Share News

Dhankar Type 8 Bungalow: మాజీ ఉపరాష్ట్రపతికి టైప్ 8 బంగళా కేటాయించిన కేంద్రం.. అసలు ఇదేంటంటే..

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:19 PM

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు ప్రభుత్వం టైప్ 8 ప్రభుత్వ బంగళాను కేటాయించింది. మరి ఈ బంగళా కేటాయింపునకు సంబంధించిన నియమ నిబంధనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Dhankar Type 8 Bungalow: మాజీ ఉపరాష్ట్రపతికి టైప్ 8 బంగళా కేటాయించిన కేంద్రం.. అసలు ఇదేంటంటే..
Jagdeep Dhankhar bungalow allocation

ఇంటర్నెట్ డెస్క్: ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న సీనియర్ నేత జగదీప్ ధన్‌ఖడ్‌కు కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో భాగంగా టైప్ 8 ప్రభుత్వ నివాస బంగళాను కేటాయించింది. ల్యూటియన్స్ ఢిల్లీ ప్రాంతంలో ఉండే టైప్-8 భవనాలు మాజీ ప్రధాని, మాజీ రాష్ట్రపతుల కోసం ఉద్దేశించినవి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నివాస భవనాల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వ నియమాలపై అనేక మందిలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇందుకు సంబంధించిన రూల్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

అత్యున్నత స్థాయి ప్రభుత్వ నివాస బంగళాలను టైప్ 8గా వర్గీకరించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఈ కేటగిరీ భవనాలనే కేటాయించారు. మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధానులకు కూడా ఇవే భవనాలను ఇస్తారు. మాజీ రాష్ట్రపతులు ఈ భవనాల్లో తాము జీవించినంతకాలం ఉండేందుకు అనుమతి ఉంది. ఈ మేరకు ప్రెసిడెంట్ (ఫెసిలిటీస్) రూల్స్‌-1962లో ప్రత్యేక నిబంధనలను చేర్చారు. పదవి నుంచి దిగిపోయిన వెంటనే మాజీ రాష్ట్రపతికి ఈ భవనాన్ని కేటాయిస్తారు. రాష్ట్రపతి పదవికి ఉన్న ప్రాముఖ్యత, హోదా, భద్రతావసరాల రీత్యా మాజీ రాష్ట్రపతులకు ఈ బంగళాల్లో జీవితకాలం పాటు ఉండేందుకు అనుమతినిచ్చారు.


ఇక ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థకు అధినేత అయిన ప్రధానికి కూడా రిటైర్మెంట్ తరువాత టైప్ 8 భవనాన్ని కేటాయిస్తారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలతో జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తారు. మాజీ ప్రధానికి కూడా తన జీవితకాలమంతా టైప్ 8 భవనంలో నివసించేందుకు అనుమతి ఉంది. అయితే, మాజీ ఉపరాష్ట్రపతులకు శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ నివాస భవనాలు కేటాయించే నిబంధనలు ఏవీ ప్రస్తుతం లేవు. కానీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చినప్పుడు మాజీ ఉపరాష్ట్రపతులకు టైప్-8 భవనం కేటాయించే అవకాశం ఉంది. ఈ భవనాన్ని ప్రభుత్వ సూచనల మేరకు ఖాళీ చేయకపోతే మార్కెట్ రేటు ప్రకారం అద్దె చెల్లించాల్సి ఉంటుంది.


మాజీ గవర్నర్లు, మాజీ ముఖ్యమంత్రులకు శాశ్వత ప్రాతిపదిక ప్రభుత్వ భవనాలను కేటాయించరు. అయితే, ప్రత్యేక సందర్భాల్లో వారికి టైప్ 6 లేదా టైప్ 7 భవనాన్ని కేటాయించే అవకాశం ఉంది. ఈ విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదే. ఇక పదవికి రాజీనామా చేసిన తరువాత నెల రోజుల్లోపు ఎంపీలు, మంత్రులు తమకు కేటాయించిన ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అధికారులు వారికి నోటీసులు ఇచ్చిన మూడు రోజులకు బలవంతంగా ఖాళీ చేయించే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా

కామిక్స్ పుస్తకాల్లో కొకైన్ స్మగ్లింగ్.. బెంగళూరు ఎయిర్‌‌పోర్టులో నిందితుడి అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 01:06 PM