Bombay High Court: న్యాయమూర్తులపై మహిళ సంచలన వ్యాఖ్య.. షాకిచ్చిన కోర్టు
ABN , Publish Date - Apr 24 , 2025 | 08:28 AM
కుక్కలకు ఆహారం పెట్టేవారిని సమర్థించే న్యాయమూర్తుల మాఫియా ఉందంటూ ఓ మహిళ చేసిన వ్యాఖ్యలపై బాంబే హైకోర్టు కన్నెర్ర చేసింది. మహిళకు వారం రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.

శునకాలకు ఆహారం పెట్టే వారిని సమర్థించే న్యాయమూర్తుల మాఫీయా హైకోర్టులు, సుప్రీం కోర్టులో ఉందంటూ షాకింగ్ కామెంట్ చేసిన ఓ ముంబై మహిళకు బాంబే హైకోర్టు ఝలకిచ్చింది. ఆమెకు వారం రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా విధించింది. అయితే, ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష విధింపును పది రోజుల పాటు వాయిదా వేసింది.
మీడియా కథనాల ప్రకారం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడాన్ని హౌసింగ్ సొసైటీలు అభ్యంతరం చెప్పకూడదు. జంతు సంరక్షణ చట్టం నిబంధనల్లో ఇదీ ఒకటి. దీన్ని సవాలు చేస్తూ నవీ ముంబైకి చెందిన సీవుడ్స్ హౌసింగ్ సొసైటీ తరుపున వినీతా శ్రీనందన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో అదే సొసైటీలో ఉంటున్న లీలా వర్మ అనే మహిళ మరో అఫిడవిట్ దాఖలు చేసింది. తనను వీధి కుక్కలకు ఆహారం పెట్టనీయకుండా సొసైటీ అడ్డుకుంటోందని ఫిర్యాదు చేశారు. కుక్కలకు ఆహారం పెట్టేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రదేశాల్లోనూ తనకు అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో, లీలా వర్మకు అనుకూలంగా కోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. అయితే, కోర్టు తీర్పుపై అభ్యంతరం చెబుతూ వినీతా ఓ సర్క్యులర్‌ను సొసైటీ సభ్యులకు పంపించారని లీలా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కుక్కలకు ఆహారం పెట్టే వారిని సమర్థించే జడ్జీల మాఫీయా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉందని ఆ నోటీసులో రాసినట్టు తెలిపారు. కోర్టులు మనుషుల ప్రాణాలను పట్టించుకోకుండా కుక్కలకు ఆహారం పెట్టే వారినే సమర్థిస్తాయని ఈ తీర్పుతో స్పష్టమైందని వినీతా ఆ నోటీసులో రాసుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణగా, న్యాయస్థానం మర్యాదను దిగజార్చేందుకు కావాలని చేసిన ప్రయత్నంగా న్యాయమూర్తులు అభివర్ణించారు. ఫిబ్రవరి 7న వినీతకు షో కాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత కోర్టుకు క్షమాపణలు చెబుతూ వినీతా ఓ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయితే, ఆ క్షమాపణలో నిజాయతీ లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయస్థానం ఆమెకు వారం రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి:
రామ్‌దేవ్ బాబా షర్బత్ జీహాద్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఇప్పటికే మాపై విమర్శలు.. తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు
పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి