Share News

Skating India: గిన్నిస్‌ రికార్డుల జాన్వీ

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:37 AM

చాలామంది పిల్లలు చేతిలో ఫోన్‌ ఉంటే చాలు సామాజిక మాధ్యమాలు చూస్తూ సమయం వృధా చేస్తారు. కానీ చండీగఢ్‌కు చెందిన జాన్వీ జిందాల్‌ అలా కాదు. యూట్యూబ్‌ వీడియోలు చూసి ఫ్రీస్టైల్‌ స్కేటింగ్‌లో మెలకువలు...

Skating India: గిన్నిస్‌ రికార్డుల జాన్వీ

స్ఫూర్తి

చాలామంది పిల్లలు చేతిలో ఫోన్‌ ఉంటే చాలు సామాజిక మాధ్యమాలు చూస్తూ సమయం వృధా చేస్తారు. కానీ చండీగఢ్‌కు చెందిన జాన్వీ జిందాల్‌ అలా కాదు. యూట్యూబ్‌ వీడియోలు చూసి ఫ్రీస్టైల్‌ స్కేటింగ్‌లో మెలకువలు నేర్చుకుని 17 ఏళ్లకే అయిదు గిన్నిస్‌ రికార్డులు సొంతం చేసుకుంది. అతిచిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన జాన్వీ జర్నీ ఇది!

జాన్వీకి బాల్యం నుంచి చదువుతో పాటే క్రీడలంటే ఇష్టం. దాంతో తరచూ సాహస క్రీడల్లో పాల్గొనేది. అలా చిన్నప్పటి నుంచే స్కేటింగ్‌ మీద మక్కువ పెంచుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో ఎనిమిదేళ్ల వయసులోనే రోలర్‌ స్కేట్స్‌తో సాధన ప్రారంభించింది. ‘రోలర్‌ స్కేట్స్‌ కొనివ్వమని నాన్నను అడిగాను. ఆయన వెంటనే కొనిచ్చారు. తరువాత యూట్యూబ్‌ వీడియోల ద్వారా సొంతంగా మెలకువలు నేర్చుకోవడం ప్రారంభించా. అది చూసి నాన్నే నాకు కోచ్‌గా మారారు’ అని చెబుతోంది జాన్వీ.

ఆమె తండ్రి మునీష్‌ జిందాల్‌ పగలంతా ఉద్యోగం చేసి రాత్రి యూట్యూబ్‌ వీడియోలు చూసి జాన్వీకి మెలకువలు నేర్పేవారు. అలా తండ్రి సాయంతో ఫ్రీస్టైల్‌ స్కేటింగ్‌లో పట్టు సాధించారు ఆమె. 2019లో తొలిసారి జాతీయస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు జాన్వీ జిందాల్‌. 2019లో 57వ జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షి్‌పలో తొలిపతకం గెలుచుకున్నారు. ఆ తరువాత పలు జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు. స్కేటింగ్‌ చేస్తూ ‘భాగ్రా’ నృత్యం చేసిన మొదటి వ్యక్తిగాను జాన్వీ ఘనత సాధించారు. ఈ విన్యాసానికి గాను ఆమెకు 2021 ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌’లో స్థానం దక్కింది. గతేడాది స్కేటింగ్‌లో ఐదు గిన్నిస్‌ రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. ‘పతకాలు గెలిచే కొద్దీ నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చింది. దాంతో సరికొత్త విన్యాసాలు సాధన చేయడం మొదలుపెట్టా.


6-navya.jpg

అయితే ఈ విన్యాసాలు అంత సులభం కాదు. బ్యాలెన్సింగ్‌ కోసం శారీరక దృఢత్వం ఎంతో అవసరం. కాబట్టి వ్యాయామాలు చేస్తాను’ అంటున్నారామె. ప్రస్తుతం జాన్వీ ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్నారు.

కష్టపడితే ఏదైనా సాధ్యమే...

ఇష్టంగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అంటున్నారు జాన్వీ జిందాల్‌. తాను ఫుట్‌పాత్‌ మీద ప్రాక్టీస్‌ చేసేదాన్ననని గుర్తు చేసుకున్నారామె. మొదట్లో ప్రాక్టీస్‌ చేసేటప్పుడు రోజుకు 40-50 సార్లు కిందపడేదాన్నని, అయినా సరే లేచి సాఽధన కొనసాగించానని జ్ఞాపకాలను నెమరువెసుకున్నారు. ఇష్టం, కష్టం.. ఇవి రెండు మనల్ని ఎంతటి ఎత్తులకైనా చేర్చుతాయని చెబుతున్నారామె.

నా లక్ష్యం అదే

‘‘స్కేటింగ్‌లో ఇప్పటికే ఎన్నో జాతీయస్థాయి పతకాలు సాధించా. ఐదు గిన్నిస్‌ రికార్డులు కూడా సొంతం చేసుకున్నా. ఈ రికార్డులను నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నా. ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి స్వర్ణపతకం సాధించాలన్నది నా లక్ష్యం. అయితే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే చాలా ఖర్చవుతుంది. అంత డబ్బు సమకూర్చుకోవడం కూడా పెద్ద సవాలే. ఎన్ని ఇబ్బందులు, సవాళుల ఎదురైనా నా లక్ష్యం సాధించే వరకు విశ్రమించను.’’

ఇవి కూడా చదవండి

రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..

అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..

Updated Date - Jul 31 , 2025 | 01:37 AM