Spiritual Lessons: విర్రవీగినవారికి నరకమే
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:11 AM
ఒక మహా నగరంలో ధనవంతుడొకరు ఉన్నాడు. చుట్టూ సేవక జనంతో, నిత్య వైభోగాలతో అతని జీవితం సాగుతూ ఉండేది. అతని విలాసవంతమైన భోజనం బల్ల పైనుంచి జారి పడే ఆహార పదార్థాలు తిని బతకాలని చూసే వ్యక్తి ఒకడు ఉన్నాడు...

దైవమార్గం
ఒక మహా నగరంలో ధనవంతుడొకరు ఉన్నాడు. చుట్టూ సేవక జనంతో, నిత్య వైభోగాలతో అతని జీవితం సాగుతూ ఉండేది. అతని విలాసవంతమైన భోజనం బల్ల పైనుంచి జారి పడే ఆహార పదార్థాలు తిని బతకాలని చూసే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆ నిరుపేద పేరు లాజరు. చినిగిన దుస్తులు, బక్కచిక్కిన దేహం, దాని నిండా గాయాలు, వాటిని నాకాలని అతని మీద ఎగబడే కుక్కలు. కానీ అతను ఎప్పుడూ తను లేనివాణ్ణని బాధపడడం కానీ, ఉన్నవాళ్ళను ద్వేషించడం కాని ఎరుగడు.
కొన్నాళ్ళకు లాజరు చనిపోయాడు. అతణ్ణి దేవదూతలు పరిశుద్ధుల లోకానికి తీసుకువెళ్ళారు. దివ్య పురుషుడైన అబ్రహం చెంతన ఉంచారు. మరి కొన్నాళ్ళకు ధనవంతుడు కూడా మరణించాడు. అతణ్ణి నరకంలో, అగ్ని జ్వాలల మధ్య ఉంచారు. అక్కడ అతను ఎన్నో బాధలు భరిస్తున్నాడు. ఒకసారి అబ్రహం పక్కన కూర్చొని ఉన్న లాజరును ఆ ధనికుడు చూశాడు. ‘‘రక్షించు’’ అని కేకలు వేశాడు. ‘‘దప్పికతో నా నాలుక ఎండిపోయింది. కాబట్టి దయచేసి నా పట్ల కనికరం చూపించు. లాజరును పంపించు’’ అని అభ్యర్థించాడు. అప్పుడు అబ్రహం ‘‘నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. ఎక్కువ సుఖభోగాలను అనుభవించావు. దాని ఫలితంగా ఇప్పుడు కష్టపడుతున్నావు. లాజరు భూలోకంలో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించి, ఇప్పుడు సుఖపడుతున్నాడు. ప్రతి వ్యక్తి తన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు’’ అన్నాడు. ధనవంతుడు ఎంతో బాధపడ్డాడు. తాను దేవుణ్ణి మరచి... అక్రమ కార్యాలు చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు.
సిరిసంపదలు ఉన్నాయని విర్రవీగుతూ, కన్నూ మిన్నూ కానకుండా, పక్కవారిని ఈసడించే అహంకారులకు ఈ కథలో ఒక పెద్ద హెచ్చరిక ప్రతిధ్వనిస్తోంది. ఉన్నవాడు లేనివాడికి సాయపడాలి. సంపాదించడమే కాదు, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం కూడా తెలియాలి. దానశీలత ఒక మహాకళ. ఎప్పుడైనా ఏదైనా మనం ఒకరికి ఇస్తేనే దేవుడు మనకూ ఇస్తాడు. ఇవ్వడానికి సంపదే అక్కరలేదు, ఇవ్వగలిగేవి ఇంకా చాలా ఉన్నాయి. సంపాదించడం నేరం కాదు కానీ... అవసరాల్లో ఉన్న ఇతరులను ఆదుకోవాలి అనేది ఈ కథలోని సారాంశం.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
ఉన్నవాడు లేనివాడికి సాయపడాలి. సంపాదించడమే కాదు, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం కూడా తెలియాలి. దానశీలత ఒక మహాకళ. ఎప్పుడైనా ఏదైనా మనం ఒకరికి ఇస్తేనే దేవుడు మనకూ ఇస్తాడు. ఇవ్వడానికి సంపదే అక్కరలేదు, ఇవ్వగలిగేవి ఇంకా చాలా ఉన్నాయి.
Also Read:
మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?
ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు
For More Andhra Pradesh News and Telugu News..