Rohini Acharya Controversy: కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:30 PM
బిహార్ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. లాలూ కూతురు రోహిణీ ఆచార్య రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇంటినుంచి కూడా బయటకు వచ్చేశారు.
పాట్నా: బిహార్ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ కూటమి ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. లాలూ ప్రసాద్ ‘ఆర్జేడీ’ పార్టీ కేవలం 25 స్థానాలకే పరిమితం అయింది. బిహార్ ఎన్నికల ఫలితాలు కేవలం పార్టీపైనే కాదు.. లాలూ కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపాయి. లాలూ కూతురు రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు శనివారం తన ఎక్స్ ఖాతాలో ఓ సంచలన పోస్టు పెట్టారు. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. నా కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నాను.
సంజయ్ యాదవ్, రమీజ్ బలవంతంగా నాతో ఇది చేయిస్తున్నారు. అన్ని తప్పులకు నన్ను బాధ్యురాల్ని చేస్తున్నారు’ అంటూ ఎమోషనల్ అయింది. ఆదివారం వరుస సంచలన పోస్టులు పెట్టింది. ఆ పోస్టులో.. ‘నిన్న ఓ కూతుర్ని, ఓ సోదరిని, ఓ వివాహితను, ఓ తల్లిని దారుణంగా అవమానించారు. చెప్పుతో కొట్టడానికి కూడా ప్రయత్నించారు. ఆత్మ గౌరవం విషయంలో నేను వెనక్కు తగ్గను. ఏడుస్తున్న తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లను వదిలి ఇంటి బయటకు రావాల్సి వచ్చింది. నన్ను ఓ అనాథలా మార్చేశారు.
నాపై అమానుషమైన కామెంట్లు చేశారు. డబ్బుల కోసం, టికెట్ కోసం మా నాన్నకు కిడ్నీ ఇచ్చానని అవమానించారు. ప్రతీ వివాహితకు నేను ఒకటే చెబుతున్నా.. మీ పుట్టింట్లో అన్నయ్య, తమ్ముడు ఉంటే ఏ పరిస్థితుల్లోనూ మీ తండ్రిని కాపాడేందుకు ముందుకు రాకండి. మీ సోదరులనే కిడ్నీ ఇవ్వమని చెప్పండి. మీరు ఎవరూ నా లాంటి తప్పు చేయకండి. ఏ ఇంట్లోనూ రోహిణి లాంటి కుమార్తె, చెల్లెలు పుట్టకూడదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గత కొన్నేళ్ల నుంచి లాలూ కొడుకు తేజస్వీ యాదవ్‌కు, రోహిణీ ఆచార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవి తారాస్థాయికి చేరాయి.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్.. రేపు విచారణ