Share News

Aneeth Padda: కుర్రకారు కలల్లో కొత్త రాణి

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:12 AM

ఎలాంటి భావమైనా ముఖంలో ఇట్టే పలికేస్తుంది. తెర మీద కనిపిస్తే హాలంతా ఆహ్లాదంగా మారిపోతుంది. నటనలో వైవిధ్యం... ఆకర్షణీయమైన రూపం... భారమైన సన్నివేశమైనా పండించగల సామర్థ్యం...

Aneeth Padda: కుర్రకారు కలల్లో కొత్త రాణి

జూమ్‌

ఎలాంటి భావమైనా ముఖంలో ఇట్టే పలికేస్తుంది. తెర మీద కనిపిస్తే హాలంతా ఆహ్లాదంగా మారిపోతుంది. నటనలో వైవిధ్యం... ఆకర్షణీయమైన రూపం... భారమైన సన్నివేశమైనా పండించగల సామర్థ్యం... అన్నీ కలిస్తే అనీత్‌ పడ్డా. రికార్డులు కొల్లగొట్టి... కనక వర్షం కురిపిస్తున్న ‘సయారా’ చిత్రంతో ఆమె ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.

బాలీవుడ్‌ సరికొత్త సంచలనం... కుర్రకారు హృదయ స్పందన... అనీత్‌ ‘ఫ్లాష్‌బ్యాక్‌’ ఇది.

అనీత్‌ పడ్డా ప్రస్తుతం ‘సయారా’ చిత్రం విజయోత్సవంలో మునిగితేలుతోంది. యాభై కోట్లకు పైబడని బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ ఇప్పటికే నాలుగు వందల కోట్లు దాటిందని అంచనా. ఇందులో తెరంగేట్రం చేసిన హీరో అహానా పాండేకు జతగా అనీత్‌ నటించింది. 2025లో ఇప్పటివరకు విడుదలైన హిందీ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. మూడేళ్ల కిందట ‘సలామ్‌ వెంకీ’లో చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైన అనీత్‌... గత ఏడాది వచ్చిన ‘బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై’ వెబ్‌సిరీ్‌సలో లీడ్‌ రోల్‌ పోషించింది. నటనపరంగా అది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సిరీస్‌ కోసం ‘మాసూమ్‌’ అనే పాట రాసి, బాణీ కట్టి, తనే ఆలపించింది. ఈ ఏడాది ఆరంభంలో ‘యువ సప్నోం కా సఫర్‌’ సిరీ్‌సలో నటించిన ఆమెకు స్టార్‌ డైరెక్టర్‌ మోహిత్‌ సూరి ‘సయారా’లో అవకాశం లభించింది. ప్రముఖ సంస్థ ‘యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌’ దీన్ని నిర్మించింది. విడుదలైన రోజు నుంచి అద్భుతమైన టాక్‌తో దూసుకుపోతోంది ‘సయారా’. ఇందులో అనీత్‌ అందానికే కాదు... ఆమె నటనకు, స్ర్కీన్‌ ప్రెజెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టిన అనీత్‌కు మొదటి నుంచీ నటనపై మక్కువ. అక్కడి ‘స్ర్పింగ్‌ డేల్‌ సీనియర్‌ స్కూల్‌’లో చదివిన ఆమె... ఢిల్లీ ‘జీసస్‌ అండ్‌ మేరీ కాలేజీ’ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఒకవైపు చదువుతూనే గ్లామర్‌ ప్రపంచంలో అవకాశాల కోసం ప్రయత్నించింది. తరువాత ముంబయికి వెళ్లి మోడలింగ్‌ చేసింది. ప్రకటనల్లో నటించింది.


వీడియో చూసి భావోద్వేగం...

‘సయారా’తో అనూహ్య విజయాన్ని అందుకున్న అనీత్‌ జర్నీనీ, చదువుకొనే రోజుల్లో జ్ఞాపకాలను కలిపి ‘స్ర్పింగ్‌ డేల్‌ సీనియర్‌ స్కూల్‌’ ఒక వీడియో విడుదల చేసింది. అందులో టీచర్లు, కలిసి చదువుకున్నవారు, ప్రస్తుత విద్యార్థులు, ప్రిన్సిపాల్‌, మార్గదర్శకులు... అనీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ, అభినందనలతో ముంచెత్తారు. ఆ వీడియో చూసిన ఆమె భావోద్వేగానికి లోనైంది.

33-navya.jpg

‘‘నా భావాలను వ్యక్తీకరించడానికి మాటలు రావడంలేదు. ఈ వీడియో చూస్తూ అలా కూర్చొండిపోయాను. ముఖమంతా చిరునవ్వు పరుచుకుంది. ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను పెరిగింది... పెద్దగా కలలు కనడం నేర్చుకున్నది అక్కడే. నా మీద నాకు నమ్మకం రావడానికి ముందే నాలో ప్రతిభ ఉందని చాలామంది నమ్మింది అక్కడే. నా టీచర్లు, మార్గదర్శులు, నాతో చదివినవారు... అందరూ కలిసి ఇచ్చిన ఈ అద్భుతమైన బహుమతిని చూస్తున్నంతసేపూ మధురానుభూతికి లోనయ్యాను. సెట్‌లోకి వెళ్లిన ప్రతిసారీ స్కూల్లో యూనిఫామ్‌ ధరించి, తరగతి గదిలో కూర్చొని కన్న పగటి కలలు గుర్తుకువస్తుంటాయి. ఆ కలలే ఇప్పుడు నిజమయ్యాయి. నా ప్రతి అడుగులో నన్ను ప్రోత్సహించి, ప్రేమించి, సరైన మార్గంలో నడిపించిన మీవల్లే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను ఎదిగిన క్రమం మీ అందరినీ గర్వపడేలా చేసిందని ఆశిస్తున్నాను. చదువు ఒక్కటే కాకుండా జీవిత పాఠాలు ఎన్నో నేర్పించిన ‘స్ర్పింగ్‌డేల్‌’ను ఎప్పటికీ మరిచిపోను. త్వరలోనే అందరినీ కలుస్తాను. నన్ను గుర్తు చేసుకున్నందుకు, నా విజయాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆ వీడియోను ఉద్దేశించి వ్యాఖ్యానించింది అనీత్‌. సంగీతపరంగానూ సూపర్‌హిట్‌ అయిన ‘సయారా’ తరువాత ఆమె చేపట్టబోయే ప్రాజెక్ట్‌ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


సెట్‌లోకి వెళ్లిన ప్రతిసారీ స్కూల్లో యూనిఫామ్‌ ధరించి, తరగతి గదిలో కూర్చొని కన్న పగటి కలలు గుర్తుకువస్తుంటాయి. ఆ కలలే ఇప్పుడు నిజమయ్యాయి. నా ప్రతి అడుగులో నన్ను ప్రోత్సహించి, ప్రేమించి, సరైన మార్గంలో నడిపించిన మీవల్లే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను.

ఈ వార్తలు కూడా చదవండి...

అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

Read Latest AP News and National News

Updated Date - Aug 03 , 2025 | 05:14 AM