Share News

డైవింగ్‌ సంచలనం

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:53 AM

ఆరేళ్ల కిందట... కొత్త సంవత్సర వేడుకల కోసం అండమాన్‌కు వెళ్లినప్పుడు, అర్చనకు మొదటిసారిగా డైవింగ్‌ చేసే అవకాశం దొరికింది. అలా జీవితంలో మొదటిసారిగా స్కూబా డైవింగ్‌ చేశారామె. ఆ అనుభవం గురించి వివరిస్తూ...

డైవింగ్‌  సంచలనం

స్ఫూర్తి

ఎలాంటి పరికరాలు లేకుండా ఊపిరి బిగపట్టి లోతైన నీళ్లలోకి డైవ్‌ చేయడమే ఫ్రీ డైవింగ్‌. ఎంతో కష్టమైన, క్లిష్టమైన ఈ క్రీడలో పైచేయి సాధించడమే కాకుండా, ఏకంగా తొమ్మిది జాతీయ రికార్డులను నెలకొల్పారు చెన్నైకి చెందిన 32 ఏళ్ల అర్చన శంకర నారాయణన్‌. ఈ మహిళా డైవర్‌ గురించిన ఆసక్తికరమైన విశేషాలివి.

ఆరేళ్ల కిందట... కొత్త సంవత్సర వేడుకల కోసం అండమాన్‌కు వెళ్లినప్పుడు, అర్చనకు మొదటిసారిగా డైవింగ్‌ చేసే అవకాశం దొరికింది. అలా జీవితంలో మొదటిసారిగా స్కూబా డైవింగ్‌ చేశారామె. ఆ అనుభవం గురించి వివరిస్తూ... ‘‘నాకా అనుభవం ఎంతో బాగా నచ్చింది. నీటి అడుగున దాగి ఉండే అద్భుతమైన ప్రపంచాన్ని నేనప్పుడు మొదటిసారిగా చూడగలిగాను. సముద్రంతో తక్షణ అనుబంధం ఏర్పడిపోయిన భావనకు లోనయ్యాను. నీటి ప్రపంచంలో నెలకొని ఉండే ప్రశాంతత, నిశ్శబ్దం నన్నెంతో అబ్బురపరిచాయి. అలా మొదటి అనుభవంతోనే డైవింగ్‌కు ఎంతో దగ్గరైపోయాను. నా భవిష్యత్తు డైవింగ్‌తో ముడిపడి ఉందని అనిపించింది. కానీ అప్పటికే న్యాయవాద వృత్తిలో ఉన్నాను. కాబట్టి డైవింగ్‌ పట్ల ఏర్పడిన మక్కువను నా తల్లితండ్రులు అర్థం చేసుకోలేకపోయారు. అది ప్రాణాంతకమైన క్రీడ కాబట్టి వాళ్లు బాగా భయపడిపోయారు. మాది సంప్రదాయ తమిళ కుటుంబం. న్యాయవాద వృత్తిని వదిలేసి, ప్రాణాంతకమైన డైవింగ్‌లో కొనసాగాలనే నా కోరికను మొదట్లో వ్యతిరేకించిన తల్లితండ్రులు చివరకు అర్థం చేసుకుని ప్రోత్సహించారు. ఇప్పుడు నన్ను చూసి గర్వపడుతున్నారు’’ అంటూ తన డైవింగ్‌ ప్రయాణాన్ని వివరిస్తున్నారు అర్చన.


మక్కువతో మధించి...

ఆ ప్రయాణంలో భాగంగా మొదట బహిరంగ జలాల స్కూబా అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌ను పొంది, రెస్క్యూ డైవర్‌గా మారారు. ఆ తర్వాత, ఎటువంటి ఆక్సిజన్‌ ఆసరా లేకుండా ఫ్రీడైవింగ్‌ చేసే భారతదేశానికి చెందిన శుభమ్‌ పాండే వీడియోలు చూసి అతని నుంచి ఎంతో ప్రేరణ పొందారు. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ.. ‘‘నన్నీ క్రీడ విపరీతంగా ఆకర్షించింది. కేవలం రెస్క్యూ డైవర్‌గా స్థిరపడిపోకుండా, ఈ క్రీడలో మరింత పరిణతి సాధించాలని అనుకున్నాను. శుభమ్‌ వీడియోలు చూసిన తర్వాత, అతని దగ్గర శిక్షణ పొందాలని అనిపించింది.

దాంతో బాలి వెళ్లి, భారతీయ అగ్ర ఫ్రీడైవింగ్‌ శిక్షకుల్లో

ఒకడైన శుభమ్‌ దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత, ఆసియాలోని సుప్రసిద్ధ ఫ్రీడైవింగ్‌ స్కూల్‌, ఆప్నియా బాలిలో కూడా శిక్షణ పొందాను’’ అంటూ చెప్పుకొచ్చారు అర్చన. శిక్షణలో భాగంగా ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం విజువలైజేషన్‌, బ్రెత్‌వర్క్‌, ధ్యానం... సాధన చేశారామె. డయాఫ్రమ్‌ బ్రీదింగ్‌ లాంటి శ్వాస నైపుణ్యాలను సాధన చేయడం ద్వారా డైవింగ్‌ నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటు, మహాసముద్రంలో ఆత్మవిశ్వాసంతో డైవింగ్‌ చేయగలిగే సామర్థ్యం కూడా పెరిగిందని అంటున్నారామె. అలాగే థాయిల్యాండ్‌లోని కొ టావోలో కైజెన్‌ ఫ్రీడైవింగ్‌లో కూడా అర్చన శిక్షణ తీసుకున్నారు. ఫ్రీడైవింగ్‌ ప్రపంచ రికార్డులు, 100 మీటర్లను అధిగమించాయి కాబట్టి భారతదేశ డైవర్లు ఈ క్రీడలో పైచేయి సాధించడానికి కఠోర శిక్షణ పొందడం అవసరమని గ్రహించిన అర్చన, ప్రస్తుతం తన శిక్షణ తీవ్రతను పెంచారు. ‘‘ఆగష్టు 1 నుంచి 3 వరకు, ఇండోనేషియాలోని, నార్త్‌ సులవేసిలో జరగబోయే మనాడొ డెప్త్‌ కాంపిటీషన్‌లో నెగ్గడం కోసం, శుభమ్‌ పాండేతో కలిసి ఇండోనేషియాలోని అమెద్‌లో శిక్షణ తీసుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొస్తున్నారు.


ఫ్రీడైవింగ్‌... అంత సులువు కాదు

నీళ్ల అడుగుకి డైవ్‌ చేయడం, సులభతరమైన క్రీడలాగే అనిపించవచ్చు. కానీ నీళ్లలో లోతుకు ప్రయాణించేకొద్దీ నీటి ఒత్తిడి పెరిగిపోతుంది. ఆక్సిజన్‌ మోతాదులు తగ్గిపోతాయి. దాంతో మెదడుకు సరిపడా ఆక్సిజన్‌ అందక స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి, అవి కుంచించుకుపోతాయి. నీటి ఒత్తిడిలో చోటుచేసుకునే మార్పుల వల్ల కళ్లు, చెవులు, సైనస్‌లు, ఊపిరితిత్తులకు గాయలయ్యే అవకాశాలుంటాయి. లోతుకు చేరుకున్న తర్వాత అంతే వేగంగా నీళ్ల పైకి చేరుకునే వీలుండదు. అలా లోతు నుంచి వేగంగా నీటి పైకి ప్రయాణిస్తే, రక్తంలో నైట్రోజన్‌ బుడగలు ఏర్పడి, డీకంప్రెషన్‌ సిక్‌నె్‌సకు గురవుతారు.


లోతులన్నీ నెగ్గి...

అర్చన తాజాగా ఫిలిప్పైన్స్‌లో జరిగిన రెండు ప్రధాన అంతర్జాతీయ పోటీల్లో ఆరు కొత్త జాతీయ రికార్డులను నెలకొల్పారు. ఈ చెన్నై యువతి, రెండు అంతర్జాతీయ పోటీల్లో ఆరు జాతీయ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు, 35 మీటర్ల జాతీయ రికార్డును నెలకొల్పి, 42 మీటర్ల ఫ్రీడైవింగ్‌ తో స్వీయ వ్యక్తిగత ప్రతిభను కనబరచడం విశేషం. ఇలా ఏడాది వ్యవధిలో తొమ్మిది రికార్డులను నెలకొల్పిన తొలి భారతీయ మహిళా ఫ్రీడైవర్‌గా చరిత్ర సృష్టించారు. ఫ్రీడైవింగ్‌ ఊపిరిని బిగపట్టే క్రీడ. ఈ క్రీడలో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి శ్వాస పరికరాలు లేకుండా, నీటి అడుగున వీలైనంత లోతుకు ఫ్రీడైవింగ్‌ చేస్తూ ఉంటారు. అర్చన, గత నెలలో ఫిలిప్పైన్స్‌లోని మబినిలో జరిగిన ఎఐడిఎ మబిని డెప్త్‌ క్వెస్ట్‌లో పాల్గొని, తన రికార్డును బద్దలు కొట్టడంతో పాటు నాలుగు జాతీయ రికార్డులతో తన అసమానమైన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం ఫిలిప్పీన్స్‌ పాంగ్లోలో జరిగిన హగ్‌ కప్‌ పోటీల్లో, మరొక సొంత రికార్డుతో పాటు, రెండు జాతీయ రికార్డులను నెలకొల్పారు. ఇలా ఇప్పటివరకూ అర్చన, కాన్‌స్టెంట్‌ వెయిట్‌, కాన్‌స్టెంట్‌ వెయిట్‌ బై ఫిన్స్‌, కాన్‌స్టెంట్‌ వెయిట్‌ నో ఫిన్స్‌, ఫ్రీ ఇమ్మర్షన్‌... ఇలా ఈ క్రీడలోని నాలుగు డెప్త్‌ విభాగాల్లో జాతీయ రికార్డులను సాధించి భారత దేశ సత్తాను చాటారు.


Read latest AP News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 05:53 AM