Share News

Overwashing Skin Risks: పదే పదే కడగకూడదా

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:49 AM

శరీరంలోని సున్నితమైన భాగాలను పదేపదే సబ్బుతో కడగడం ఆరోగ్యానికి హానికరం. ముఖం, ముక్కు, కళ్ల చుట్టూ భాగాలు మరియు జననేంద్రియాలను తరచుగా శుభ్రం చేయడం వల్ల చర్మ సమస్యలు మరియు ఇన్ఫెక్షన్లు రావచ్చు.

Overwashing Skin Risks: పదే పదే కడగకూడదా

మన శరీరంలో కొన్ని భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. పరిశుభ్రత పేరుతో వాటిని పదేపదే కడిగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

  • కొంతమంది... జిడ్డుగా ఉందనో మొటిమలు వస్తున్నాయనో ముఖాన్ని పదే పదే సబ్బుతో రుద్ది కడుగుతూ ఉంటారు. దీనివల్ల ముఖం మీద ఉండే సహజ నూనెలు తొలగిపోయి చర్మం పొడిబారుతుంది. ముఖం మృదుత్వాన్ని కోల్పోతుంది. ముఖాన్ని రోజుకు మూడుసార్ల కంటే ఎక్కువగా కడగకూడదు.

  • ముక్కులోపలి భాగాన్ని కూడా ఎక్కువగా శుభ్రం చేయకూడదు. ఇక్కడ.... లోపలికి ప్రవేశించే గాలిని శుభ్రపరచి చుట్టూ తేమగా ఉంచే పొర ఉంటుంది. ముక్కును ఎక్కువగా నీళ్లతో శుభ్రం చేస్తూ ఉంటే ఈ పొర దెబ్బతింటుంది. దీంతో దుమ్ము కణాలు శ్వాస నాళాల్లోకి చేరి తుమ్ములు, దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి.

  • కంటి చుట్టూ నల్లని వలయాలు వచ్చాయని, వేళ్ల మధ్య మురికి చేరిందని ఆ ప్రదేశాలను అతిగా రుద్దకూడదు. ఈ భాగాల్లో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. శుభ్రత పేరుతో మాటిమాటికీ సబ్బుతో కడుగుతూ ఉంటే చర్మం పొరలు బలహీనమై ఇన్ఫెక్షన్లు సోకవచ్చు.

  • జననేంద్రియాలను కూడా సబ్బు లేదా షాంపూతో పదేపదే శుభ్రం చేయకూడదు. అలా చేస్తే ఆ భాగాల్లోని పీహెచ్‌ స్థాయులు దెబ్బతిని దురద, మంట లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

Updated Date - Jun 01 , 2025 | 03:51 AM