Spiritual awakening: గోశాలుడి పశ్చాత్తాపం
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:15 AM
జైన మతానికి చెందిన తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. వారిలో మక్ఖలి గోశాలుడు ఒకరు. అతను చాలా తెలివైనవాడు. చక్కని మాటకారి. తాను కూడా మహావీరుడిలాంటి తీర్థంకరుడిగా..

సద్బోధ
జైన మతానికి చెందిన తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. వారిలో మక్ఖలి గోశాలుడు ఒకరు. అతను చాలా తెలివైనవాడు. చక్కని మాటకారి. తాను కూడా మహావీరుడిలాంటి తీర్థంకరుడిగా గుర్తింపు పొందాలన్న దురాశ అతనికి కలిగింది. దానికోసం... మహావీరుడు చెబుతున్నవన్నీ తప్పని చాటడానికి ఎన్నో కుట్రలు పన్నాడు. క్రమంగా మహావీరుడు చెప్పే ప్రతిదాన్నీ ప్రత్యక్షంగానే ఖండించడం మొదలుపెట్టాడు.
ఒకసారి మహావీరుడు ఏడు రకాల నరకాల గురించి వివరిస్తున్నాడు. అప్పుడు గోశాలుడు ‘‘కాదు, మహావీరుడికి ఏమీ తెలియదు. నిజానికి ఏడు వందల నరకాలు ఉన్నాయి’’ అన్నాడు. ఇలా తన వాక్చాతుర్యంతో తెలిసినవి, తెలియనివి ఎన్నో చెప్పి... మహావీరుడి శిష్యులలో ఎంతోమందిని గోశాలుడు ఆకర్షించాడు. మహావీరుడి నుంచి వేరుపడి... తనదైన ఒక శాఖను స్థాపించాడు. వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి తన మేధాశక్తిని ఉపయోగించి ఏదైనా చెబితే... దాన్ని నమ్మడానికి వేలమంది ఎప్పడూ సిద్ధంగా ఉంటారు. కేవలం నమ్మడమే కాదు... అతనికి సర్వస్వాన్ని సమర్పించే శిష్యులుగా, భక్తులుగా మారుతారు. అతణ్ణి అనుసరిస్తారు. క్రమంగా అతను కొత్త మతాన్నో, ఉన్న మతంలోని ఒక శాఖనో ఏర్పాటు చేస్తాడు. మక్ఖలి గోశాలుడు చేసిది కూడా అదే!
ఒకసారి గోశాలుడు ఉంటున్న గ్రామానికి మహావీరుడు వచ్చాడు. గోశాలుడు ప్రచారం చేస్తున్న తప్పుడు సిద్ధాంతాలను గురించి చర్చించి, హెచ్చరించడం కోసం అతణ్ణి కలుసుకున్నాడు. ‘‘ఒకప్పుడు నీవు నా శిష్యుడివి కాబట్టి, ప్రేమతో నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి వచ్చాను’’ అన్నాడు మహావీరుడు.
‘‘నీకు శిష్యుడిగా ఉన్న ఆ వ్యక్తి ఎప్పుడో మరణించాడు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నది ఒక తీర్థంకరుడు’’ అని గర్వంగా చెప్పాడు గోశాలుడు. మహావీరుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు.
కొంతకాలం గడిచింది. గోశాలుడిలో క్రమక్రమంగా ఆత్మ పరిశీలన ప్రారంభమయింది. తను ఒక అజ్ఞాని, ఏదీ తెలియకపోయినా తెలిసినట్టు నటించే వంచకుడినని అతనికి తెలిసివచ్చింది. హృదయం బరువెక్కింది. పశ్చాత్తాపం కలిగింది. తన శిష్యులను పిలిచాడు. ‘‘నేను ఇంతవరకూ బోధించినదంతా అసత్యమే. నేను మరణించాక... నా శరీరాన్ని నడి వీధుల వెంట లాక్కొని వెళ్ళండి. వీడొక నయవంచకుడని ప్రకటించండి. నా శరీరం మీద ఉమ్మెయ్యమనండి’’ అని చెప్పాడు. ఆ తరువాత... మారిన మనిషిగా, అహంకారం లేకుండా జీవించాడు.
రాచమడుగు శ్రీనివాసులు
Also Read:
మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?
ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు
For More Andhra Pradesh News and Telugu News..