Share News

Marriage values: గౌరీ శంకరుల కథ వధూవరులకు పాఠం

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:24 AM

గౌరీ శంకరుల కథ... వధూవరులకు పాఠం ఏ పురాణాన్ని విన్నా, వినిపించినా, చదివినా, చదివించినా... ఆ కథలో దాగిన అంతరార్థాన్ని తెలుసుకోవాలి. దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. తప్పకుండా అన్వయించుకోవలసిన కథలు కొన్ని...

Marriage values: గౌరీ శంకరుల కథ వధూవరులకు పాఠం

విశేషం

ఏ పురాణాన్ని విన్నా, వినిపించినా, చదివినా, చదివించినా... ఆ కథలో దాగిన అంతరార్థాన్ని తెలుసుకోవాలి. దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. తప్పకుండా అన్వయించుకోవలసిన కథలు కొన్ని ఉన్నాయి. వాటిలో గౌరీ శంకరుల కథ ఒకటి.

తపస్సు చేస్తున్న గౌరీ దేవి దగ్గరకు శంకరుడు మాయా బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. గౌరి పక్కనే ఉన్న చెలికత్తె అతణ్ణి చూసి ‘‘ నువ్వెరు? దేనికోసం వచ్చావు?’’ అని అడిగింది. ‘‘ఏం లేదు! ఈమె ఇంత కఠోరమైన తపస్సు చేస్తోంది కదా? దేనికోసం?’’ అని అడిగాడు.‘‘శంకరుణ్ణి పతిగా పొందడం కోసం’’ అని ఆమె చెప్పింది.

అతను బిగ్గరగా నవ్వుతూ ‘‘ఇదేం పిచ్చితనం? తన తల్లితండ్రులెవరో ఆ శంకరుడికే తెలీదు. ఏదైనా పొరపొచ్చెం వస్తే అటువైపు నుంచి ఆమెకు దిక్కెవరు? పోనీ... ఉండేందుకు ఇల్లుందా? అంటే... శ్మశానం ఆయన నివాస స్థలం. చుట్టపక్కాలు ఎవరైనా వచ్చి పోతూ ఉంటారా? అంటే... వచ్చేవాళ్ళందరూ ఏడుస్తూ వస్తారు, దిగాలుగా వెళ్తూ ఉంటారు. మరెప్పుడూ ఇక్కడకు రాకుండా ఉంటే బాగుండుననుకుంటారు. అతని ఇంటికి (నివాసానికి) వెళ్ళే మార్గాన్ని చూద్దామా? ఆ దారి మొత్తం చనిపోయిన వ్యక్తుల తాలూకు వారి తలలు గొరిగిన వెంట్రుకలతో, తడిపేసిన వస్త్రాలతో ఉంటుంది. ఇంతకూ అందంగా ఉంటాడా? అంటే ఒళ్ళంతా శ్మశానంలోని భస్మపు పూతే. మెడలో ఆభరణాలంటావా? పుర్రెలు లేదా లావులావుగా, కఠినంగా ఉండే రుద్రాక్షలూను. విలువైన వస్త్రాలున్నాయనుకుంటున్నావేమో? ఆయనకు ఉన్నది రెండే రెండు... అంటే వస్త్రాల జత. ఒకటి రక్తపు బొట్లు ఓడుతూ ఉండే ఏనుగు చర్మం (గజాజినం శోణిత బిందు వర్షి), మరొకటి బరువైన పులిచర్మం. వివాహం అయ్యాక కౌగిలించుకుంటే.. ఆ శ్మశాన భస్మం... చందనపు పూతతో ఉన్న ఆమె శరీరానికి అంటుకుంటుంది. చక్కని పుష్పాలను కొప్పునిండా ధరించే ఆమె అందానికి... ఆయన బిరుసైన, ఏనాడూ తలంటి లాంటి సంస్కారం లేని కురులు, పైగా దాదాపు పాదాల వరకూ ఉండే జటాజూటం... వెగటుగా అనిపించదా మరి? అన్నిటికీ మించి... చూడ్డానికి అదోలా అనిపించేలా ఈయనకు మూడు కళ్ళు ఉంటాయి. చక్కని భోజనాన్ని అత్తింట్లో ఆరగిద్దామనుకుంటున్నదేమో ఆ వెర్రిది! ప్రతిరోజూ భిక్షాటనం చేసుకొని వచ్చి, దానితోనే సంతృప్తి పడతాడు. ఆమె గనుక వివాహం చేసుకున్నదనుకో... ఏదైనా మిగిలితే పెడతాడు, లేదంటే పస్తే మరి! చక్కని అన్న పాత్ర ఉందనుకోకు, పుర్రెలో తినాల్సి వస్తుంది. ముందే గమనించుకోవాలని చెప్పు. అతని కళ్ళలోనైనా అందం ఉందా? అవి నిత్యం కోపంతో (రుద్రః) ఎర్రగా రక్తం గడ్డకట్టినట్టు ఉంటాయి. ఏం ఆనందిస్తుందంటావ్‌ పెళ్ళి చేసుకొని?...’’ అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు.


సనాతనుడు, లయకారుడు

అతని మాటలన్నిటినీ వింటున్న గౌరి తన చెలికత్తెతో... ‘‘అతణ్ణి వెళ్ళిపొమ్మను. గొప్పవాళ్ళ గొప్పతనం తెలియకుండా.. ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు... అలా నిందించిన పాపంలో కొంత భాగం వింటున్న మనకు కూడా వస్తుంది’’ అని అంది. తరువాత అతనితో ‘‘ఓ బ్రహ్మచారీ! శంకరుడి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది సరికాదు. ఇంద్రుడంతటివాడు ఆయన వస్తూ ఉంటే... ఐరావతాన్ని దిగి నమస్కరించి వెళ్తాడు. ఆయనకు ఉన్న మూడో కన్ను... జ్ఞాననేత్రం తప్ప అంగవైకల్య సూచకం కాదు. ఆయనకి తల్లితండ్రులు లేకపోవడం కాదు... ఆయన ఎవరికీ అంతుపట్టనంత సనాతనుడు (ప్రాచీనుడు). ఆయన లయకారుడు. కాబట్టి ఆ సమయంలో శ్మశానమే ఆయన కార్యస్థలం. అందుకే అక్కడ ఉంటాడు. తమవారు మరణించిన సందర్భంగా ఎవరికైనా అశుచి (అంటు, మైలు) వస్తే... ఆ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక శుద్ధి జరిగేది ఆయన ఆలయంలో రాత్రి నిద్ర చేసిన తరువాతే! ఇలా ఎన్నని చెప్పను? వ్యతిరేకించాలనే దృక్పథంతో ఉన్నవాడికి ఎన్ని చెప్పినా ఒక్కటే!’’ అంటూ ‘‘అతణ్ణి పొమ్మను’’ అని గౌరి గద్దిస్తూ తన చెలికత్తెతో చెప్పింది. ఎప్పుడైతే తన సమక్షంలోనే తన గొప్పదనాన్ని గురించి శైలజ వివరించిందో... వెంటనే శంకరుడు తన నిజరూపాన్ని చూపించాడు. ఆమె చేతిని పట్టుకున్నాడు (చేపట్టడం అంటే వివాహాంగీకార సూచకం కదా). అంతేకాదు... ‘‘తవాస్మి దాసః... నీకు శాశ్వతంగా దాసుణ్ణి’’ అని కూడా అన్నాడు.


అలాంటి వరుడు ఆయనొక్కడే!

ఈ మంగళ గౌరి కథ ద్వారా తెలుసుకోవలసిన విశేషాలు అనేకం ఉన్నాయి. పెళ్ళికి ముందు ఏ వరుడైనా తను చేసుకోబోయే వధువుకు కొన్ని ఎచ్చులు (అతిశయాలు) చెబుతాడు. తన గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పుకొన్న వరుడు శంకరుడొక్కడే! ఇలాంటి ఎచ్చుల కారణంగానే ఈ రోజుల్లో ఎన్నో సంసారాలు అనతికాలంలోనే కూలిపోతున్నాయి. లేదా ‘‘అప్పుడలా చెప్పావా? లేదా? ఎందుకలా చెప్పి నన్ను మోసగించావ్‌?’’ లాంటి దెప్పుళ్ళతో, నిత్య కలహాలతో కొన్ని సంసారాలు సాగుతున్నాయి. కాబట్టి సుఖంగా కాపురం చేసుకోదలచిన వరులు నిజాన్ని నిజంగానే చెప్పుకోవాలి లేదా చెప్పించాలి. ఒకవేళ వరుడు లేదా వధువు అలాంటివి చెబితే.. అది సరికాదని తల్లితండ్రులు మందలించాలి. పొరపాట్లను అంగీకరిస్తూ నిజాన్ని చెప్పి తీరాలి. రెండోది... శంకరుడు ఆమెను తాను తపస్సు చేసుకుంటున్న కాలంలో చూశాడు. అప్పుడు ఆమె చాలా సౌందర్యవతి. కఠోరమైన తపస్సు కారణంగా ఆమె గౌర వర్ణంలోకి మారింది. అయినా శంకరుడు ‘ఆనాడు ఉన్న అందం లేదు కదా? మరొక ఆమెను చూసుకుందాం’ అనుకోలేదు. ఆమె శరీరం రంగు మారినంత మాత్రాన తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నేటి కాలపు వరులు దీన్ని నేర్చుకోవాలి. శరీరచ్ఛాయ అనేది శాశ్వతం కాదు. ఏ గాయంతోనో, మనోవేదనతోనో రూపంలో మార్పు రావచ్చు. అందమే శాశ్వతం అనుకుంటూ... అదే ప్రాతిపదిక మీద వివాహ నిర్ణయం సరికాదు. అలాగే ఆదాయానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఉద్యోగం ఏ క్షణంలో పోతుందో తెలియదు... నేటి కాలంలో ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. మంచి ఆస్తి ఉన్నా... పెద్ద దూది గుట్టను దగ్ధం చెయ్యడానికి చిన్న నిప్పురవ్వ చాలన్నట్టు... ఒక్క వ్యసనం లేదా వెనుకటి రుణం ఉంటే చాలు... ఐశ్వర్యమంతా హుళక్కే కదా!

డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు

9866700425

పెళ్ళికి ముందు ఏ వరుడైనా తను చేసుకోబోయే వధువుకు కొన్ని ఎచ్చులు (అతిశయాలు) చెబుతాడు. తన గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పుకొన్న వరుడు శంకరుడొక్కడే! ఇలాంటి ఎచ్చుల కారణంగానే ఈ రోజుల్లో ఎన్నో సంసారాలు అనతికాలంలోనే కూలిపోతున్నాయి. కాబట్టి సుఖంగా కాపురం చేసుకోదలచిన వరులు నిజాన్ని నిజంగానే చెప్పుకోవాలి లేదా చెప్పించాలి.

Also Read:

మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?

ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 01 , 2025 | 05:24 AM