First Rank UPSC: మార్పు కోరే శక్తి
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:09 AM
శక్తి దూబేకు భావోద్వేగాలతో పాటు బలమైన లాజిక్ కలగలిపిన దృక్పథం ఉంది. సామాజిక మార్పును తన అభిప్రాయాలతో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నారు.

‘గోడలకు ఉన్న బీటలు బలహీనతలు కావు... అవి కాంతి లోపలికి రావటానికి కారణాలు’... శక్తి దూబేకు అత్యంత ఇష్టమైన మాటలివి. ఆమె దృష్టిలో బలహీనతలనేవి పరాజయాలకు కారణాలు కావు. కొత్త కొత్త మార్గాలను అన్వేషించటానికి మార్గాలు. ఈ మాటలను గాఢంగా నమ్మిన శక్తి దూబే బుధవారం యూపీఎస్‌సీ విడుదల చేసిన జాబితాలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు.
సాధారణంగా యూపీఎస్‌పీ పరీక్షలో మొదటి ర్యాంకుల్లో నిలిచినవారు ఏళ్ల తరబడి చదువుతూనే ఉంటారని, బయట ప్రపంచాన్ని పట్టించుకోరని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ శక్తి దూబే ప్రస్థానం చూస్తే వారి అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో చదువుతున్న సమయంలో హాస్టల్‌లో స్నేహితులతో కూర్చుని మన చుట్టూ జరిగే అనేక విషయాల గురించి చర్చించటం, అర్ధరాత్రి దూరంగా ఎక్కడో పోలీస్ సైరన్ వినిపిస్తే ‘నాకు ఏం పర్వాలేదు’ అనుకోవటం లాంటి రకరకాల ఘటనలు ఆమెను ముందుకు నడిపించాయి. విజేతగా నిలిచేలా చేశాయి. శక్తి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్. ఆమె తండ్రి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తారు. తల్లి గృహిణి. ప్రయాగ్‌రాజ్‌లో స్కూలు చదువు పూర్తయిన తర్వాత శక్తి వారణాసిలోని బీహెచ్‌యూలో చేరారు. అక్కడ హాస్టల్ వాతావరణం తనకు అనేక పాఠాలు నేర్పిందంంటారు శక్తి. ‘స్టూడెంట్ డిబేటింగ్ కమిటీ’కి నేతృత్వం వహించటంవల్ల ఆమెకు అనేక కొత్త విషయాలు తెలియటం మొదలయింది. ‘‘నాకు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే కోరిక ఉండేది. వాటిని ఎలా మెరుగుపరచాలనే విషయాన్ని ఆలోచించేదాన్ని’’ అంటారు శక్తి.
స్ఫూర్తి అదే...
యూపీఎస్‌సీ పరీక్షలు రాయాలనే స్ఫూర్తి ఇతరులను చూసి వస్తుంది. కుటుంబంలో ఎవరైనా సివిల్ సర్వెంట్స్ ఉంటే వస్తుంది. కానీ శక్తికి మాత్రం క్యాంపస్‌లో రాత్రిళ్లు అదనపు క్లాసులకు వెళ్లివస్తున్నప్పుడు పోలీస్ జీప్ సైరన్ విన్నప్పుడు వచ్చింది. ‘‘దూరంగా ఎక్కడో పోలీస్ పెట్రోల్ వాహనం సైరన్ వింటే నాకు చాలా ధైర్యం కలిగేది. ‘పబ్లిక్ సర్వీస్‌లో ఉంటే ప్రజలకు ఎంతో ధైర్యం ఇవ్వవచ్చు’ అనే ఆలోచన నాలో చాలా ఆలోచనలు రేకెత్తించింది’’ అంటారు శక్తి. ‘‘ఆ ఆలోచన పదేపదే రావడంతో నా కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి మాట్లాడాను. ధైర్యం కలగటం అనేది భావోద్వేగాలకు సంబంధించిన విషయం. కానీ దాని వెనక ఒక బలమైన లాజిక్ ఉంది. ఈ రెండూ కలిసి ఉన్నాయి కాబట్టే యూపీఎస్‌సీ పరీక్షలు రాయాలనుకున్నాను. అమ్మ, నాన్న నాకు అండగా నిలిచారు’’ అన్నారు శక్తి.
ఆ కవితలు...
శక్తికి కవితలు రాయటం ఒక అలవాటు. సాధారణంగా కవయిత్రులు భావోగ్వేదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ శక్తి దానికి పూర్తి విరుద్ధం. తన అభిప్రాయాలను చాలా సూటిగా, స్పష్టంగా చెబుతారు. సామాన్య ప్రజల అవసరాలను పట్టించుకోకుండా చేసే సంస్కరణలవల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనేది ఆమె స్పష్టమైన అభిప్రాయం. ‘‘మన దేశంలో పోలీసు వ్యవస్థ 1861 పోలీస్ చట్టం పరిధిలోనే ఇంకా పని చేస్తోంది. ఆ సమయంలో ఈ చట్టాన్ని ప్రజలను నియంత్రించడానికి ప్రవేశపెట్టారు. సేవ చేయటానికి కాదు. ప్రస్తుతం మన అవసరాలు వేరు. వాటికి తగ్గట్టుగా మారాలి. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు కానిస్టేబుల్ స్థాయి నుంచి మొదలవ్వాలి. ఉన్నతాధికారుల నుంచి కాదు’’ అంటారు శక్తి. యూనిఫాం సివిల్‌కోడ్ విషయంలో కూడా ఆమెకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ‘‘యూపీ విషయాన్నే తీసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. యూనిఫాం సివిల్ కోడ్‌వల్ల మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి. గృహ హింస, కట్నాల కోసం వేధింపులు తగ్గుతాయి’’ అంటారామె. అయితే దీనిని అమలు చేయటం అంత సులభం కాదనే విషయం కూడా శక్తికి తెలుసు.
‘‘ఒకేసారి యూనిఫాం సివిల్‌కోడ్‌ను అమలు చేస్తే విమర్శలు, వ్యతిరేకత రావచ్చు. అందరి అభిప్రాయాలూ తీసుకొని నిదానంగా ప్రవేశపెడితే మంచిది’’ అంటారామె. యూపీఎస్‌సీలో ఆమె అంతర్జాతీయ సంబంధాలను ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు. ప్రస్తుత ప్రపంచంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత గురించి ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది. ‘‘పర్యావరణ విషయంలో మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నాం. అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ లాంటివాటికి నేతృత్వం వహిస్తున్నాం’’ అని చెబుతున్నారు శక్తి.
‘‘దూరంగా ఎక్కడో పోలీస్ పెట్రోల్ వాహనం సైరన్ వింటే నాకు చాలా ధైర్యం కలిగేది. ‘పబ్లిక్ సర్వీస్‌లో ఉంటే ప్రజలకు ఎంతో ధైర్యం ఇవ్వవచ్చు’ అనే ఆలోచన నాలో చాలా ఆలోచనలు రేకెత్తించింది.’’
ఇవి కూడా చదవండి
జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..
Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..