Share News

Hanuman Worship with Tamala Leaves: ఆంజనేయుడికి ఆకుపూజ ఎందుకు చేస్తారు

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:18 AM

ఆంజనేయుడు జ్యోతి స్వరూపుడు. ఆయనను పూజిస్తే కష్టాలు, అవరోధాలు తొలగిపోతాయని, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందని నమ్మకం ఉంది. అందుకే ప్రతి మంగళవారం, శనివారం ఆయనకు ప్రత్యేక పూజలు...

Hanuman Worship with Tamala Leaves: ఆంజనేయుడికి ఆకుపూజ ఎందుకు చేస్తారు

తెలుసుకుందాం

ఆంజనేయుడు జ్యోతి స్వరూపుడు. ఆయనను పూజిస్తే కష్టాలు, అవరోధాలు తొలగిపోతాయని, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందని నమ్మకం ఉంది. అందుకే ప్రతి మంగళవారం, శనివారం ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమంతుడికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో పూజ చేసి, మాలవేసి అలంకరిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. ఆయనకు తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారో తెలిపే కథలు కొన్ని ఉన్నాయి.

ఒక కథ ప్రకారం... రావణుడు మాయలేడిని పంపి సీతమ్మను అపహరించడంతో... శ్రీరాముడు ఆమె కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఆ అన్వేషణలో సాయపడిన ఆంజనేయుడు నూరు యోజనాల నిడివి ఉన్న సముద్రాన్ని దాటి... లంకలోని అశోకవనాన్ని చేరుకున్నాడు. సీతమ్మను దర్శించిన తరువాత... ఆ సంగతి శ్రీరాముడికి చెప్పాలని బయలుదేరాడు. అప్పుడు సీతమ్మ ఆయనను ఆశీర్వదించాలనుకుంది. ఆ వనంలోని పువ్వులు చేతికి అందకపోవడంతో... అందుబాటులో ఉన్న తమలపాకును కోసి, దాన్ని ఆంజనేయుడి తలపై ఉంచి దీవించింది. అందుకే ఆయనకు తమలపాకు ప్రీతిపాత్రమైందని చెబుతారు. సీతమ్మ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరిన ఆంజనేయుడు... ఆకాశమార్గంలో పయనిస్తూ హూంకరించాడు. అది విన్న వానరులకు... ఆయన సీతమ్మ జాడ తెలుసుకొనే వస్తున్నాడని అర్థమైంది. ఆయన రాగానే వారు తమలపాకు తీగలతో సత్కరించారు. దానికి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కాబట్టి తమలపాకు మాల వేస్తే స్వామి పరమానందం చెంది, దీవెనలు పుష్కలంగా అందిస్తాడని ప్రజల నమ్మకం.


మరో కథనం ప్రకారం... ఒకసారి సీతమ్మతల్లి అందిస్తున్న తమలపాకు చిలకలను శ్రీరాముడు సేవిస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆంజనేయుడు ‘‘స్వామీ! ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది?’’ అని అడిగాడు. ‘‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు, ఇది ఆరోగ్యానికి చాలామంచిది’’ అని చెప్పాడు శ్రీరాముడు. వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళి... తన శరీరమంతా తమలపాకులు కట్టుకొని, నర్తిస్తూ ఆనందించాడు. అప్పటి నుంచి ఆయన ఎక్కువగా తమలపాకు తోటల్లో, అరటి తోటల్లో విహరిస్తాడని ప్రతీతి. ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి తమలపాకులు ఆయనకు శాంతిని ఇస్తాయి. అలాగే తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో స్వామిని పూజించి, సుందరకాండ, హనుమాన్‌ చాలీసా పారాయణ చేయడం వల్ల, స్వామికి తమలపాకుల హారాన్ని అలంకరించడం వల్ల మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయని, శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని, నాగదోష శాంతి చేకూరుతుందని, సకల శుభాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని, కార్యాల్లో విజయం లభిస్తుందని పెద్దలు చెప్పారు.

సి.ఎన్‌.మూర్తి

8328143489

Also Read:

మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?

ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 01 , 2025 | 05:18 AM