Share News

నాన్న స్ఫూర్తితో పతకాల వేట

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:16 AM

‘‘మా స్వస్థలం విజయవాడ. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాం. మా నాన్న శివ పరమేశ్వరరావు ఎక్స్‌-సర్వీ్‌సమన్‌. బాస్కెట్‌ బాల్‌ కోచ్‌. మా అమ్మ గృహిణి. బాల్యం నుంచి నాన్నే నా రోల్‌ మోడల్‌. ఆయన బాస్కెట్‌ బాల్‌ పోటీలకు వెళ్ళేవారు...

నాన్న స్ఫూర్తితో పతకాల వేట

చేబోయిన ఆర్యాణి... భారత జాతీయ మహిళా స్కేటింగ్‌ జట్టులో అత్యంత సీనియర్‌ సభ్యురాలు మాత్రమే కాదు... ‘వరల్డ్‌ స్కేట్‌ గేమ్స్‌’లో మన దేశం తొలి పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. వచ్చే నెల ‘ఆసియా రోలర్‌ ఛాంపియన్‌షి్‌ప’ కోసం తమ్ముడితో కలిసి సన్నద్ధమవుతున్న ఆమె తన క్రీడా ప్రయాణం గురించి ‘నవ్య’తో మాట్లాడింది.

‘‘మా స్వస్థలం విజయవాడ. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాం. మా నాన్న శివ పరమేశ్వరరావు ఎక్స్‌-సర్వీ్‌సమన్‌. బాస్కెట్‌ బాల్‌ కోచ్‌. మా అమ్మ గృహిణి. బాల్యం నుంచి నాన్నే నా రోల్‌ మోడల్‌. ఆయన బాస్కెట్‌ బాల్‌ పోటీలకు వెళ్ళేవారు, శిక్షణ ఇచ్చేవారు. ఆయన ప్రేరణతో ఏదైనా క్రీడలో అభ్యాసం చేద్దామనే ఆలోచన ఉండేది. ఒకసారి ఏలూరులోని మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ స్టేడియంలో చాలామంది పిల్లలు స్కేటింగ్‌ చేయడం చూశాను. ఆ క్రీడ నన్ను ఆకర్షించింది. నేర్చుకుంటే బాగుంటుందనుకున్నాను. అలా... ఆ ఏడాది వేసవి సెలవుల్లో స్కేటింగ్‌ శిక్షణలో చేరాను. సరదాగా ప్రారంభించినా... క్రమంగా దాని మీద ఆసక్తి కలిగింది. ‘ఇంకా నేర్చుకోవాలి, ఈ క్రీడలో నైపుణ్యం సాధించాలి’ అనే తపన పెరిగింది. రెండు మూడేళ్ళపాటు శిక్షణ తీసుకున్నాక... మా నాన్నగారికి ముంబయికి బదిలీ అయింది. అక్కడ కూడా స్కేటింగ్‌ కొనసాగించాను. అప్పుడే దీన్ని కూడా ఒక ప్రొఫెషనల్‌ క్రీడగా ఎంచుకోవచ్చునని అర్థమయింది. ఆ దిశగా సాధన చేయడం ప్రారంభించాను. నైపుణ్యం సాధించిన తరువాత... జిల్లా, రాష్ట్ర పోటీల్లో రాణించడంతో... 2014లో జాతీయ స్థాయిలో ఆడే అవకాశం వచ్చింది. అప్పుడు మా నాన్నగారు ఢిల్లీలో పని చేస్తూ ఉండడంతో... ఢిల్లీ జట్టులో సభ్యురాలిగా ఉన్నాను. ఆ తరువాత జాతీయ జట్టులో ఆంధ్రప్రదేశ్‌ తరఫున కొనసాగుతున్నాను.


మోస్ట్‌ వేల్యుబుల్‌ ప్లేయర్‌గా...

నేను 2017లో జాతీయ స్థాయిలో తొలి పతకం అందుకున్నాను. ఆస్ట్రేలియా, అమెరికాతో జరిగిన మ్యాచ్‌లలో ‘మోస్ట్‌ వేల్యుబుల్‌ ప్లేయర్‌’గా అవార్డులు సాధించాను. జట్టులో అత్యంత సీనియర్‌ ప్లేయర్‌ని కావడం, 2019లో జరిగిన ‘వరల్డ్‌ రోలర్‌ గేమ్స్‌’లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విస్తృతమైన అనుభవం ఉండడం 2019 చైనా నిర్వహించిన పోటీల్లో విజయాలకు దోహదం చేసింది. ఆ పోటీల్లో భారత జట్టు సెమీ్‌సకు చేరుకొని, నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో... భారత జట్టులో ‘మోస్ట్‌ క్యాప్డ్‌ ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌’గా గుర్తింపు పొందాను. బార్సిలోనాలో జరిగిన డబ్ల్యుఎ్‌సడీలో పాల్గొన్నాను. 2022లో అర్జెంటీనాలో, 2023లో చైనాలో జరిగిన పోటీలకు ఎంపికయ్యాను. కిందటి ఏడాదిలో ఇటలీలో జరిగిన ‘వరల్డ్‌ స్కేట్‌ గేమ్స్‌’లో.... రోలర్‌ డెర్బీ విభాగంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. అందులో మన జట్టు చైనాను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం గెలిచింది. ఇది‘ వరల్డ్‌ స్కేట్‌ గేమ్స్‌’లో ఇప్పటివరకూ భారత్‌ సాధించిన తొలి పతకం. ఈ ఘనతలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో మా జట్టు బంగారు పతకం సాధించాలి. అదే నా లక్ష్యం.


55-Navy.jpg

వారి సంకల్పంతోనే...

చిన్నప్పుడు నాకు బంధు మిత్రుల ప్రోత్సాహం లభించినా.. ఆ తరువాత ‘‘ఇంకా ఇది అవసరమా? నేషనల్‌ మెడల్‌ వచ్చింది కదా? ఇక చాలు అన్నట్టు’’ కొందరు మాట్లాడారు. ఇప్పుడు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ ఉండడంతో మద్దతు ఇస్తున్నారు. కానీ మా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. వారిద్దరి సంకల్పమే నన్ను ఇక్కడివరకూ తీసుకువచ్చింది. క్రీడల వల్ల శారీరక దారుఢ్యం, మానసిక దారుఢ్యం అభివృద్ధి చెందుతాయి. స్కేటింగ్‌... జట్టుగా ఆడే క్రీడ. జట్టులోని ఇతర సభ్యులతో ఎలా కమ్యూనికేట్‌ చెయ్యాలో మేము నేర్చుకుంటాం. నాయకత్వ లక్షణాలు పెరగడానికి, కొత్త ప్రదేశాలకు, అక్కడి వాతావరణాలకు, సంస్కృతులకు త్వరగా అలవాటు పడడానికి క్రీడలు దోహదం చేస్తాయి. అయితే దీనిలో సవాళ్ళు కూడా ఉన్నాయి. స్కేటింగ్‌ గేమ్‌కు భారత ప్రభుత్వం నుంచి నిధులు రావు. ప్రతిసారీ మేమే స్పాన్సర్లను వెతుక్కోవాలి. క్రితంసారి నాకు కెనరాబ్యాంక్‌ ఎండి స్పాన్సర్‌ చేశారు. రాబోయే ఆసియా ఛాంపియన్‌షి్‌పకి నాకు, మా తమ్ముడికి కూడా కెనరా బ్యాంకే స్పాన్సర్‌ చేస్తోంది. అన్ని విధాలా సాయపడుతోంది. మాకు ఆర్థికంగా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరాం. క్రీడామంత్రిని కూడా కలిశాం. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాం.’’

కృష్ణశర్మ


తమ్ముడితో కలిసి...

స్కేటింగ్‌తో పాటు బాస్కెట్‌బాల్‌లోనూ నాకు నైపుణ్యం ఉంది. సౌత్‌జోన్‌లో మా యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఎన్‌సీసీలో కూడా ఉన్నాను. ఈ ఏడాది నా బీటెక్‌ పూర్తవుతుంది. ఇక... నేను స్కేటింగ్‌ అభ్యాసం ప్రారంభించిన ఏడాదికి... నా తమ్ముడు అభిరామ్‌ కూడా స్కేటింగ్‌లో చేరాడు. తను కూడా బాగా రాణిస్తున్నాడు. ఇంటర్‌ పూర్తి చేశాడు. మ్యూజిక్‌ అంటే ఇష్టం. వయోలిన్‌లో డిప్లమా చేస్తున్నాడు. ఈ ఏడాది జూలైలో దక్షిణ కొరియాలో జరగబోయే ‘ఏషియన్‌ రోలర్‌ ఛాంపియన్‌షి్‌ప’లో... రోలర్‌ డర్బీ ఈవెంట్‌కు నేను, అభిరామ్‌ ఎంపికయ్యాం. దానికోసం రోజూ ప్రాక్టీస్‌ చేస్తున్నాం, అన్ని విధాలుగా సన్నద్దం అవుతున్నాం. మా నాన్నగారే మాకు కోచ్‌. ఆయన ఇంటర్నేషనల్‌ క్వాలిఫైడ్‌ రిఫరీ కూడా. ఫిట్‌నెస్‌లో, టెక్నిక్స్‌లో... ఇలా అన్నిట్లో ఆయనే మాకు శిక్షణ ఇస్తారు.


ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు సీరియస్..

Read latest AP News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 05:16 AM