Share News

Indian Athlete: ఫిగర్‌ స్కేటింగ్‌లో మెరుస్తున్న తార

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:06 AM

ఫిగర్‌ స్కేటింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంది భారత సంతతికి చెందిన తారా ప్రసాద్‌

Indian Athlete: ఫిగర్‌ స్కేటింగ్‌లో మెరుస్తున్న తార

ఫిగర్‌ స్కేటింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంది భారత సంతతికి చెందిన తారా ప్రసాద్‌. జాతీయ పోటీల్లో విజేతగా నిలుస్తూ 2026 వింటర్‌ ఒలింపిక్స్‌ మీద గురి పెట్టిన 25 ఏళ్ల తార ప్రస్థానం ఇది.

డేళ్ల వయసులో మొదటిసారిగా ఐస్‌ రింక్‌ మీద అడుగుపెట్టింది తార. ఆ తర్వాత పదేళ్ల వరకూ ఆ క్రీడను ఒక ఆహ్లాదకరమైన కాలక్షేపంగానే పరిగణించింది. కానీ ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా వేదిక మీద భారత్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదుగుతానని ఊహించలేదు. అమెరికా అయోవాలో పుట్టిన తార 2019లో భారత్‌కు తిరిగొచ్చింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలిచింది. ‘ఇప్పుడు ఈ క్రీడ పట్ల మక్కువ బాగా పెరిగింది. అయితే చిన్నప్పటిలాగే రింక్‌లోకి అడుగుపెట్టి స్కేటింగ్‌ చేయడంలో ఉండే ఆనందాన్ని ఇప్పటికీ ఆస్వాదిస్తూనే ఉన్నాను. కానీ ఈ క్రీడ ద్వారా రాబోయే ఒలింపిక్స్‌లో స్వదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలనే పట్టుదల నాలో పెరిగింది. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాను’ అంటూ ఒక సందర్భంలో వివరించింది.

అథ్లెట్ల కుటుంబం

తారది తమిళనాడుకు చెందిన అథ్లెట్ల కుటుంబం. ఆమె తల్లి కవిత రామస్వామి కూడా ఏడేళ్ల వయసులోనే అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టారు. కవిత తండ్రి, తార తాతయ్య, 87 ఏళ్ల వి.రామస్వామి ఇప్పటికీ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ల్లో పాల్గొంటున్నారు. కవిత కూడా ఇప్పటికీ పరుగు పందేల్లో పాల్గొంటూ ఉంటారు. ‘స్కేటింగ్‌ అంటే రింక్‌ దగ్గరకు వెళ్లడమే కాదు. ఆ క్రీడకుపోషకాహారం, శరీర దారుఢ్యం, మర్దన చికిత్సల్లాంటివి అవసరం. స్కేటింగ్‌ పలు రకాల క్రీడల సమాహారం లాంటిది’ అంటున్నారు తార తల్లి కవిత. ఈమె గతంలో 1990 బీజింగ్‌ ఏసియన్‌ గేమ్స్‌ క్యాంప్‌లో పరుగుల రాణి పి.టి.ఉషతో కలిసి శిక్షణ పొందారు. తార గురించి ప్రస్తావిస్తూ, ‘తార, ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఆ పని అయ్యేదాకా వదిలిపెట్టదు. ఆమె మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఆ వేగాన్ని అందుకుని, ఆమె మనసును అర్థం చేసుకోవడం చాలాకష్టం’ అంటూ వివరించారు.


విమర్శకుల నోళ్లు మూయించి...

భారత దేశానికి తిరిగొచ్చిన ప్రారంభంలో ఆమెకెలాంటి క్రీడా లక్ష్యాలూ లేవు. అప్పటివరకూ సరదా కోసమే స్కేటింగ్‌ చేసేది. కానీ అస్వస్థతతో దీర్ఘకాలం పాటు క్రీడకు దూరమైన తర్వాత, ఫిగర్‌ స్కేటింగ్‌ పట్ల ఆమెకు మక్కువ పెరిగింది. అప్పటికే భారత పౌరసత్వం పొందడంతో, రాబోయే ఒలింపిక్స్‌లో స్వదేశానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకుంది. కానీ పౌరసత్వం పొంది, క్రీడాపరమైన విజయాలు సాధించడం మొదలుపెట్టిన తర్వాత, సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ‘ఆసియ గేమ్స్‌తో పాటు నాలుగు ఖండాల పోటీల్లో పాల్గొన్న తర్వాత, ఆన్‌లైన్‌లో నా మీద నిందలు మొదలయ్యాయి. అయితే అవన్నీ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని నేను అనుకోవడం లేదు. వింటర్‌ స్పోర్ట్స్‌ పట్ల అందరి ఆసక్తినీ పెంచడానికి అవే విమర్శలు సహాయపడతాయని ఆశిస్తున్నాను. ఆన్‌లైన్‌లో నన్నెంతో మంది అవమానిస్తూ ఉంటారు. చంపుతామని బెదిరిస్తూ ఉంటారు. అయినా నేను బెదరను’ అంటున్న తార ‘సవాళ్లు ఉంటాయని తెలిసీ నేనీ దారిని ఎంచుకున్నాను. కాబట్టి చేతులెత్తేసే ప్రసక్తే లేదు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో విమర్శకుల నోళ్లు మూయించింది.

అదే లక్ష్యం...

ఫిగర్‌ స్కేటింగ్‌లో కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్‌ కీలకమనీ, అవి రెండూ మ్యూజిక్‌ థీమ్‌తో సరితూగేలా చూసుకుంటూ ఉంటాననీ అంటున్న తార, గతంలో పద్మావతి సినిమా సౌండ్‌ ట్రాక్‌తో పాటు, ఎ.ఆర్‌.రెహమాన్‌ అథీరా పాటలకు ప్రదర్శనలిచ్చింది. 2022, 2023, 2025 జాతీయ ఛాంపియన్‌షిప్‌ విజేత అయిన తార, గత ఏడాది స్లొవేనియాలోని అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లో రెండు రజత పతకాలు గెలుచుకుంది. వచ్చే ఏడాది వింటర్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది. ఈ పోటీలకు అర్హత సాధించే ఈవెంట్‌ ఈ సెప్టెంబరులో బీజింగ్‌లో జరగబోతోంది. అయితే అర్హత సాధించినా, సాధించకపోయినా, స్కేటింగ్‌ మాత్రం కచ్చితంగా కొనసాగిస్తాననీ, వ్యక్తిగత లక్ష్యాలు, అన్వేషించవలసినవి కూడా ఎన్నో ఉన్నాయనీ అంటోంది. ఒకవేళ తార వింటర్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందితే, ఈ పోటీల్లో పాల్గొనే అర్హత సాధించిన మొట్టమొదటి భారతీయ ఫిగర్‌ స్కేటర్‌గా గుర్తింపు పొందగలుగుతుంది.


భిన్నాభిరుచులు...

యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడోలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ విద్యార్థి అయిన తార, తన అభిరుచిని ఫిగర్‌ స్కేటింగ్‌కే పరిమితం చేయలేదు. ప్రపంచాన్ని చుట్టిరావడం, సొంత వ్యాపారాన్ని కలిగి ఉండడం, డైమండ్‌ ఫేస్‌ ఆఫ్‌ లాంగ్స్‌ పీక్‌ను అధిరోహించడం, భారత దేశంలో ఫిగర్‌ స్కేటింగ్‌ అభివృద్ధికి సహాయపడడాన్ని తన లక్ష్యాలుగా ప్రకటించుకుంటోంది. స్కేటింగ్‌ తర్వాత తానెక్కువగా ఇష్టపడేది పర్వతారోహణ అనీ, అప్పుడప్పుడూ హైకింగ్‌కు కూడా వెళ్తూ ఉంటాననీ అంటోంది. అలాగే తార స్కేటింగ్‌ కోసం తన దుస్తులను తానే డిజైన్‌ చేసుకుని, కుట్టుకుంటూ ఉంటుంది.

Updated Date - Jul 12 , 2025 | 12:06 AM