Sweatproof Tips: చెమటకు చెదరకుండా
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:13 AM
వేసవి ముంచెత్తే ఉష్ణోగ్రతల్లోనూ మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రైమర్ నుంచి సెట్టింగ్ స్ర్పే వరకు ప్రతి దశలో జాగ్రత్తలు ముఖాన్ని ప్రొఫెషనల్‌గా ఉంచుతాయి

మేకప్
వేసవిలో ఉక్కపోతకు మేకప్ చెదిరిపోతుందనే భయం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి భయాలకు లోను కాకుండా ఉండాలంటే ‘స్వెట్ ప్రూఫ్ మేకప్’ ఎంచుకోవాలి. అందుకోసం...వేసవి ఉక్కపోత, చెమటలతో మస్కారా కారిపోవచ్చు. ఫౌండేషన్ చెదిరిపోవచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే చెమటకు చెదరిన మేకప్ మెలకువలు పాటించాలి.
చల్లని నీళ్లతో: స్వేద రంధ్రాలు కుంచించుకుపోయి, చర్మం నిగనిగలాడాలంటే, చల్ల నీళ్లలో ముఖాన్ని ముంచాలి. మేకప్ ముందు కొన్ని నిమిషాల పాటు గడ్డకట్టే చల్ల నీళ్లలో ముఖాన్ని ముంచి ఉంచి, ఆ తర్వాత మేకప్ వేసుకోవడం మొదలుపెట్టుకోవాలి. అప్పుడు చెమట తగ్గుతుంది
ప్రైమర్‌తో: వాటర్ రెసిస్టెంట్ ప్రైమర్‌తో చర్మపు నూనెల ప్రభావానికి కారిపోకుండా ఉంటుంది. వేసుకున్న మేకప్ చెమటకు కారిపోకుండా నియంత్రించాలంటే, చక్కని మ్యాటిఫైయింగ్ ప్రైమర్‌ను ఎంచుకోవాలి
ఫౌండేషన్: తేలికగా ఉండే సీరమ్ ఫౌండేషన్స్ వేసవికి తగినవి. వీటిని ఉపయోగించుకుంటే మేకప్ ముద్దలుగా ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఆల్ ఇన్ వన్ ఫౌండేషన్ లేదా టింటెడ్ మాయిశ్చరైజర్‌లలో ఏదో ఒకదాన్ని వాడుకోవాలి.
చెదిరిపోకుండా: ఐషాడో, లేదా మస్కారా చెమటకు కారిపోతూ ఉంటుంది. కాబట్టి నీటితో చెక్కుచెదరి ఐ మేక్‌పను ఈ కాలంలో ఎంచుకోవాలి. ఖోల్, జెల్ ఐలైనర్లు, మస్కారాలు, ఐషాడోలు ఈ కోవకు చెందినవే అయి ఉండాలి. స్మడ్జ్ ప్రూఫ్ ఉత్పత్తులు చర్మపు జిడ్డుకు చెక్కుచెదరకుండా ఉంటాయి.
పౌడర్ బ్లష్ వద్దు: చెక్కిళ్ల మీద గులాబీ రంగు బ్లష్ అద్దుకోనిదే మేకప్ పూర్తి కాదు. కానీ చెమటలు ఎక్కువగా పట్టే తత్వం ఉన్నవాళ్లు పౌడర్ బ్లష్‌కు బదులుగా క్రీమ్ బ్లష్ ఎంచుకోవాలి. దీంతో చెక్కిళ్లకు సహజసిద్ధమైన గులాబీ రంగు సమకూరడంతో పాటు, ఈ రంగు చెమటకు కారిపోకుండా కూడా ఉంటుంది.
సెట్టింగ్ స్ర్పే: మేకప్ కరిగిపోకుండా ఉంచే మరొక చిట్కా సెట్టింగ్ స్ర్పే. నాణ్యమైన సెట్టింగ్ స్ర్పేతో మేకప్ ముద్దలు కట్టదు, చెదిరిపోదు. ఈ స్ర్పేలోని దినుసులు చెమటకు అవరోధంగా మారి, వాటర్‌ప్రూఫ్ మేకప్ లుక్‌ను తెచ్చిపెడతాయి. స్ర్పే బాటిల్‌ను ముఖానికి అడుగు దూరంలో ఉంచి ముఖం మీద స్ర్పే చేసుకోవాలి. ఇదే సరైన పద్ధతి.
బ్లాటింగ్ పేపర్: ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎంతో కొంత చెమట ముఖానికి పడుతూనే ఉంటుంది. దీన్ని అద్దుకోవడం కోసం బ్లాటింగ్ పేపర్స్ అందుబాటులో ఉంచుకోవాలి.