Women of Power: స్వశక్తి సంపన్నులు
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:08 AM
స్వశక్తితో ఎదిగిన మహిళలు మీరా కులకర్ణి, డాక్టర్ ప్రతిమా మూర్తి తమ జీవితాలను ఆశాజనక మార్గంలో మలిచారు. ఒకరు లగ్జరీ ఆయుర్వేద బ్రాండ్‌ను స్థాపిస్తే, మరొకరు మానసిక ఆరోగ్య రంగంలో దేశాన్ని మారుస్తున్నారు

నమ్మకమే ఆమె ధైర్యం
పుట్టిన ఊరైన ఢిల్లీలో, ప్రకృతి సౌందర్యంతో అలరాలే సిమ్లాలోని హాస్టల్స్‌లో ఆడుతూ పాడుతూ గడిచిపోయిన రోజుల తరువాత.... కఠినమైన జీవన వాస్తవికత మీరా కులకర్ణి అనుభవంలోకి వచ్చింది. ‘‘దానికి కారణం నేను తీసుకున్న నిర్ణయమే’’ అంటారామె. మీరాను విదేశాల్లో చదివించాలని ఆమె తండ్రి కోరిక. మరోవైపు పెళ్ళి సంబంధం వచ్చింది. ‘‘పుట్టిన దేశాన్ని, కన్నవారిని వదిలేసి... కొత్త చోటుకు వెళ్ళాలనే ఆలోచన నాకు భయంగా అనిపించింది. అందుకే పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే... ‘నాకు ఏమాత్రం తెలియని వ్యక్తిని ఎలా పెళ్ళి చేసుకోగలిగాను? అది నాకు భయంగా ఎందుకు అనిపించలేదు?’ అనే ప్రశ్నకు నా దగ్గర సరైన సమాధానం లేదు’’ అని చెబుతారు మీరా. పెళ్ళయ్యాక... ఢిల్లీ నుంచి వ్యాపారస్తుడైన భర్తతో కలిసి చెన్నైలో కాపురం. కానీ అప్పటికే ఆమె భర్త వ్యాపారం నష్టాల్లో ఉంది. దానికి తోడు అతనికి మద్యపాన వ్యసనం. నాలుగేళ్ళు గడిచాక... భర్త వేధింపులను భరించలేని ఆమె... ఇద్దరు పిల్లలతో మళ్ళీ ఢిల్లీ వచ్చేశారు. చిన్న చిన్న పనులు చేస్తూ, తల్లిదండ్రుల సాయంతో పిల్లల్ని పెంచుతూ, ఒంటరి తల్లిగా మీరా సాగిస్తున్న జీవితం... ఆయుర్వేద సబ్బుల తయారీతో కొత్త మలుపు తిరిగింది.
నమ్మకంతో ధైర్యం చేశాను...
‘‘మన దేశంలో తయారవుతున్న సబ్బుల్లో నాణ్యత లేదని తెలుసుకున్నాక... ప్రాచీన ఆయుర్వేద పద్ధతుల్లో నేనే వాటిని తయారు చేయాలనుకున్నాను. ఋషీకేశ్‌ను ఆయుర్వేదానికి పుట్టినిల్లు అంటారు. అక్కడ నిపుణులను కలిసి... కొన్ని పద్ధతులు తెలుసుకున్నాను. అయితే ఆ పద్ధతుల్లో సబ్బుల తయారీ చాలా ఖరీదైనతా. కానీ ఆ పద్ధతిలో తయారు చేస్తే తప్ప వాటిలో నాణ్యత ఉండదు. మంచి ఉత్పత్తులకు ఆదరణ ఉంటుందని నా నమ్మకం. అందుకే ధైర్యం చేశాను. ప్రయోగాలు కొనసాగించి... కొన్ని సబ్బులు చేశాను. తెలిసిన వారికి, కొన్ని దుకాణాలకు ఇచ్చాను. మెల్లగా మొదలైనా... కొన్నవారే మళ్ళీ మళ్ళీ కొనడం, వారి సిఫార్సుతో కొత్త కస్టమర్లు రావడంతో అమ్మకాలు వేగం అందుకున్నాయి. దాన్ని పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చాలనే ఆలోచన 2000 సంవత్సరంలో వచ్చింది. రెండు లక్షల పెట్టుబడి, ఇద్దరు ఉద్యోగులతో 45 ఏళ్ళ వయసులో ‘ఫారెస్ట్ ఎసెన్షియల్స్’ ప్రారంభించాను’’ అని గుర్తు చేసుకున్నారు మీరా. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆ సంస్థను నడిపిస్తున్నారు.
వారే ప్రచాకర్తలు
గత పాతికేళ్ళలో ‘ఫారెస్ట్ ఎసెన్షియల్స్’ శరవేగంతో విస్తరించింది. ఒక విదేశీ కంపెనీ పెట్టుబడి పెట్టడంతో కొత్త ఉత్పత్తుల తయారీకి వీలు కలిగింది. ఫేషియల్, బాడీ, వెల్‌నెస్... ఇలా పలు విభాగాల్లో కొన్ని పదుల ఉత్పత్తులను మీరా బృందం రూపొందించింది. లగ్జరీ ఆయుర్వేదిక్ బ్రాండ్‌గా ఖ్యాతి సంపాదించింది. దేశంలో ఈ సంస్థకు 130కి పైగా స్టోర్స్ ఉన్నాయి. 120 దేశాలకు వారి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో మీరాకు, అమె బ్రాండ్‌కు పలు పురస్కారాలు లభించాయి. దేశంలో ప్రభావవంతమైన మహిళగా ‘ఫోర్బ్స్’ తదితర జాబితాల్లో మీరా పేరు చోటు చేసుకుంది. ఈ రోజు ఎలాంటి రుణాలు లేని వందల కోట్ల బ్రాండ్‌గా ఆమె సంస్థ నిలిచింది. ‘‘డెబ్భై శాతం తగ్గింపు అంటూ ఊరించే నకిలీ, నాసిరకం ఆయుర్వేద ఉత్పత్తులు మార్కెట్‌లో కుప్పలుతెప్పలుగా కనిపిస్తాయి. అలాంటి జిమ్మికులను మేము ఎప్పుడూ నమ్ముకోలేదు. ప్రకటనలకు ఖర్చు పెట్టం. మా వినియోగదారులే మాకు ప్రచారకర్తలు’’ అంటారు మీరా. ‘ఎసెన్షియల్లీ మీరా’ పేరుతో ఆమె రాసిన ఆత్మకథ మంచి ఆదరణకు నోచుకుంది.
‘డెబ్భై శాతం తగ్గింపు అంటూ ఊరించే నకిలీ, నాసిరకం ఆయుర్వేద ఉత్పత్తులు మార్కెట్‌లో కుప్పలుతెప్పలుగా కనిపిస్తాయి. అలాంటి జిమ్మికులను మేము ఎప్పుడూ నమ్ముకోలేదు'.
మనసు గుట్టు కనిపెడుతూ..
ఎంబీబీఎస్ చెయ్యాలి. డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలి... ఇది ప్రతిమామూర్తి చిన్ననాటి కల. అనుకున్నట్టే బెంగళూరు వైద్య కళాశాలలో సీటు సంపాదించారు. క్రమంగా... ఆలోచనలు, మెదడు మానవులను, వారి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయం మీద ఆసక్తి పెరిగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వెంటనే... ‘నిమ్హాన్స్’ (జాతీయ మానసిక, నరాల విజ్ఞాన సంస్థ)లో డిపీఎం, ఎండీ (సైకలాజికల్ మెడిసిన్) పూర్తి చేశారు. ఆ తరువాత.... బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో సైకలాజికల్ మెడిసిన్‌లో డిప్లమా చేశారు. అప్పట్లో ఆమె ఆసక్తి వేరే వైద్య విభాగం మీదకు మళ్ళితే... దేశం ఒక గొప్ప సైకియాట్రిస్ట్ ను కోల్పోయేదంటారు ఆమె గురించి తెలిసిన వైద్య నిపుణులు. తన రంగంలో అత్యున్నతంగా నిలవడమే కాదు... దేశంలోనే అతి పెద్ద మానసిక ఆరోగ్య సంస్థ ‘నిమ్హాన్స్’’కు డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఆ పదవిని చేపట్టిన రెండో మహిళగా, తొలి మహిళా సైకియాట్రిస్ట్‌గా ఆమె చరిత్రకెక్కారు. 2021లో ఆ బాధ్యతలను ప్రతిమ స్వీకరించిన సమయానికి... దేశం కొవిడ్ కల్లోలంలో ఉంది. ‘‘కొవిడ్ మహమ్మారి ఏదో ఒక మేరకు అందరినీ మానసికంగా ప్రభావితం చేసింది. సరైన వైద్య సాయం అందకపోవడం వల్ల ఆ సమస్యలు కొందరిలో కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నాం’’ అంటారు ప్రతిమ.
జాతీయ సర్వేకి సారథ్యం...
ప్రత్యక్షంగానైనా, జూమ్ లాంటి మాధ్యమాల ద్వారా అయినా... సమస్యలను ఆమె చాలా ఓపికగా వింటారు. సాధ్యమయ్యే పరిష్కారాలు చెబుతారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ అడిక్షన్ మెడిసన్‌కు అధిపతి, సైకియాట్రీ విభాగాధిపతి, ఇప్పుడు డైరెక్టర్... ఇలా తన వృత్తి జీవితంలో ఏ దశలో ఉన్నా ఆమె నిబద్ధతలో మార్పు లేదు. ‘‘నిమ్హాన్స్... కేవలం మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. న్యూరో సర్జరీ, న్యూరాలజీ, న్యూరో రేడియాలజీ లాంటి అనేక అంశాల్లో సేవలు అందించే సంస్థ. నేను చదువుకున్న సంస్థకే డైరెక్టర్ కావడం నా బాధ్యతను మరింత పెంచింది’’ అంటున్నారు ప్రతిమ. కరోనా అనంతరం దేశంలోని మానసిక ఆరోగ్య పరిస్థితుల గురించి మరింత తెలుసుకోవడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ‘నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే’కి ఆమె సారథ్యం వహిస్తున్నారు. ‘‘ఇలాంటి సర్వే మొదటిసారి పదేళ్ళ క్రితం... పన్నెండు రాష్ట్రాల్లో జరిగింది. దేశంలోని ప్రతి పదిమందిలో ఒకరు గుర్తించదగిన మానసిక ఆరోగ్య వైకల్యాలతో బాధపడుతున్నారని, అర్హులైన మానసిక ఆరోగ్య నిపుణుల కొరత ఉందని ఆ సర్వే వెల్లడించింది. రెండవది అయిన తాజా సర్వే వివరాలను వచ్చే ఏడాది ప్రచురిస్తాం. గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో, వలస కార్మికుల్లో కొవిడ్ అనంతర పరిమాణాలను ఈ సర్వేలో ప్రధానంగా అధ్యయనం చేస్తున్నాం’’ అని ఆమె చెబుతున్నారు.
జాతీయ సర్వేకి సారథ్యం...
ప్రత్యక్షంగానైనా, జూమ్ లాంటి మాధ్యమాల ద్వారా అయినా... సమస్యలను ఆమె చాలా ఓపికగా వింటారు. సాధ్యమయ్యే పరిష్కారాలు చెబుతారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ అడిక్షన్ మెడిసన్‌కు అధిపతి, సైకియాట్రీ విభాగాధిపతి, ఇప్పుడు డైరెక్టర్... ఇలా తన వృత్తి జీవితంలో ఏ దశలో ఉన్నా ఆమె నిబద్ధతలో మార్పు లేదు. ‘‘నిమ్హాన్స్... కేవలం మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. న్యూరో సర్జరీ, న్యూరాలజీ, న్యూరో రేడియాలజీ లాంటి అనేక అంశాల్లో సేవలు అందించే సంస్థ. నేను చదువుకున్న సంస్థకే డైరెక్టర్ కావడం నా బాధ్యతను మరింత పెంచింది’’ అంటున్నారు ప్రతిమ. కరోనా అనంతరం దేశంలోని మానసిక ఆరోగ్య పరిస్థితుల గురించి మరింత తెలుసుకోవడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ‘నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే’కి ఆమె సారథ్యం వహిస్తున్నారు. ‘‘ఇలాంటి సర్వే మొదటిసారి పదేళ్ళ క్రితం... పన్నెండు రాష్ట్రాల్లో జరిగింది. దేశంలోని ప్రతి పదిమందిలో ఒకరు గుర్తించదగిన మానసిక ఆరోగ్య వైకల్యాలతో బాధపడుతున్నారని, అర్హులైన మానసిక ఆరోగ్య నిపుణుల కొరత ఉందని ఆ సర్వే వెల్లడించింది. రెండవది అయిన తాజా సర్వే వివరాలను వచ్చే ఏడాది ప్రచురిస్తాం. గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో, వలస కార్మికుల్లో కొవిడ్ అనంతర పరిమాణాలను ఈ సర్వేలో ప్రధానంగా అధ్యయనం చేస్తున్నాం’’ అని ఆమె చెబుతున్నారు.
22 భాషల్లో కౌన్సెలింగ్
‘‘మానసిక వైద్యనిపుణులుగా మహిళల సంఖ్య పెరిగి, నాయకత్వ స్థానాల్లో ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. 1980ల్లో నేను డిప్లమా చేస్తున్నప్పుడు ఒక బ్యాచ్‌లో పదిమంది ఉంటే ఇద్దరే అమ్మాయిలు ఉండేవారు. ఇప్పుడు దాదాపు 40మందిని పోస్ట్ గ్రాడ్యుషన్‌కు తీసుకుంటున్నాం. వారిలో సగానికి పైగా అమ్మాయిలే. ఇది మంచి పరిణామం’’ అంటున్న ప్రతిమ... ‘నిమ్హాన్స్’లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. 2022లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్’కు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ‘‘ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఈ ప్రోగ్రామ్ హెల్ప్‌లైన్ ద్వారా దేశవ్యాప్తంగా 19 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. ప్రతి రాష్ట్రంలో సుశిక్షితులైన కౌన్సెలర్లు.. 22 భాషల్లో వారి ఇబ్బందులు విని, సలహాలు ఇస్తారు’’ అని వివరించారు. ఆమె నేతృత్వంలోనే ‘నిమ్హాన్స్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కిందటి ఏడాది ‘నెల్సన్ మండేలా అవార్డ్ ఫర్ హెల్త్ ’ప్రమోషన్’ లభించింది. వ్యక్తిగతంగా కర్ణాటక ప్రభుత్వం నుంచి ‘డాక్టర్ రాజా రామన్న రాజ్య పురస్కారం’ సహా అనేక గౌరవాలను ప్రతిమ అందుకున్నారు. 300కు పైగా పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘‘వైద్యులు ఉన్నది రోగుల సేవ కోసమే. వారి ఇబ్బందులు తీరే మార్గాలను సూచించాలి. అన్నిటికన్నా వారికి మన పట్ల, మనం అనుసరించే వైద్య పద్ధతుల పట్ల నమ్మకం కలిగించడం ముఖ్యం. నా వృత్తి జీవితంలో నేను కట్టుబడి ఉన్న అంశం అదే’’ అంటున్నారు ప్రతిమ.
"1980ల్లో నేను డిప్లమా చేస్తున్నప్పుడు ఒక బ్యాచ్‌లో పదిమంది ఉంటే ఇద్దరే అమ్మాయిలు ఉండేవారు. ఇప్పుడు 40 మందిని పోస్ట్ గ్రాడ్యుషన్‌కు తీసుకుంటున్నాం. వారిలో సగానికి పైగా అమ్మాయిలే. ఇది మంచి పరిణామం’’
ఇవి కూడా చదవండి..