Youtuber Manish Kashyap: యూట్యూబర్‌కు షాకిచ్చిన బిహార్ ఓటర్లు..
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:31 PM
తన యూట్యూబ్ ఛానల్‌కు ఉన్న 96 లక్షల మంది సబ్ స్క్రైబర్లే అతి పేద్ద అర్హతగా బరిలోకి దిగిన మనీశ్ కశ్యప్‌కు చుక్కెదురైంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ముందు నిలబడలేక చివరికి..
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖ యూట్యూబర్ మనీశ్ కశ్యప్‌కు బిహార్ ప్రజలు షాకిచ్చారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ అయిన జన్‌సురాజ్ నుంచి చన్‌పటియా నియోజకవర్గంలో పోటీ చేసిన మనీశ్.. నిన్న(శుక్రవారం) విడుదలైన ఫలితాల్లో కేవలం 37,172 ఓట్లు మాత్రమే సాధించగలిగారు.(ఆయన యూట్యూబ్ ఛానల్‌కు 96 లక్షల మంది ఫాలోవర్లు). ఇది మొత్తం పోలైన ఓట్లలో 16.58% శాతం. చివరికి ఆయన 50వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు.
కాగా, ఈ నియోజకవర్గంలో అభిషేక్ రంజన్ (కాంగ్రెస్) 87,538 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. ఉమాకాంత్ సింగ్ (బీజేపీ) - 86,936 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, మనీశ్ కాశ్యప్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఇలా ఉండగా, బిహార్‌కు చెందిన మనీశ్ కశ్యప్ యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకున్నారు. తమిళనాట బిహార్ వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయంటూ 2023లో వీడియోలను రూపొందించడంతో మనీశ్ అప్పట్లో వార్తల్లో నిలిచారు. దర్యాప్తులో అవి నకిలీ వీడియోలని తేలడంతో వలసకూలీలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో అప్పట్లో తమిళనాడు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
తర్వాత మనీశ్ కశ్యప్ 2024లో బీజేపీలో చేరారు. అనంతరం జన్‌సురాజ్ పార్టీలో చేరి.. చన్‌పటియా నియోజకవర్గం నుంచి 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.