Kids Food Guide: పిల్లలకు పోషకాహారం...
ABN , Publish Date - Aug 02 , 2025 | 02:49 AM
పిల్లలకు ఆహారం తినిపించడం అనేది తల్లిదండ్రులకు ఒక సవాల్ అనే చెప్పాలి. వాళ్లు తినేది కొద్ది మాత్రమే

పిల్లలకు ఆహారం తినిపించడం అనేది తల్లిదండ్రులకు ఒక సవాల్ అనే చెప్పాలి. వాళ్లు తినేది కొద్ది మాత్రమే అయినప్పటికీ అందులోనే పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని ఏ విధంగా పెట్టాలో తెలుసుకుందాం...
పెరిగే పిల్లలకు ఎక్కువగా పిండిపదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు అవసరమవుతాయి. కాబట్టి వాళ్లు తినే ఆహారంలో అన్నం, చపాతీ, పరాట, పప్పు, పనీర్, గుడ్లు, మాంసం, నెయ్యి, గింజలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూడాలి. వంటకాల్లో ఉప్పు, కారం, మసాలా పొడులు, ఆవాలు, జీలకర్ర , ధనియాలు, పసుపు లాంటివి తగుమాత్రంలో వాడుతూ ఉండాలి.
పిల్లలకు ఆహారం మీద ఆసక్తి కలిగేలా మాట్లాడుతూ తినిపించాలి. ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్దికొద్దిగా పెడుతూ ఉండాలి. దీనివల్ల పిల్లలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కొంతమంది పిల్లలు భోజనం కంటే అల్పాహారాన్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు చిరుధాన్యాలతో తయారుచేసిన చిరుతిండ్లు, కూరగాయల చిప్స్, గ్రిల్ చేసిన కూరగాయల ముక్కలు పెట్టవచ్చు. కూరగాయలు ఉడికించిన నీళ్లతో సూప్ తయారు చేసి తాగించవచ్చు. మొలకెత్తిన శనగలు, పెసలతో గుగ్గిళ్లు చేసి తినిపించవచ్చు. తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్ పెట్టవచ్చు.
కొంచెం పెద్ద పిల్లల ముందు రకరకాల కూరగాయలను ఉంచి వాటి గురించి వివరిస్తూ ఉండాలి. పిల్లలకు ఇష్టమైన కూరలు, పండ్లు ఏవో అడిగి తెలుసుకోవాలి. కూరగాయలను తరిగేటప్పుడు వాటిని వండేటప్పుడు పిల్లల సహాయం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ వంటకాల మీద ఆసక్తి కలిగి పిల్లలు ఇష్టంగా తింటారు.
బడికి వెళ్లే పిల్లలకు రుచిగా ఉండేలా ఆహారపదార్థాలు తయారు చేయాలి. చూడడానికి ఆకర్షణీయంగా ఉండేలా బాక్సుల్లో సర్దాలి. పిల్లలకు స్వయంగా భోజనం చేయడం నేర్పించాలి. తోటి పిల్లలతో పంచుకుని తినడాన్ని ప్రోత్సహించాలి. రాత్రి సమయంలో పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.