Share News

Nehas Fit Life: ఆరోగ్యమే అందం

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:01 AM

నేహా కక్కర్‌ పాటలతోనే కాదు, ఫిట్‌నెస్‌తోనూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. వ్యాయామం, సరికొత్త ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆమె తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది

Nehas Fit Life: ఆరోగ్యమే అందం

సెలబ్‌ ఫిట్‌

ఆమె గాత్రం... సమ్మోహనాస్త్రం. రాగం... సుస్వరాల సంగమం. బాలీవుడ్‌ అగ్రతారలకు ఏమాత్రం తీసిపోని అభిమానగణం. దేశ విదేశీ వేదికలపై తన పాటతో మైమరిపిస్తున్న ప్రముఖ గాయని నేహా కక్కర్‌. గానంతోనే కాకుండా... రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా... ఫ్యాషన్‌ ఐకాన్‌గా... యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది నేహా. ‘మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతున్నది ఏంట’ని అడిగితే... క్రమం తప్పని వ్యాయామం, ఆహారపు అలవాట్లే అంటుంది తడుముకోకుండా.

మొన్నామధ్య ఒక వివాదం... ఆస్ర్టేలియాలోని మెల్‌బోర్న్‌లో కన్సర్ట్‌కు నేహా మూడు గంటలు ఆలస్యంగా వచ్చిందని. ఈ గొడవలో ఇంటా బయట ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నిటినీ మౌనంగా భరించిన నేహా... కార్యక్రమం అయిన కొన్ని రోజులకు అసలు విషయం చెప్పింది... నిర్వాహకులు తనకు, తన బ్యాండ్‌కు అసలు డబ్బులే ఇవ్వలేదని! ‘నేను ఆలస్యంగా వచ్చానంటూ నాపై నిందలు మోపారు. కానీ నాకు గానీ, నా బృందానికి గానీ ఏమైందని ఎవరన్నా అడిగారా? నిర్వాహకులు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పారిపోయారు. నా కోసం వచ్చిన అభిమానులను నిరాశపరచకూడదని ఆ షో నేను ఉచితంగా చేశాను. మాకే కాకుండా సౌండ్‌ సిస్టమ్‌ వారికి కూడా పేమెంట్‌ అందలేదు. దాంతో వారు షో వదిలేసి వెళ్లిపోయారు. ఆఖరి నిమిషంలో నా భర్త రోహన్‌ప్రీత్‌సింగ్‌ తోడ్పాటుతో కన్సర్ట్‌ నిర్వహించగలిగాను. వేదిక మీద మాట్లాడినప్పుడు ఈ విషయాలేవీ నేను చెప్పలేదు.


కారణం... నావల్ల ఎవరికీ నష్టం జరగకూడదని అనుకున్నాను. కానీ ఇప్పుడు అందరూ తప్పు నాదేనంటూ మాట్లాడుతుంటే... ఆ అపవాదు చెరిపేసుకోవడానికే వాస్తవం ఏమిటో చెప్పాను’ అంటూ తన ఆవేదన పంచుకున్న నేహాకు విమర్శలు, ఎత్తిపొడుపులు కొత్తేమీ కాదు. సామాజిక మాధ్యమాల్లో తరచూ ఆమెపై అవాస్తవ కథనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. భర్తతో విడిపోతుందని ఒకసారి... ఆరోగ్యం విషమించిందని మరొకసారి... ఎవరికి ఇష్టంవచ్చినట్టు వారు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే వీటన్నిటినీ పక్కన పెట్టేసి తన పని తాను చేసుకొంటూ వెళుతుంది 36 ఏళ్ల నేహా.

గాయకుల కుటుంబం...

ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్‌లో పుట్టిన నేహా... నాలుగేళ్ల వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టింది. తమ కూతురి ఆసక్తిని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. తనకు మంచి శిక్షణ ఇప్పించాలని ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారు. చిన్న చిన్న వేదికలపై ఆధ్యాత్మిక గీతాలు పాడుతున్న నేహా... పదహారేళ్ల వయసులో అన్నయ్యతో కలిసి ముంబయికి వెళ్లింది. ఆమె అన్న టోనీ, అక్క సోను కక్కర్‌ కూడా గాయకులే. ముంబయి వెళ్లాక 2005లో టీవీ రియాలిటీ షో ‘ఇండియన్‌ ఐడల్‌’ సీజన్‌2లో పోటీపడింది. కానీ ఆరంభంలోనే ఎలిమినేట్‌ అయింది. మూడేళ్ల తరువాత ‘నేహా ద రాక్‌స్టార్‌’ పేరిట తొలి ఆల్బమ్‌ విడుదల చేసింది. అదే ఏడాది సుఖ్విందర్‌సింగ్‌తో కలిసి ‘మీరాబాయ్‌ నాటౌట్‌’లో ‘హై రామా’ గీతం ఆలపించింది. అదే ఆమెకు తొలి సినిమా పాట. ఆ తరువాత తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా పలు పాటలు పాడింది. 2012లో విడుదలైన ‘కాక్‌టైల్‌’లో ‘సెకండ్‌హ్యాండ్‌ జవానీ’ పాట సూపర్‌హిట్‌ కావడంతో నేహా కెరీర్‌ మలుపు తిరిగింది. ఇక్క అక్కడి నుంచి వరుసపెట్టి ఎన్నో హిట్‌ పాటలు ఆలపించింది. ‘ఇండియన్‌ ఐడల్‌’ తదితర రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. వీటితోపాటు దేశవిదేశాల కన్సర్ట్స్‌లో తన గాత్రంతో అలరిస్తోంది.


అభిమానం ‘కోట్లు’ దాటింది...

బాలీవుడ్‌ అగ్ర తారలకు దీటుగా నేహాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.8 కోట్లమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె యూట్యూబ్‌ చానల్‌ను దాదాపు కోటిన్నరమంది సబ్‌స్ర్కైబ్‌ చేశారు. ఫేస్‌బుక్‌, ఇతర మాధ్యమాల్లోని అభిమానగణం దీనికి అదనం. ప్రతి పోస్ట్‌కూ లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు. నటుడు హిమాన్ష్‌ కొహ్లీతో నాలుగేళ్లు ప్రేమాయణం నడిపిన నేహా... అతడిని పెళ్లి చేసుకొంటున్నట్టు కూడా ప్రకటించింది. అయితే కొద్ది రోజుల్లోనే తామిద్దరం విడిపోయామని ట్వీట్‌ చేసింది. 2020లో పంజాబీ సంగీత కళాకారుడు రోహన్‌ప్రీత్‌సింగ్‌ను పెళ్లాడింది. వృత్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా... వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తుంది ఈ గాయని. రోజంతా తనను తాను ఉల్లాసంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంది. ఆహార నియమాలు పాటిస్తుంది. అందుకే కాలం మారుతున్నా... నేహా అందం మాత్రం తరగడంలేదు.


వర్కవుట్‌ ఇలా...

ఎంత పని ఒత్తిడి ఉన్నా అదేపనిగా కుర్చీకి అతుక్కుపోదు నేహా. ముఖ్యంగా తిన్న తరువాత. గంటలతరబడి కూర్చొంటే ఊబకాయంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎన్నో చుట్టుముడతాయని అంటుంది ఈ భామ. ఎప్పుడూ చురుగ్గా, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. దాని కోసం నిత్యం వ్యాయామాలు చేస్తుంది. జిమ్‌కు వెళ్లామా... లేదా అన్నది ఆమెకు ప్రధానం కాదు. వీలైతే ఇంట్లోనే వర్కవుట్స్‌ ముగిస్తుంది. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటుంది.

  • ఉదయం యోగాతో నేహా రోజు మొదలవుతుంది. బరువు తగ్గడానికి యోగా తనకు ఎంతో సహకరించిందని అంటుంది ఆమె. అంతేకాదు... అదనపు కేలరీలు, కొవ్వు కరిగిపోయి, శరీరం నాజూకుగా తయారవుతుంది. అందుకే తన జీవనశైలిలో యోగా లేని రోజంటూ ఉండదని అంటుంది.

  • జాగింగ్‌, రన్నింగ్‌. బరువు తగ్గడానికి ఇది మంచి కార్డియో ఎక్స్‌ర్‌సైజ్‌.

  • ‘వర్కవుట్స్‌ కోసం జిమ్‌ మీద ఆధారపడను. ఎందుకంటే ఎడతెరిపిలేని షెడ్యూల్స్‌వల్ల ఒక్కోసారి జిమ్‌కు వెళ్లడం కుదరకపోవచ్చు. అందుకే నా వ్యాయామాల్లో అధిక శాతం ఇంట్లో చేసేవే ఉంటాయి’ అంటున్న నేహా... అందుకు తగినట్టుగానే తన వర్కవుట్స్‌ను డిజైన్‌ చేసుకుంది.

  • పుష్‌ప్సకు ఎక్కువ సమయం కేటాయిస్తుంది.

  • అధిక బరువుల జోలికి పోదు. డంబెల్స్‌ లాంటి తేలికపాటి బరువు గల వెయిట్స్‌తో సాధన చేస్తుంది.


ఇంటి వంటకే ఓటు...

నేహా నమ్మిన సూత్రం ఇది. అందుకే ఆరోగ్యకరమైన, క్రమశిక్షణగల జీవన శైలికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. తీసుకొనే ఆహారంలో పోషక విలువలు పుష్కలంగా ఉండేలా చూసుకొంటుంది. సాధ్యమైనంతవరకు ఇంటి వంట తినడానికే ప్రయత్నిస్తుంది.

  • రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల మంచి నీళ్లు తాగుతుంది నేహా. అలాగే కొబ్బరి నీళ్లు కూడా తీసుకొంటుంది. ఇవి శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడతాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా ఉంచచడంలో దోహదపడతాయి.

  • పండ్ల రసాలు ఎక్కువగా తాగుతుంది. పార్టీలకు వెళ్లినా జ్యూస్‌లు, మిల్క్‌ షేక్‌లు, సూప్స్‌ లాంటి ఆరోగ్యకరమైన, బలవర్దకమైనవే తీసుకొంటుంది.

  • నేహాకు కాఫీ చాలా ఇష్టం. కానీ అప్పుడప్పుడు మాత్రమే తాగుతుంది. సేంద్రియ ఎరువులతో పండిన ఆహార పదార్థాలనే వంటకు ఉపయోగిస్తుంది.


ఇవి కూడా చదవండి..

Pahalgam Terror Attack: ఉగ్ర 'వేట' మైదలైంది... జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు

Pahalgam Terror Attack: జనసేన మూడు రోజుల సంతాప దినాలు.. జెండాల అవనతం

Pahalgam Terror Attack: ఉగ్రవాదులతో పోరాడిన ఒక్కే ఒక్కడు

Pahalgam Attack: భార్యాపిల్లల కళ్లముందే ఐబీ అధికారిని కాల్చిచంపారు

Updated Date - Apr 24 , 2025 | 12:01 AM