Share News

Deepika Diet Plan: ఆరోగ్యమే అందం..

ABN , Publish Date - Jul 19 , 2025 | 06:08 AM

క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా నా మనసు చెప్పింది వింటాను. ఆ తరువాతే నిర్ణయాలు తీసుకొంటాను

Deepika Diet Plan: ఆరోగ్యమే అందం..

  • వెండితెరపైనే కాదు... నిజ జీవితంలోనూ ఉత్సాహంగా... ఉత్తేజంగా కనిపిస్తుంది దీపికా పదుకోన్‌.

  • ప్రకాష్‌ పదుకోన్‌ వారసురాలిగా బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టినా... ఆ తరువాత సినిమాల మీద మక్కువతో మైదానం వదిలేసింది.

  • నాడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా... నేడు ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ నుంచి తప్పుకున్నా... ఆమె ప్రతి అడుగూ ఒక సంచలనం.

  • ఎనిమిది గంటల పని సమయాన్ని మరోసారి తెరపైకి తెచ్చి... చిత్రసీమలో ఆదాయంతో పాటు ఆరోగ్యకర జీవనానికి ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశాన్ని ఇచ్చింది.

‘క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా నా మనసు చెప్పింది వింటాను. ఆ తరువాతే నిర్ణయాలు తీసుకొంటాను. ఆ నిర్ణయాలకు కట్టుబడే క్రమంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాను. జీవితంలో సమతులంగా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం. అలా ఉండడానికే నేను ప్రాధాన్యత ఇస్తాను’ అంటూ ఆ మధ్య ఓ ఫ్యాషన్‌ షో సందర్భంగా దీపికా పదుకోన్‌ చెప్పుకొచ్చింది. అంతేకాదు... రోజుకు ఎనిమిదికి మించిన పని గంటలు తగదంటూ మరో సందర్భంలో వ్యాఖ్యానించింది. కొంత కాలంగా అటు బాలీవుడ్‌లో... ఇటు సామాజిక మాధ్యమాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. పని గంటలు ఎక్కువగా ఉన్న కారణంగానే దీపిక ఓ బడా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లో పాపకు జన్మనిచ్చిన దీపిక... తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్న సందర్భంగా... ‘ప్రస్తుతం నేను మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇకపై బిడ్డకు తల్లిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే షూటింగ్‌లో పాల్గొనాలి. ఇది ఎప్పుడూ సవాలే’ అంటూ తన అనుభవాలు పంచుకుంది. ఈ కారణంగానే ఆమె పని గంటల విషయంలో రాజీపడడం లేదనేది బాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. కుటుంబంతో సమయాన్ని గడపకపోతే జీవితంలో ఎంత సాధించినా అది విజయం కాదని, నిజాయతీగల దర్శకనిర్మాతలు పని గంటల విషయంలో వ్యతిరేకంగా ఉండరని హిందీ హీరోలు సైఫ్‌ అలీఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ పరోక్షంగా దీపికకు మద్దతు తెలిపారు. వీటికితోడు ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది దీపికతోపాటు మరికొందరి వాదన. ఏదిఏమైనా... పరిశ్రమలోకి వచ్చి ఇన్నేళ్లయినా... బిడ్డకు తల్లి అయినా... నేటికీ దీపికలో అవే మెరుపులు. బిజీ షెడ్యూల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా... గంటల తరబడి కెమెరా ముందు గడిపినా... ముఖంలో చిరునవ్వు చెదరదు. ఉత్సాహం ఇసుమంతైనా తగ్గదు. అందుకు ప్రధాన కారణం... క్రమం తప్పని వ్యాయామం, దృఢమైన ఆరోగ్యమే అంటుంది ఈ బ్యూటీ.


ఆకలి వేసినప్పుడే...

ఇడ్లీ- సాంబార్‌, ఉప్మా, దాల్‌ రైస్‌ తదితర దక్షిణాది వంటకాలు దీపిక మెనూలో కచ్చితంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే తెప్పించుకుంటుంది. అలాగే చైనీస్‌ ఫాస్ట్‌ ఫుడ్స్‌ కూడా. డార్క్‌ చాక్లెట్‌, సేవ్‌ పూరీ బాగా ఇష్టం. రెండు గంటలకు ఒకసారి... అలా రోజుకు ఆరుసార్లు ఆహారం తీసుకుంటుంది. దీపిక... నచ్చింది తినేస్తుంది. కాకపోతే మితంగా. అందులో పోషక

విలువలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటుంది. ‘కంటికి నచ్చిందని కాకుండా... ఆకలి వేసినప్పుడు కడుపుకు సరిపడానే తినాలి. అతిగా తినకూడదు’ అంటుంది దీపిక.

  • ఉదయం నిద్ర లేవగానే నిమ్మ రసం, తేనె కలిపిన గోరువెచ్చటి నీరు. లేదంటే రాత్రంతా నానబెట్టిన మెంతులతో ఒక కప్పు నీళ్లు.

  • బ్రేక్‌ఫా్‌స్టలో ఎక్కువగా రెండు ఎగ్‌ వైట్‌, బ్రెడ్‌ టోస్ట్‌ లేదంటే ఇడ్లీ, రవ్వ దోశ. ఒకవేళ బెంగళూరు ఇంటికి వెళితే... కప్పు ఫిల్టర్‌ కాఫీ, ఇడ్లీ సాంబార్‌.

  • మధ్యాహ్న భోజనానికి రెండు గంటల ముందు... ఒక బౌల్‌ కూరగాయలు, పండ్ల ముక్కలు. దీనివల్ల లంచ్‌లో అతిగా తినే అవసరం ఉండదనేది ఈ భామ ఆలోచన.

  • మధ్యాహ్న భోజనంలో ఒక్కో రోజూ ఒకో వెరైటీ ఉంటుంది. అందులో పోషక విలువలు తప్పనిసరి. కొన్నిసార్లు సబ్జీ, దాల్‌, రోటీతో సరిపెడితే... మరికొన్నిసార్లు రెండు చపాతీలు, గ్రిల్‌డ్‌ ఫిష్‌, కాయగూరల ముక్కలతో లంచ్‌ ఆస్వాదిస్తుంది. లేదంటే చారు అన్నం ఆమె మెనూలో చేరుతుంది.

  • సాయంత్రం స్నాక్స్‌లో బాదం, పిస్తా లాంటి డ్రైఫ్రూట్స్‌, కప్పు ఫిల్టర్‌ కాఫీ.

వ్యాయామం ఇలా...

  • రన్నింగ్‌, స్కిప్పింగ్‌, బ్రిస్క్‌ వాకింగ్‌లతో వార్మప్‌. ‘వర్కవుట్‌కు ముందు వార్మప్‌ తప్పనిసరి. అప్పుడే తీవ్రంగా సాగే వర్కవుట్‌ సెషన్‌కు శరీరం సిద్ధమవుతుంది’ అనేది దీపిక మాట.

  • తరువాత బ్యాండ్‌ స్ర్టెచ్‌, నీ టూ చెస్ట్‌ స్ర్టెచ్‌, చైల్డ్స్‌ పోజ్‌, సైడ్‌ లంగెస్‌. వీటివల్ల శరీరం చువ్వలా ఎటు కావాలంటే అటు వంగుతుంది.

  • అప్పుడప్పుడు కిక్‌ బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, డ్యాన్స్‌, స్విమ్మింగ్‌ కూడా వచ్చి చేరుతుంటాయి.

  • పిలెట్స్‌ వర్కవుట్‌ రోజూ ఉండాల్సిందే. దీనివల్ల కండరాలు దృఢంగా మారతాయి. బాడీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఆరోగ్యమే అందం. అందుకు క్రమబద్దమైన జీవనశైలి ఒక్కటే మార్గం అనేది సెలబ్రిటీ ట్రైనర్ల మాట.


ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 06:08 AM