Ash Gourd Delights: బూడిద గుమ్మడితో భలే భలేగా
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:13 AM
బూడిద గుమ్మడికాయతో మజ్జిగ పులుసు, ఆవకాయ, కూటు వంటి రుచికరమైన వంటకాలు తయారు చేయవచ్చు. ఈ కాయ ఆరోగ్యానికి మేలు చేసే పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌తో పుష్కలంగా ఉంటుంది

వంటిల్లు
బూడిద గుమ్మడికాయ... అనగానే మనకి కరకరలాడే వడియాలు, తీయని పేఠా గుర్తుకు వస్తాయి. దీనితో రకరకాల కూరలు, కమ్మని పులుసు కూడా చేసుకుంటూ ఉంటాం. ఇవి కాక బూడిద గుమ్మడికాయతో చేసే వెరైటీ వంటకాలు మీ కోసం...
మజ్జిగ పులుసు
కావాల్సిన పదార్థాలు
పెరుగు- రెండు కప్పులు, బూడిద గుమ్మడికాయ ముక్కలు- రెండు కప్పులు, పచ్చి కొబ్బరి ముక్కలు- అర కప్పు, అల్లం ముక్కలు- రెండు చెంచాలు, ధనియాలు- ఒక చెంచా, జీలకర్ర- ఒక చెంచా, మిరియాలు- ఒక చెంచా, పచ్చి మిర్చి- నాలుగు, శనగపిండి- రెండు చెంచాలు, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు, ఇంగువ- చిటికెడు, నూనె- రెండు చెంచాలు, నెయ్యి- ఒక చెంచా, మెంతులు- అర చెంచా, ఆవాలు- పావు చెంచా, ఎండు మిర్చి- రెండు, కొత్తిమీర తరుగు- ఒక చెంచా
తయారీ విధానం
స్టవ్ మీద గిన్నె పెట్టి ధనియాలు, అర చెంచా జీలకర్ర, మిరియాలు వేసి రెండు నిమిషాలపాటు దోరగా వేయించాలి.
మిక్సీలో కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, వేయించిన ధనియాలు-జీలకర్ర-మిరియాలు, పచ్చిమిర్చి, శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని రెండు కప్పుల పెరుగు వేసి బాగా కలపాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికాక అందులో కొబ్బరి-శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని పోసి ఉప్పు వేసి బాగా కలపాలి. మూడు పొంగులు రానిచ్చి స్టవ్ మీద నుంచి దించాలి.
స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి నూనె, నెయ్యి వేసి వేడిచేయాలి. తరవాత ఆవాలు, అర చెంచా జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ తాలింపుని గుమ్మడికాయ ముక్కలు-పెరుగు మిశ్రమంలో వేసి కలపాలి. తరవాత కొత్తిమీర తరుగు చల్లాలి. ఈ బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు అన్నంలోకి రుచిగా ఉంటుంది.
జాగ్రత్తలు
బూడిద గుమ్మడికాయ ముక్కలను మరీ పెద్దగా లేదా మరీ చిన్నగా కోయకూడదు.
కొబ్బరి-శనగపిండి-పెరుగు మిశ్రమం కలిపిన తరవాత పులుసు చిక్కగా ఉందనిపిస్తే మరోగ్లాసు నీళ్లు పోసి చిన్న మంట మీద మరగించాలి.
మజ్జిగ పులుసు చల్లారే కొద్దీ చిక్కగా అవుతుంది. కాబట్టి పలుచగా ఉన్నప్పుడే స్టవ్ మీద నుంచి దించాలి.
శనగపిండికి బదులు బియ్యప్పిండి లేదా కార్న్‌ఫ్లోర్ వాడుకోవచ్చు.
ఆవకాయ
కావాల్సిన పదార్థాలు
బూడిద గుమ్మడికాయ ముక్కలు- మూడు కప్పులు, ఆవపిండి- అర కప్పు, కారం- అర కప్పు, ఉప్పు- పావు కప్పు, నిమ్మకాయలు- రెండు, ఉల్లిపాయ- ఒకటి, నూనె- అయిదు చెంచాలు, ఆవాలు- అర చెంచా, మెంతులు- అరచెంచా, ఇంగువ- చిటికెడు, పసుపు- చిటికెడు
తయారీ విధానం
ఒక గిన్నెలో గుమ్మడి కాయ ముక్కలు, ఒక చెంచా ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి అరగంటసేపు ఉంచాలి. తరవాత ఈ ముక్కలను చేతిలోకి తీసుకుని గట్టిగా నీటిని పిండి వెడల్పాటి గిన్నెలోకి వేయాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆవపిండి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి.
స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు, మెంతులు, ఇంగువ, పసుపు వేసి దోరగా వేపాలి. ఈ తాలింపును గుమ్మడికాయ ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. దీని మీద మూతపెట్టి ఒక పూట ఊరనివ్వాలి. తరవాత ఒకసారి ఉప్పు, పులుపు సరిచూసుకోవాలి. ఈ ఆవకాయ వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.
జాగ్రత్తలు
బూడిద గుమ్మడికాయను వీలైనంత చిన్న ముక్కలుగా తరిగితే ఆవకాయ రుచి బాగుంటుంది. గింజలు తీసివేయాలి. తొక్క తీయనవసరం లేదు.
గుమ్మడికాయ ముక్కలనుంచి పిండిన నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది.
ఈ ఆవకాయ నాలుగు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. కాబట్టి కొద్ది పరిమాణంలో మాత్రమే తయారు చేసుకోవడం మంచిది.
కూటు
కావాల్సిన పదార్థాలు
బూడిద గుమ్మడికాయ ముక్కలు- రెండు కప్పులు, పచ్చి శనగపప్పు- పావు కప్పు, చింతపండు- కొద్దిగా, మినప్పప్పు- ఒక చెంచా, జీలకర్ర- అర చెంచా, ఆవాలు- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, ఎండు మిర్చి- అయిదు, మిరియాలు- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, పచ్చి కొబ్బరి ముక్కలు- పావు కప్పు, నూనె- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు
తయారీ విధానం
ఒక గిన్నెలో పచ్చి శనగపప్పు వేసి బాగా కడిగి నీళ్లు పోసి పావుగంటసేపు నానబెట్టాలి. మరో గిన్నెలో చింతపండును కూడా నానబెట్టి రసం తీసి ఉంచుకోవాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, మిరియాలు వేసి దోరగా వేపాలి. వీటిని మిక్సీ గిన్నెలో వేయాలి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడిచేయాలి. ఇందులో ఆవాలు, ఇంగువ, పసుపు, కరివేపాకు, నానబెట్టిన పచ్చి శనగపప్పు వేసి దోరగా వేపాలి. తరవాత బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలిపి మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. తరవాత మూత తీసి చింతపండు రసం పోసి ఉడికించాలి. పచ్చి శనగపప్పు, గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరవాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్టు, ఉప్పు వేసి కలపాలి. మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే అరగ్లాసు నీళ్లు పోసి కలపాలి. అయిదు నిమిషాల తరవాత కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. కూటు చపాతీ, పుల్కా, అన్నంలోకి బాగుంటుంది.
జాగ్రత్తలు
పచ్చి శనగపప్పుకు బదులు కందిపప్పు లేదా పెసరపప్పు వేసుకోవచ్చు.
ఈ కూటులో ఒక చెంచా నెయ్యి కలిపితే కమ్మగా ఉంటుంది.
బూడిద గుమ్మడికాయలో ఎ, బి, సి, ఇ విటమిన్లతోపాటు ఐరన్, సోడియం, పొటాషియం, కాల్షియం,
జింక్ లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్ అసలు ఉండదు. దీనికి క్షార గుణం ఎక్కువ. అందుకే దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం తగ్గుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బూడిద గుమ్మడికాయలో ఉండే పీచు పదార్థాలు మలబద్దకాన్ని నివారిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. వారానికి రెండు రోజులు దీనిని ఆహారంలో చేర్చుకుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిలో అధిక శాతం నీరు ఉంటుంది కాబట్టి వేసవి తాపాన్ని హరిస్తుంది.