అచ్చం సూర్యకాంతంలా
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:58 AM
‘‘ఒక అభిరుచి... చిన్నప్పుడే నాలో బలంగా నాటుకుపోయింది. అది మరేదో కాదు... నటించాలన్న తపన. నాకు తెలియకుండానే నాలోని నటుణ్ణి బయటకు తీసే ప్రయత్నం ఎప్పటికప్పుడూ చేస్తూనే ఉన్నాను. బడికి వెళ్లే రోజుల్లో..

అభిరుచి
అలనాటి అరుదైన నటి సూర్యకాంతం.
పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి...
మరెవరికీ సాధ్యంకాదన్న రీతిలో అభినయించి...
తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు.
ఇది దశాబ్దాల కిందటి కథ .
మళ్లీ ఇప్పుడు ఆ నట విన్యాసాన్ని
అనుకరించి... సూర్యకాంతాన్ని మరిపించి...
తెలుగు ప్రేక్షకులను మురిపిస్తోంది...
మంజూష ముక్కవిల్లి. వెండితెరపై నాటి
అపురూప సన్నివేశాలను
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పండించి...
టాలీవుడ్ తారల ప్రశంసలు సైతం అందుకున్న
మంజూషతో ‘నవ్య’ ముచ్చట్లు.
‘‘ఒక అభిరుచి... చిన్నప్పుడే నాలో బలంగా నాటుకుపోయింది. అది మరేదో కాదు... నటించాలన్న తపన. నాకు తెలియకుండానే నాలోని నటుణ్ణి బయటకు తీసే ప్రయత్నం ఎప్పటికప్పుడూ చేస్తూనే ఉన్నాను. బడికి వెళ్లే రోజుల్లో... కాలేజీలో చదివే సమయంలో... అవకాశం దొరికినప్పుడల్లా అలనాటి మేటి తారల్లా అభినయిస్తూ వస్తున్నాను. నటులే కాదు... ఇంట్లోవాళ్లు, సన్నిహితులను అనుకరించడం కూడా నాకు ఒక అలవాటుగా మారిపోయింది. అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు... ఇలా పెద్దవాళ్ల హావభావాలను సరదాగా నాలో పలికిస్తుండేదాన్ని. దాంతోపాటు పాటలు పాడేదాన్ని. డ్యాన్స్ చేసేదాన్ని. చూసినవాళ్లందరూ బాగా ఆస్వాదించేవారు. అభినందించేవారు. వారి పొగడ్తలు నాకు మరింత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేవి. అలా మొదలైంది నా ఈ ప్రయాణం. మా ఊరు భద్రాచలం. నేను అక్కడే పుట్టి పెరిగాను. 2010లో హైదరాబాద్‌లో ఎంబీయే పూర్తయింది.
ఉద్యోగం... పెళ్లి...
డిగ్రీ అవ్వగానే ఓ ఆంగ్ల పత్రికలో ఏడాదిన్నర సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని చేశాను. తరువాత ఆరేళ్లు రేడియో సిటీలో ఉద్యోగం. అక్కడ మార్కెటింగ్‌తో పాటు ప్రకటనలకు వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. అదే సమయంలో నాకు పెళ్లయింది. మావారు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నారు. తన ఉద్యోగ నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లాం. కొన్నాళ్లకు తిరిగి భారత్‌కు వచ్చేశాం. ఆయనకు మంచి ఉద్యోగ అవకాశం రావడంతో 2021లో అమెరికాకు పయనమయ్యాం. ప్రస్తుతం ఇక్కడే నివాసం.
అమెరికా వచ్చాక...
మొదటి నుంచీ అందర్నీ అనుకరించడంవల్ల క్రమంగా నా ఆసక్తి నటన వైపు మళ్లింది. అమెరికా వచ్చాక అనిపించింది... ఒక ప్రయత్నం చేద్దామని. ఒకప్పుడంటే సినిమాలు, టీవీలు మినహా వేరే అవకాశాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల వల్ల మన ప్రతిభ ప్రపంచానికి చూపడానికి అనువైన ఒక చక్కని వేదిక అందుబుటాలో ఉంది కదా. దాని ద్వారా నాలోని నటిని సంతృప్తి పరచాలని అనుకున్నా. చిన్నప్పటి నుంచీ ఇమిటేట్ చేస్తున్నాను కాబట్టి... కంటెంట్ కూడా దానికి సంబంధించే పెట్టాలనుకున్నా. అలా మూడేళ్ల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో నా పేరు మీదనే ఒక చానల్ ప్రారంభించాను.
నిర్మలమ్మ గారి రీల్‌తో...
చదువుకొనే రోజుల్లో డ్రామా, డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. కాలేజీలోనే కాదు... బయటి వేదికలపై కూడా. కానీ ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు. అన్నీ నాకు నేను చూసి నేర్చుకున్నవే. ఇన్‌స్టాలో చిన్న చిన్న వీడియోలు చేసి పెట్టాను కానీ... వాటికి అంత గుర్తింపు రాలేదు. ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’ చిత్రంలో నిర్మలమ్మ గారు నటించిన కోడి సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ బిట్ నేను చేశాను. దానికి మంచి స్పందన వచ్చింది. లక్షల మంది వీక్షించారు. అంతకు మించి షేర్ చేశారు. నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ ఉత్సాహంతో సూర్యకాంతం గారిని అనుకరించే ధైర్యం చేశా.
‘ఏంటి నేను ఇంత లావున్నానా’...
అయితే నాకు బాగా పేరు వచ్చింది మాత్రం సూర్యకాంతం గారి వీడియోతో. రేలంగి గారితో కలిసి ఆమె నటించిన ‘ఏంటి నేను ఇంత లావున్నానా’ సన్నివేశం ఒకటి ప్రయత్నించాను. ఆ రీల్‌కు ఊహించనంత స్పందన లభించింది. సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టింది. నాకు బాగా పేరు వచ్చింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏ వీడియో పెట్టినా లక్షల్లో వ్యూస్. తరువాత ఛాయాదేవి గారిని అనుకరించాను. వాటికీ విపరీతమైన ఆదరణ లభించింది. వాస్తవానికి ఆ సలహా ఇచ్చింది రఘు కుంచె గారు. ‘మీరు ఛాయాదేవి గారి పాత్రలు కూడా ప్రయత్నించండి. బాగా చేస్తారు’ అన్నారు. ఆయన చెప్పాకే ఆవిడవి మొదలుపెట్టాను.
ఐదు వందలకు పైనే...
ఇప్పటివరకు నేను ఐదు వందలకు పైగా వీడియోలు చేశాను. ఇన్‌స్టాలో లక్షన్నర మంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. అత్యధికంగా చూసిన వీడియో సూర్యకాంతం గారిది. దానికి వ్యూస్ రెండు కోట్లు దాటాయి. ఆ తరువాత వరుసలో బ్రహ్మానందం, నిర్మలమ్మ, ఛాయాదేవి గారి వీడియోలు. అన్నీ నా మొబైల్ ఫోన్‌తోనే తీస్తాను. ముందుగా సన్నివేశం ఏంటనేది నిర్ణయించుకొని, ఓ అరగంట సాధన చేసి, నటిస్తాను. ఎడిటింగ్ లాంటివన్నీ నేనే చూసుకొంటాను. ఒక్కో వీడియోకు సగటున ఐదు లక్షల వ్యూస్ వస్తాయి. కాస్ట్యూమ్స్ ఇంట్లో ఉన్నవాటితోనే సరిపెడుతుంటా. అవి కుదరకపోతే షాపింగ్ చేస్తాను. కొన్ని భారత్ నుంచి కూడా తెప్పిస్తుంటాను. ఇక్కడ ఒక్కటే చెప్పదలుచుకున్నాను... సామాజిక మాధ్యమాలవల్ల ప్రతికూలతలు, అలాగే అనుకూలతలు కూడా ఉన్నాయి. దాన్ని మనం ఎలా ఉపయోగించుకొంటామనేది ముఖ్యం. ఒకప్పుడు నేరుగా వెళ్లి వేషాలు అడగాలంటే భయపడేదాన్ని. కానీ రీల్స్ వల్ల నాకు ఆ భయం పోయింది. నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకోగలిగాను. ఇది నాకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. కాస్త గర్వంగానూ అనిపిస్తుంది.’’
హనుమా
మధుర జ్ఞాపకాలెన్నో...
ప్రముఖ నటుడు హర్షవర్ధన్ గారు ఒక ఇంటర్వ్యూలో నా గురించి ప్రత్యేకంగా చెప్పారు. సూర్యకాంతంలా బాగా నటిస్తున్నానని. ఆ వీడియో ఎవరో నాకు పంపించారు. చూసి ఆశ్చర్యపోయాను. ఆయనతో నాకు పరిచయం లేదు. ఒక మెసేజ్ కూడా పంపారు... ‘ఆ బాడీ లాంగ్వేజ్, ఆ వాయిస్ అనుకరణ అంత సులువు కాదు. కానీ మీరు సూర్యకాంతంలా అతికినట్టు చేస్తున్నారు. నేను మీకు పెద్ద అభిమానిని. మా కుటుంబం అంతా కూర్చొని మీ వీడియోలు చూస్తాం’ అని. అలాగే సంగీత దర్శకుడు తమన్ తన ఇన్‌స్టా స్టోరీలో నా వీడియోలు షేర్ చేశారు. చార్మి, అవసరాల శ్రీనివాస్, నందినీరెడ్డి లాంటి పరిశ్రమ ప్రముఖులు అభినందన మెసేజ్‌లు పంపడమే కాదు, వాటిని ఇతర సామాజిక మాధ్యమాల్లో పంచుకొంటున్నారు కూడా. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్‌లు, సినిమాటోగ్రాఫర్‌లు ‘అవకాశం వస్తే సినిమాల్లో నటిస్తారా’ అని అడుగుతున్నారు. తప్పకుండా చేస్తానని వారికి చెప్పాను. నా లక్ష్యం కూడా అదే.
అదే నా బలం...
నేను చిన్నప్పటి నుంచీ సూర్యకాంతం, నిర్మలమ్మ సినిమాలు ఆసక్తిగా చూసేదాన్ని. దాంతో వాళ్ల నటన మీద కొంత అవగాహన వచ్చింది. ప్రత్యేకించి సూర్యకాంతాన్ని అనుకరించడం చాలా కష్టమనేది చాలామంది చెప్పే మాట. ఆవిడ డైలాగ్ డెలివరీ వేగంగా సాగిపోతుంది. డైలాగ్‌కు డైలాగ్‌కు మధ్య విరామం ఉండదు. నటనలో, మాటలో ఫోర్స్ ఉంటుంది. కానీ ఏదీ తెచ్చిపెట్టుకున్నట్టు కాకుండా, ఎంతో సహజంగా అనిపిస్తుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే... నిలుచున్న మనిషి నిలుచున్నట్టే, కదలకుండా డైలాగులు చెప్పేస్తారు. అలా మా ఇంట్లో నాయనమ్మలు, అమ్మమ్మలను చూసేదాన్ని. వాళ్లను అనుకరించడంవల్ల ఇప్పుడు నేను ఇంత బాగా చేయగులుగుతున్నాను. కాంచన, భానుమతి, బ్రహ్మానందం, కొవై సరళ, ఆమని, సౌందర్య తదితరులని కూడా అనుకరిస్తుంటాను. ఎవరినైనా చూస్తే వారి హావభావాలను వెంటనే పట్టేయగలను. అదే నా బలం.
Read latest AP News And Telugu News