Natural Remedy: నరాల జబ్బులకు దివ్యౌషధం
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:06 AM
ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్కకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. కొన్ని మొక్కలు పిచ్చిగా కనిపిస్తాయి

ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్కకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. కొన్ని మొక్కలు పిచ్చిగా కనిపిస్తాయి. కానీ వాటి వల్ల కూడా అనేక ప్రయోజనాలుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ‘ఎలుక చెవి ఆకు’ మొక్క. ఈ మొక్క ఆకులు ఎలుక చెవి ఆకారంలో ఉంటాయి. అందువల్ల ఈ మొక్కను సంస్కృతంలో ఖుకర్ణి, మూషిక కర్ణి అని కూడా పిలుస్తూ ఉంటారు. భోజనకుతూహలం గ్రంథం ప్రకారం దీని ఆకులు కారం తీపి రుచులు కలిసి ఉంటాయి. ఇవి కఫాన్ని, పైత్యాన్ని తగ్గిస్తాయి. ఈ ఆకుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను కూడా ఈ గ్రంథంలో పేర్కొన్నారు.
ఈ ఆకులు శరీరంలోపల ఉండే వాపులను తగ్గిస్తాయి. తలనెప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. కడుపులో నులిపురుగులకు ఇది మంచి విరుగుడు. నులిపురుగులు పోతే జీర్ణశక్తి బాగుపడుతుంది.
కొన్ని అటవీ ప్రాంతాల్లో ఈ ఆకులను పాము విషానికి విరుగుడుగా కూడా వాడతారు. పేగుల్లో పెరిగే ఎలికపాములకు విరుగుడుగా ఈ ఆకులను వినియోగిస్తారు.
ఫిట్స్ వంటి నరాల జబ్బులకు ఈ ఆకులు మంచి మందు. రకరకాల మానసిక వ్యాధులకు విరుగుడుగా వీటిని వాడతారు.
మధుమేహ నియంత్రణకు ఈ ఆకుల కషాయం మంచి మందు. ప్రతి రోజు ఈ ఆకుల కషాయం తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
చెవి సమస్యల పరిష్కారానికి ఈ ఆకులు బాగా పనిచేస్తాయి. ఈ ఆకులను దంచి.. దాని నుంచి రసం తీసి.. ఆ రసంతో సరిసమానంగా నువ్వుల నూనె కలిపి.. కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకుంటే.. చెవిలో వచ్చే రకరకాల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌లు తరచుగా వచ్చేవారికి ఈ ఆకులు బాగా పనిచేస్తాయి. ఉబ్బసం, ఆయాసం వంటి వాటికి ఈ ఆకుల కషాయం విరుగుడుగా పనిచేస్తుంది.
-గంగరాజు అరుణాదేవి