Share News

Bhavani Reddy Weightlifting: భవానీ బంగారం

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:46 AM

నాన్న భవన నిర్మాణ కూలీ. అమ్మ.. ముగ్గురు సంతానం.. అందరూ ఆ సంపాదనతోనే బతకాలి. కష్టాలు... సమస్యలు... సవాళ్లు... ఒకవైపు బతుకు పోరాటం. మరోవైపు... ఏదిఏమైనా సాధించి తీరాలన్న మహోన్నత ఆశయం. అదే ఆమెను విజేతగా...

Bhavani Reddy Weightlifting: భవానీ బంగారం

విజేత

నాన్న భవన నిర్మాణ కూలీ. అమ్మ.. ముగ్గురు సంతానం.. అందరూ ఆ సంపాదనతోనే బతకాలి. కష్టాలు... సమస్యలు... సవాళ్లు... ఒకవైపు బతుకు పోరాటం. మరోవైపు... ఏదిఏమైనా సాధించి తీరాలన్న మహోన్నత ఆశయం. అదే ఆమెను విజేతగా నిలిపింది. ‘ఆసియా యూత్‌ అండ్‌ జూనియర్‌ చాంపియన్‌షి్‌ప్స’ వెయిట్‌ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పతకాలు నెగ్గి... కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించింది. రెడ్డి భవానీ... మారుమూల పల్లె నుంచి ట్రిపుల్‌ గోల్డ్‌ వరకు సాగిన ఆమె జైత్రయాత్ర ‘నవ్య’కు ప్రత్యేకం.

‘‘రోజంతా కష్టపడితే నాన్నకు వచ్చేది ఐదారు వందల రూపాయలు. అదికూడా పని ఉన్నప్పుడే. దాంట్లోనే మా కుటుంబం నడవాలి. అంతులేని కష్టాలు... వచ్చేది సరిపోక పస్తులు... ఇవేవీ మాకు కొత్త కాదు. అయినా క్రీడల పట్ల నాకున్న ఆసక్తిని గమనించి, ప్రోత్సహించింది అమ్మ మాధవి. మా నాన్న ఆదినారాయణ కూడా అందుకు అడ్డు చెప్పలేదు. తిన్నా తినకపోయినా... ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడినా... ఏ రోజూ నన్ను నిరుత్సాహపరచలేదు. విజయనగరం జిల్లా కొండకరకం గ్రామంలో ఓ పేద కుటుంబం మాది. నాన్న భవన నిర్మాణ కూలీ. అక్క, చెల్లి, నేను... మేం ముగ్గురు సంతానం.

అమ్మతో స్టేడియానికి...

మా ప్రాంతంలో కె.వెంకటలక్ష్మి, మొయిదా రామకృష్ణ తదితరులు వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ స్ఫూర్తితో అమ్మ నన్ను కూడా వెయిట్‌లిఫ్టర్‌ను చేయాలని కలలు కన్నది. వాళ్లకు శిక్షణ ఇచ్చిన కోచ్‌ చల్లా రాము వద్ద నన్ను చేర్పించింది. అప్పుడు నాకు పదేళ్లు. అమ్మ రోజూ నన్ను వెంటబెట్టుకొని స్టేడియానికి తీసుకువెళ్లేది. శిక్షణ అయ్యేవరకూ వేచి ఉండేది. ఒక పక్క ఇంటి పనంతా చేసుకొంటూ... మరోవైపు నా కోసం గంటలకు గంటలు సమయం కేటాయించేది. అలా నాలుగేళ్లు అక్కడే శిక్షణ తీసుకున్నా.


ఇల్లు అమ్మి...

2021 నా కెరీర్‌లో మరపురాని సంవత్సరం. ఆ ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొన్నాను. కాంస్య పతకం సాధించాను. అది నాలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరుసటి ఏడాది ఏలూరులోని ‘స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’కు ఎంపిక అవ్వడానికి దోహదపడింది. అదేసమయంలో మా అక్క పెళ్లి కుదిరింది. నా కోచింగ్‌, పెళ్లి ఖర్చులు... నాన్నకు తలకు మించిన భారమైంది. దిక్కుతోచని స్థితి. చివరకు నాన్న ఇల్లు అమ్మేశారు. అయినా ఆర్థిక ఇబ్బందులు తీరలేదు. దీంతో వెయిట్‌లిఫ్టింగ్‌ ఆపేద్దామని అనుకున్నా. కానీ నా పరిస్థితిని గమనించిన కోచ్‌ గడిపల్లి ఆనంద్‌ నాకు అండగా నిలిచారు.

మరో మెట్టు పైకి...

నా కోసం అమ్మానాన్నలు ఎన్నో త్యాగాలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలూ శ్రమించాను. ఒక్కో అడుగు ముందుకు వేశాను. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాను. దాంతో ఔరంగాబాద్‌ ‘స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (సాయ్‌) ఆధ్వర్యంలోని ‘నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’కు ఎంపికయ్యాను. 2022, 2024లో మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొన్నాను. కానీ పతకం సాధించలేకపోయాను. మరింత కసితో సాధన చేశాను. గత ఏడాది జాతీయ పాఠశాల క్రీడా పోటీల్లో రజతం గెలవడంతో నాలో ఉత్సాహం నింపింది.


8-navya.jpg

ఆసియా యూత్‌ చాంపియన్‌షి్‌ప...

నా కెరీర్‌లో అతిపెద్ద విజయం... ఈ ఏడాది జూలై 4న కజకిస్తాన్‌లో జరిగిన ‘ఆసియా యూత్‌ అండ్‌ జూనియర్‌ చాంపియన్‌షి్‌ప’ వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించడం. దీనికి ముందు మెరుగైన శిక్షణ కోసం మెక్సికోలో ఐడబ్ల్యూఎఫ్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌కు వెళ్లాల్సి వచ్చింది. దాంతో చదువు దెబ్బతింది. కానీ ఆసియా చాంపియన్‌షి్‌పలో భారత్‌ తరుపున ట్రిపుల్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాదు... ఈ విజయం స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించిపెట్టింది. ఇప్పుడు పాటియాలాలోని ‘నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌’లో గేమ్స్‌ కోసం సన్నద్ధమవుతున్నాను. భారత్‌కు పతకం తేవాలన్న ఏకైక లక్ష్యంతో సాధన చేస్తున్నాను.’’

బి. శ్రీనివాసరావు, విజయనగరం

సాధన ఒక్కటే సరిపోదు...

ఏ క్రీడాకారుడైనా సరే...

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే సాధన ఒక్కటే సరిపోదు. సరైన పౌష్టికాహారం కూడా ఎంతో ముఖ్యం. దానికి నెలకు కనీసం రూ.30 వేలు ఖర్చవుతుంది. మా నాన్న ఎన్నో అవస్థలు పడి ఐదు వేల వరకు సమకూరుస్తున్నారు. అంతకు మించి భరించలేని నిస్సహాయత. ఆ సమయంలోనే కోచ్‌ ఆనంద్‌ నా ప్రతిభను గుర్తించి, అండగా నిలిచారు. నా శిక్షణ కోసం తన డబ్బు ఖర్చు చేశారు. మరోవైపు తరచూ పోటీలు, శిక్షణవల్ల నా చదువు సరిగ్గా సాగలేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాశాను.

వదిలేద్దామని

అనుకున్నా...

మా ఇల్లు అమ్మినప్పుడు వెయిట్‌లిఫ్టింగ్‌ వదిలేద్దామని అనుకున్నా. ఏదైనా పని చేసి నాన్నకు కాస్తయినా భారం తగ్గిద్దామనే ఆలోచన. కానీ కోచ్‌ ప్రోత్సాహంతో ఆ ఆలోచన విరమించుకున్నా. మా కుటుంబ పరిస్థితి తెలుసుకున్న విజయనగరం కలెక్టర్‌ అంబేడ్కర్‌... మానవతా హృదయంతో స్పందించారు. మాకు ఓ ఇంటిని మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా నాకు అవసరమైన సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..

అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..

Updated Date - Jul 31 , 2025 | 01:46 AM