Melodious Farewell to Rao Bala Saraswati Devi : లలిత సంగీత సరస్వతీ సెలవు
ABN , Publish Date - Oct 16 , 2025 | 03:57 AM
లలిత సంగీత సామ్రాజ్ఞి.. తేనెలూరే గళం, కోకిల స్వరంతో ఆణిముత్యాల్లాంటి పాటలను ఆలపించిన తొలితరం సినీ నేపథ్యగాయని.. రావు బాల సరస్వతీదేవి (97) ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం...
లలిత సంగీత సామ్రాజ్ఞి.. తేనెలూరే గళం, కోకిల స్వరంతో ఆణిముత్యాల్లాంటి పాటలను ఆలపించిన తొలితరం సినీ నేపథ్యగాయని.. రావు బాల సరస్వతీదేవి (97) ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మణికొండలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె అసలు పేరు సరస్వతీదేవి. 1937లో వచ్చిన ‘బాలయోగిని’ చిత్రంలో ఆమె పేరును ‘బాల సరస్వతీ దేవి’గా వేశారు. అప్పటి నుంచీ అదే పేరు ఆమెకు స్థిరపడిపోయింది. సరస్వతీ దేవీ తన నాల్గవ ఏటనే స్వస్థలం గుంటూరులో రత్నమహల్ థియేటర్ స్టేజీ మీద పాటలు పాడారు. ఆరో ఏట హెచ్‌ఎంవీ గ్రామ్‌ఫోన్ రికార్డు కంపెనీ ద్వారా సోలోగా పాడి సంగీత ప్రియులను రంజింపజేశారు! దరిమిలా సినిమాల్లో తన అమృత గానంతో తెలుగు సినీ, సంగీత అభిమానుల హృదయాలలో చిరస్థానం సంపాదించుకున్నారు. కోలంక రాజాతో వివాహానంతరం ‘రావు బాల సరస్వతి’గా మారారు. సరస్వతీ దేవి 1929 ఆగస్టు 29న మద్రాసులో.. తన అమ్మమ్మగారింట జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విశాలాక్షి, పార్థసారధి దంపతులు. తండ్రి సొంతూరు గుంటూరు. సుప్రసిద్ధ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత.. అయిన విజయ నిర్మల బాలసరస్వతికి స్వయానా మేనమామ కూతురు. రావు బాల సరస్వతీ దేవి తన తండ్రి ప్రోత్సాహంతో ఆలత్తూర్ సుబ్బయ్య వద్ద కర్ణాటక సంగీతం, ముంబైలోని వసంత దేశాయ్ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. హెచ్‌ఎంవీ వారి రికార్డులు విన్న దర్శకుడు సి.పుల్లయ్య ఆమెకు ‘సతీ అనసూయ’ సినిమాలో అవకాశం ఇచ్చారు. 1936లో ఈ చిత్రం విడుదల కాగా.. పారితోషికంగా ఆమెకు రూ.200 ఇచ్చారు. ‘భాగ్యలక్ష్మి’ చిత్రంలో ‘తిన్నెమీద సిన్నోడా..’ పాటతో నేపథ్య గాయనిగా పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ‘దేవదాసు’, ‘షావుకారు’, ‘చెంచులక్ష్మి’, ‘జయసింహ’, ‘తెనాలి రామకృష్ణ’, ‘స్వప్నసుందరి’, ‘పిచ్చిపుల్లయ్య’ తదితర తెలుగు సినిమాలతో పాటు తమిళ, కన్నడ., సింహళ భాషల్లో రెండువేలకుపైగా పాటలు పాడారు.
ఆమె పాటతోనే ప్రారంభం
మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో 1940లో లలిత సంగీతం బాలసరస్వతి పాటతోనే ప్రారంభమైంది. తర్వాత 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం కూడా ఆమె గాత్రంతోనే శ్రోతలకు పరిచయమైంది. 1940-50లమధ్య కాలంలో ఎస్.రాజేశ్వరరావుతో కలసి ఆమె ఆలపించిన లలిత గీతాలు రేడియో, గ్రామ్‌ఫోన్ రికార్డుల ద్వారా తెలుగునాట మారుమోగాయి. సాలూరి సన్యాసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు వంటి ఎందరో మహానుభావుల గీతాలు ఆమె కంఠంలో కొత్త హొయలు పోయాయంటే అతిశయోక్తి కాదు! మీరాబాయి భక్తిగీతాలకు సినారె తెలుగు అనువాదాలు ఆలపించి శ్రోతల నీరాజనాలు అందుకున్నారామె. హిందీలోనూ పలు భక్తిగీతాలు ఆలపించారు. కోలంక రాజా ప్రద్యుమ్న కృష్ణ సూర్యారావుతో 1944లో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అడపాదడపా పాడుతూ వస్తున్న రావు బాలసరస్వతి.. 1959 నుంచి సినిమాల్లో పాటలు పాడడం పూర్తిగా మానేశారు.
జయలలిత సాయం...
‘సతీ అనసూయ’ చిత్రంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన బాల సరస్వతి.. ‘అపవాదు’, ‘భక్తతుకారాం’, ‘ఇల్లాలు’, మహానంద’ తదితర తెలుగు చలనచిత్రాలలో సహాయనటిగా.. ‘సువర్ణమాల’, ‘రాధిక’ సినిమాలలో కథానాయికగా నటించారు. తమిళంలో ‘భక్తకుచేల’, ‘బాలయోగిని’, ‘తుకారాం’, తిరునీలకంఠన్’తో పాటు ‘దాసెప్పెణ్’ చిత్రంలో ప్రముఖ నటుడు ఎంజీఆర్ సరసన కథానాయిక పాత్ర పోషించారు. భర్త మరణానంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ను కలసి తన కష్టాలను వివరించడంతో, హైదరాబాద్‌కు తరలి రావాల్సిందిగా ఆమెకు సూచించారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయసహకారాలు అందిస్తానని మాటిచ్చారు. అలా 1995లో సరస్వతి కుటుంబంతో సహా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారారు. కానీ.. ఆమె వచ్చిన మూడు నెలలకే ఎన్టీఆర్ మరణించడంతో తమకు సాయం చేసేవారు లేక చాలా అవస్థ పడినట్లు ఓ సందర్భంలో బాలసరస్వతి చెప్పారు. తర్వాత జయలలిత సీఎంగా ఉన్నప్పుడు అన్నా అవార్డుతో సత్కరించడంతో పాటు చెన్నైలో మూడు గదుల ఫ్లాటు, పదిలక్షల రూపాయల నగదును అందించారు. అలాగే ఏపీలోని గత ప్రభుత్వం పది లక్షల రూపాయల నగదుతో లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది. ఇంకా మరెన్నో అవార్డులు, సత్కారాలు ఆమె అందుకున్నారు.

గుర్తింపు తెచ్చిన పాటలు
బాల సరస్వతీ దేవిది మంత్ర స్వరం అని అభిమానులు కీర్తించేవారు. ఆమెది ఎవ్వరికీ అనుకరణ గాని సొంత గొంతుక అని ఆమెను ప్రశంసించేవారు. ‘అందం చూడవయా ఆనందించవయా ’, ‘తానే మారేనా’, ‘ఇంత తెలిసి ఉండి’ (దేవదాసు), ‘ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై’ (పిచ్చి పుల్లయ్య), ‘రారాదో రా చిలక‘ (చిన్న కోడలు), ‘గోపాల కృష్ణుడు’ (రాధిక), ‘ఓ ఊగుదునే ఉయ్యాల’(శాంతి) వంటి సినిమాల్లోని పాటలు ఆమెకు విశేష ఆదరణను తెచ్చిపెట్టాయి. అలానే, ‘ఓ పరదేశీ’, ‘మనసైన చెలి పిలుపు’, ‘మదిలోని మధుర భావం’ వంటివి ఆమె పాడిన హిట్ పాటల్లో మరికొన్ని. ఆహుతి(1951) సినిమాకు మహాకవి శ్రీశ్రీ రాసిన తొలి సినీ గీతం ‘ప్రణయమే పోయేనా బలియైు..’ పాడింది ఆమే. భర్త మరణానంతరం 1974లో.. విజయనిర్మల కోరిక మేరకు ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో ‘పోయిరావమ్మ అత్తవారింటికి అపరంజి బొమ్మ’ అనే అంపకాల పాట పాడారు. ఆదే ఆమె చివరి సినీగీతం. తన 80వ ఏట స్వీయ సంగీత దర్శకత్వంలో కృష్ణుడిపై పలు గీతాలు ఆలపించారు. వాటిని ‘రాధా మాధవం’ సీడీగా తీసుకొచ్చారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు నౌషాద్ బాలసరస్వతి గాత్రానికి ముగ్ధుడై ‘ఉడన్ ఖటోలా’ చిత్రానికి రెండు పాటలు పాడించడం విశేషం. అక్కడి సంగీత దర్శకులకు తన గొంతు నచ్చి ముంబైలో ఉండిపొమ్మన్నారని.. అయితే, తాను అక్కడ ఉంటే వాళ్లకు పాటలు పాడనని లతా మంగేష్కర్ చెప్పడంతో వాళ్లు తనకు క్షమాపణలు చెప్పి పంపేశారని బాల సరస్వతి ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో చెప్పారు.
సినీప్రముఖుల నివాళి..
రావు బాలసరస్వతి భౌతికకాయాన్ని ప్రముఖ సినీనటులు జయసుధ, నరేష్ సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె కుమారులు ఆర్వీఆర్‌కే సూర్యారావు, ఆర్వీకేఎం సూర్యారావులను ఓదార్చారు. బుధవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బాల సరస్వతీ దేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాల సరస్వతి మృతి పట్ల హీరో నందమూరి బాలకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి)
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News