శుక్స్ భారతంలో అర్జునుడిలాంటి వాడు
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:12 AM
అంతరిక్షం ప్రయోగాలను టీవీలో చూసే వారికి అవి గమ్యం ఎప్పుడు చేరతాయా అనే ఉత్కంఠ ఉంటుంది.. ఆ అంతరిక్ష నౌకలలో ప్రయాణించే వ్యోమగాముల కుటుంబ సభ్యులు ఎంతో ఉద్విగ్నతతో వారు ఎప్పుడు తిరిగి వస్తారా...

అంతరిక్షం ప్రయోగాలను టీవీలో చూసే వారికి అవి గమ్యం ఎప్పుడు చేరతాయా అనే ఉత్కంఠ ఉంటుంది..
ఆ అంతరిక్ష నౌకలలో ప్రయాణించే వ్యోమగాముల కుటుంబ సభ్యులు ఎంతో ఉద్విగ్నతతో వారు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా భార్య కామ్నా పరిస్థితీ అంతే!
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా 14 రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) వెళ్తున్న శుభాన్షు గురించి కామ్నా పంచుకున్న ముచ్చట్లు...
‘‘శుక్స్ (శుభాన్షు శుక్లా ముద్దుపేరు)ను నేను తొలిసారి చూసింది మా స్కూల్లో! మేమిద్దరం మూడో క్లాసు నుంచి కలిసి చదువుకున్నాం. మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం కూడా! చిన్నప్పుడు శుక్స్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాడు. ఎవరితోనైనా మాట్లాడాలంటే సిగ్గుపడేవాడే వాడు. కానీ కాలేజీకి వచ్చే సరికి అతనిలో మార్పు వచ్చింది. ఫైటర్ పైలెట్ అయిన తర్వాత ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా మారాడు. తనకు ఒక కచ్చితమైన రొటీన్ ఉంటుంది. దేనినీ అసాధ్యం అనుకోడు. ‘ఫైడింగ్ నిమో’ చిత్రంలో డోరి అనే పాత్ర ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురయినా- ‘ఈదుతూ పో’ అని చెబుతూ ఉంటుంది. శుక్స్ ఎప్పుడూ ఈ డైలాగ్‌ను చెబుతూ ఉంటాడు. సమస్యలు ఎదురయినప్పుడు పరిష్కారాలను అన్వేషించి ఒడిసిపట్టుకోవటం అతని ప్రత్యేకత! తను దేనికీ భయపడడు. రిస్క్ తీసుకోవటానికి వెనకాడడు. బహుశా అందుకే తను టెస్ట్ పైలెట్ వృత్తిని వదిలేసి అంతరిక్ష నౌకాయానానికి సిద్ధపడ్డాడు. టెస్ట్ పైలెట్స్ ఒక సెకను వ్యవధిలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యోమగాములు అంతరిక్షంలో కళ్లకు కనిపించని అతి సున్నితమైన సూక్ష్మజీవులపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ఒక విధంగా చూస్తే రెండింటికీ ఎలాంటి పోలిక లేదు. కానీ ఈ మార్పును శుక్స్ చాలా సహజంగానే స్వీకరించాడు. నాకు తెలిసిన వారిలో శుక్స్ అత్యంత ధైర్యవంతుడు. తను అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే అంతరిక్ష ప్రయాణానికి వెళ్తున్నానని తెలిసినా తనలో ఏ మాత్రం మార్పు లేదు.
ఐదేళ్ల క్రితం...
2020లో గగన్‌యాన్ కోసం టెస్ట్ పైలెట్స్‌ను దరఖాస్తులు పెట్టుకొమ్మన్నారు. సాధారణంగా భారతీయ వాయుసేనలో టెస్ట్ పైలెట్స్ తక్కువ మందే ఉంటారు. అందువల్ల ఎవరు వ్యోమగామిగా ఎంపిక అయినా- మాకు తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని చాలా ఆనందపడ్డాం. శుక్స్ కూడా దరఖాస్తు చేశాడు. ఎంపిక అయ్యాడు. ఆ రోజు మేము ఊహించుకున్నది ఇప్పుడు వాస్తవ రూపం అవుతోందంటే చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాతి కాలంలో శుక్స్‌తో పాటు వ్యోమగాములుగా శిక్షణ పొందిన ముగ్గురు కూడా మాకు మంచి స్నేహితులు అయ్యారు. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ అనుభవాలు వారందరినీ మరింత దగ్గర చేస్తాయనుకుంటున్నా! ఇక్కడ మా అబ్బాయి సిడ్‌కు.. శుక్స్‌కు మధ్య ఉన్న అనుబంధం కూడా చెప్పాలి. తను టెస్ట్ పైలెట్ అవటంవల్ల ఎక్కువ సమయం సిడ్‌తో గడపలేకపోయాడు. కానీ సమయం దొరికినప్పుడల్లా సిడ్‌తో ఉండటానికే తను ఇష్టపడతాడు. గత ఐదేళ్లుగా భారతంలో అర్జునుడిలా శుక్స్ దృష్టి అంతా తన లక్ష్యంపైనే ఉంది. అందువల్ల సిడ్‌తో ఎక్కువ గడపలేకపోయాడు. సిడ్ చాలా చిన్నవాడు. వాడికి ఏం జరుగుతోందో తెలియదు. అందరి నాన్నలు వ్యోమగాములే అనుకుంటున్నాడు. ఈ మధ్య మేము అమెరికాలో నాసా అంతరిక్షకేంద్రానికి వెళ్లాం. అక్కడ రాకెట్లు, వ్యోమగాములు వేసుకొనే సూట్లు మొదలైన వాటిని చూసి చాలా ఉత్సాహపడ్డాడు. కానీ- ‘నీకు నాసాలో ఏం నచ్చింది?’ అని అడిగితే- ‘‘నాసా పార్కులో జింకలు చాలా బావున్నాయి’ అన్నాడు. దీని ఆధారంగా వాడి మానసిక పరిస్థితి మనం అర్ధం చేసుకోవచ్చు.
ఎప్పుడూ వెళ్లలేదు..
తన టెస్ట్ ఫ్లైట్ టేకా్‌ఫ్సను చూడటానికి నేను ఎప్పుడూ వెళ్లలేదు. నేను చూడను కాబట్టి వాటి గురించి ఆలోచించను. ఇప్పుడు యాక్సియం-4 లాంచ్ గురించి కూడా నేను ఆలోచించటం లేదు. అంతా సజావుగా సాగిపోతుందని ఆశిస్తున్నాను. రిస్క్ చేయకుండా మనకు జీవితంలో గొప్ప విజయాలు లభించవు. సాహసవంతులకే కీర్తి లభిస్తుంది.. శుక్స్ నాకు దూరంగా ఉన్న సమయంలో నా ముందు రెండే మార్గాలుండేవి. ఒకటి ఆందోళన చెంది బాధపడుతూ ఉండటం. రెండోది తన విజయాలను చూసి ఉత్సాహంగా ఉండటం. అప్పుడు నేను రెండో మార్గాన్ని ఎంచుకొనేదాన్ని. ప్రస్తుతం కూడా నేను రెండో మార్గానే ఎంచుకున్నా! తను అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని వచ్చే ఉత్కంఠ క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.’’
140 కోట్ల మందికి.. ఒక అద్భుతమైన దేశానికి ప్రాతినిధ్యం వహించే అదృష్టం మీ నాన్నకు వచ్చిందని సిడ్‌కు చెబుతున్నా! వాడు పెద్దవాడైన తర్వాత నాన్నను చూసి గర్వపడతాడు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు సీరియస్..
Read latest AP News And Telugu News