రాన జీవితం సఫలం కాదు. వాటిని ఆచరించాలి.

ప్రేమ్‌రావత్‌

Also Read:

మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?

ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 01 , 2025 | 05:08 AM