Shashi Tharoor: కేరళ నుంచి ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో కోత.. శశి థరూర్ అసంతృప్తి
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:53 PM
వచ్చే చలికాలం షెడ్యూల్‌లో కేరళ నుంచి బయలుదేరే విమాన సర్వీసుల్లో భారీగా కోత విధించడంపై కాంగ్రెస్ ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సరికాదని ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: కేరళ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానా సర్వీసుల్లో భారీగా కోత విధించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. చలికాలం షెడ్యూల్‌లో విమాన సర్వీసుల్లో భారీగా కోత పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు (Shashi Tharoor Air India flight cuts).
విమాన సర్వీసుల్లో కోత ఆందోళనకరమని ఆయన అన్నారు. ఈ విషయంపై ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్‌కు లేఖ రాశానని అన్నారు. మీడియా కథనాల ప్రకార, తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్, కన్నూర్ విమానాశ్రయాల నుంచి బయలుదేరే విమానాల్లో కోత పడిందని తెలిపారు (Air India route cuts Kerala).
భారత్‌లో వైమానిక ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటని ఆయన గుర్తు చేశారు. ఇక్కడి నుంచి విదేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఎక్కువని అన్నారు. సర్వీసుల్లో కోత కారణంగా వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారని, వాణిజ్యం, పర్యాటకానికి విఘాతం కలుగుతుందని చెప్పారు.
కేరళ విషయంలో ఎయిర్ ఇండియా ఇలా వ్యవహరించడం మానుకోవాలని అన్నారు. ఇది చాలదన్నట్టు ఢిల్లీ-తిరువనంతపురం ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్ సర్వీసును ఉపహసంహరించడం పుండు మీద కారం జల్లినట్టు అయ్యిందని మండిపడ్డారు. ఎయిర్ ఇండియా తన ఫేవరెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ అని గతంలో చెప్పానని, అయితే, పరిస్థితులు ఇలాగే ఉంటే అభిప్రాయాలు కూడ మారతాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
ఇక కేరళలో ప్రతిపక్ష పార్టీ నేత వీడీ సతీశన్ కూడా అసెంబ్లీ వేదికగా ఎయిర్ ఇండియా సర్వీసుల రద్దుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్‌మోహన్ నాయుడికి లేఖ రాశారు. సర్వీసుల రద్దు నిర్ణయం కేరళ ప్రజల్లో ఆందోళనకు దారి తీసిందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
మహారాష్ట్రలో మత ఘర్షణలు.. లాఠీచార్జి, 30 మంది అరెస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి