Maha Shivaratri: ప్రేమతత్త్వమే పరమేశ్వరుడు
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:57 AM
చాంద్రమానాన్ని అనుసరించి ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు. మాఘ బహుళ చతుర్దశిని మహా శివరాత్రిగా... మహాపర్వంగా జరుపుకొంటారు.

‘శివ’ అనే మాటకు ‘మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత’ అనేవి ప్రధానమైన అర్థాలు. ఇవి ప్రతి ఒక్కరూ కోరుకొనే ప్రయోజనాలు. వాటిని ఆశించి శివుణ్ణి ఆశ్రయించడానికి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి శివరాత్రి అనుకూలమైన రోజు. చాంద్రమానాన్ని అనుసరించి ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు. మాఘ బహుళ చతుర్దశిని మహా శివరాత్రిగా... మహాపర్వంగా జరుపుకొంటారు.
26న మహాశివరాత్రి
శివుడు నిరాకారుడు, అలాగే సాకారుడు కూడా. నికారారుడని చెప్పడానికి లింగం ప్రతీక. అద్భుతమైన శివ తత్త్వాన్ని నిరాకారంగా ఉపాసన చేస్తే... అది లింగోపాసన. సాకారమైన దివ్యమంగళ విగ్రహోపాసనలో చంద్రశేఖరుడిగా, నాగాభరణ భూషితుడిగా, త్రినేత్రుడిగా, నీలకంఠునిగా... ఇలా అనేక రూపాలలో గోచరిస్తాడు. ఇవన్నీ శివచైతన్యాన్ని వ్యక్తం చేస్తాయి. జ్ఞానం, వైరాగ్యం, తపస్సు, అంతర్ముఖత్వం, కరుణ, త్యాగశీలత... ఇవన్నీ సగుణ రూపమైనా, నిర్గుణరూపమైన శివమూర్తిలో ఉండే లక్షణాలు. ‘‘ఆయన పరమ దయాళువు’’ అని సిస్టర్ నివేదిత వర్ణిస్తే... ‘‘శివుణ్ణి ఆరాధించడం అంటే శాంతాన్ని, సమత్వాన్ని, యోగాన్ని, నిరాడంబరతని ఆదర్శంగా భావించడమే. శాశ్వతమైన భారతీయ హృదయానికి సాకారమే శివుడు’’ అన్నారు స్వామి వివేకానంద. అటువంటి విశ్వగురువైన విశ్వనాథుణ్ణి ఆరాధించడానికి అనువైన రోజు... మహా శివరాత్రి. ఈ పర్వదినం గురించి ప్రసిద్ధమైన రెండు కథలు పురాణాల్లో ప్రాచుర్యం పొందాయి. ఒకప్పుడు ప్రళయకాలం ఆసన్నమవుతున్న తరుణంలో... పరాశక్తి అయిన సమస్త సృష్టి బీజాలను పోగు చేసింది, వాటిని తన ఒడిలో భద్రపరచి, పంచాక్షరీ జపం చేస్తూ... ధ్యాన నిమగ్నురాలయింది.
పగలు, రాత్రీ అనేవి లేని ఆ స్థితిలో... ధ్యాన సమాధిలో ఉన్న పరమశివుడు కొంతకాలానికి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న కాత్యాయినిని చూసి విషయం తెలుసుకున్నాడు. ఆమెను సమాధి స్థితి నుంచి మేలుకొలిపి, ఆమె పోగు చేసిన బీజాల నుంచి తిరిగి సృష్టిని ప్రారంభించాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్దశి. ఆమె కోరిక ప్రకారం ఆ రోజు ‘మహా శివరాత్రి’గా ముల్లోకాలలో ప్రాచుర్యం పొందుతుందని వరమిచ్చాడు. మరో కథ ప్రకారం... బ్రహ్మ, విష్ణువుల మధ్య ఆధిపత్యం కోసం వివాదం ఏర్పడి, కలహానికి దారి తీసింది. వారిని ఉపశమింపజేసేందుకు... ఇద్దరి మధ్య అగ్నిలింగంగా శివుడు ఆవిర్భవించాడు. ‘‘పరాశక్తి ఆజ్ఞను అనుసరించి... సృష్టి, స్థితి, లయాలను నిర్వహించడానికి ఆమె ప్రతినిధులుగా మనం ఉన్నాం. మనం కర్తవ్యనిష్టులం మాత్రమే’’ అని సమాధానపరిచాడు. లింగోద్భవమైన ఆ రాత్రి ‘మహా శివరాత్రి’గా ప్రస్తుతి పొందింది.
విశ్వమే ఆయన శరీరం...
శివ స్వరూపాన్ని దర్శిస్తే ఎన్నో అద్భుతాలు గోచరిస్తాయి. జడలో జల తరంగాలు, జ్యోతిర్మండలమైన జటాజూటంలో చంద్రరేఖ, కంఠంలో గరణం... వీటన్నిటినీ గమనిస్తే విశ్వమే శివుని శరీరం అనిపిస్తుంది. ఆయన పంచభూతాత్మకుడు. పైగా చిన్న కుటుంబం. శివపత్ని అన్నపూర్ణమ్మ కన్నతల్లిలా మమకారాన్ని అందిస్తుంది. పెద్ద కుమారుడు గణపతి విఘ్నాలను రూపుమాపడమే కాకుండా, సంపదలను అనుగ్రహిస్తాడు. చిన్న కుమారుడు కుమారస్వామి విజయ కారకుడు. దాంపత్య జీవనానికి శివపార్వతులే ఆదర్శం.. ప్రేమ ధర్మానికి ప్రతీకలైన వారు ఏక శరీరులు, ఆ ముగ్గురి వాహనాలకు పరస్పర వైరం ఉన్నా... వారి సమక్షంలో పరమ మిత్రులుగా మెలుగుతాయి. ఇలా శివతత్త్వాన్ని పరిశీలిస్తే... ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ‘ప్రేమయే శివుడు’ అనేది శైవ సిద్ధాంతం. శివుడంటేనే ప్రేమ తత్త్వం. భక్తితో పిలిస్తే అక్కున చేర్చుకొనే ఆయన భోళా శంకరుడు. సమస్త సంపదలూ ఉన్నా, ఆయనలో నిరాడంబరత, వైరాగ్యం కనిపిస్తాయి. తనను నమ్మినవారికి అడిగినది ఇవ్వడమే తప్ప... ప్రతిఫలం ఆశించడు. క్షీరసాగర మధనంలో హాలాహలం బైటికి రాగానే దేవదానవులు ‘శివా! శివా!’ అని ప్రార్థిస్తూ అక్కడి నుంచి పారిపోయారు. పరమ దయాళువైన శివుడు వచ్చి, అభయం ఇచ్చి ఆదుకున్నాడు. ఆ తరువాత ఎన్నో సంపదలు ఆ మధనంలో నుంచి బయటకు వచ్చాయి. ఆయన ఆ సంపదల జోలికి పోలేదు.
లింగోద్భవ దర్శనం...
శ్రీరాముడి లాంటి పౌరాణిక దివ్య పురుషులే కాదు, సమస్త దేవతలు, ఋషులు... ఇలా అందరూ శివభక్తిపరాయణులే. ఆ స్వామి ఆరాధన అనాది సంప్రదాయంగా వస్తోంది. అందుకే మన దేశంలో మూలమూలలా శివాలయాలు కనిపిస్తాయి. సోమవారాలు, మాస శివరాత్రులు, మహాశివరాత్రి, కార్తికమాసంలో శివారాధనకు భక్తులు తండోపతండాలుగా ఆలయాలను సందర్శిస్తారు. అభిషేకాలు, బిల్వపత్ర పూజలు చేస్తారు. ఉపవాసాలు, జాగరణలు, వ్రతాలు చేస్తారు. శివరాత్రి నాటి లింగోద్భవ వేళకు ఎంతో ప్రత్యేకత ఉంది. పరిశీలించి చూస్తే విశ్వంలోని ప్రతి కదలిక శివచైతన్య విశేషమే. మనలోని సర్వ చైతన్యానికి మూలమైన పరంజ్యోతిని దర్శించే సందర్భం... లింగోద్భవ దర్శనం. దానితోపాటు అభిషేకం, ఉపవాసాలు, జాగరణలు, పంచాక్షరీ మంత్ర జపం.. ఇహ పర సౌఖ్యాలను అందిస్తాయనేది పెద్దల మాట
ఆయపిళ్ళ రాజపాప
ఇవి కూడా చదవండి:
Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News