Tom Chacko: నటి ఫిర్యాదు, సీపీటీవీ దృశ్యాలు.. మొత్తానికి దసరా మూవీ విలన్ అరెస్ట్
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:38 PM
మలయాళ ప్రముఖ నటి విన్సీ అలోషియస్ ఫిర్యాదు, హోటల్‌లో సీసీ టీవీ దృశ్యాల్లో కనిపించిన చిత్రాలు.. వెరసి ఇవాళ ప్రముఖ మలయాళ సినీ నటుడు టామ్ చాకో అరెస్ట్ అయ్యాడు. ఎందుకు టామ్..

Malayalam Actor Shine Tom Chacko Arrest: మలయాళ నటుడు, దేవర మూవీలో నటుడిగా, నాని హీరోగా నటించిన దసరా మూవీలో విలన్‌గా షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. చాకోను ఇవాళ (శనివారం) మాదకద్రవ్యాల వాడకం ఆరోపణలకు సంబంధించి కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, చాకోపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని సెక్షన్లు 27 (మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాల వినియోగం) మరియు సెక్షన్ 29 (ప్రేరణ మరియు నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు. తదుపరి చట్టపరమైన చర్యలతో పాటు త్వరలో వైద్య పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసులో చాకో బెయిల్ పొందే అవకాశం ఉంది.
ఇలా ఉండగా, కొచ్చి నగర పోలీసులు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో చాకో ఈ ఉదయం నార్త్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. ఆయన తన న్యాయవాదులతో కలిసి ఉదయం 10 గంటల ప్రాంతంలో స్టేషన్‌కు చేరుకున్నారు. బుధవారం జిల్లా యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (డాన్సాఫ్) నిర్వహించిన దాడిలో హోటల్ నుండి పారిపోయినట్లు టామ్ చాకో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించే ప్రధానంగా పోలీసులు టామ్ ను ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.
వినోద పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకాన్ని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనిపై అవగాహనా కార్యక్రమాలు, కఠినమైన నిబంధనలు, తనిఖీలకు సంబంధించి కూడా పోలీసులు చాకోను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హోటల్‌లో లభ్యమైన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు టామ్ చాకోను ప్రశ్నించారు. బుధవారం రాత్రి, పోలీసులు వచ్చారని గ్రహించిన చాకో తన హోటల్ గది మూడవ అంతస్తు కిటికీ నుండి రెండవ అంతస్తు టెర్రస్‌కు దూకినట్లు దృశ్యాలు ఉన్నాయి. అక్కడి నుండి, అతను స్విమ్మింగ్ పూల్ లోకి దూకి పారిపోయాడు. ఈ రహస్యాలన్నీ పోలీసులు సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిర్ధారణకు వచ్చారు.
అయితే, విచారణ సమయంలో టామ్ చాకో వివరణ మరో విధంగా ఉంది. హోటల్ తలుపు వద్ద పోలీసు అధికారులు ఉన్నారని తాను అనుకోలేదని, వచ్చిన వారు తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దుండగులు అని భావించానని చాకో చెప్పాడని పోలీసులు అంటున్నారు. అందుకోసమే తాను హోటల్ నుంచి తప్పించుకున్నానని టామ్ అంటున్నాడు.
పోలీస్ దర్యాప్తులో భాగంగా, పోలీసులు టామ్ చాకో కాల్ డేటా రికార్డులు, టెక్స్టింగ్(అతని మెసేజెస్) హిస్టరీని సేకరించినట్లు చెబుతున్నారు. ఎర్నాకులం సెంట్రల్ అసిస్టెంట్ కమిషనర్ సి జయకుమార్, నార్కోటిక్ సెల్ అసిస్టెంట్ కమిషనర్ కె ఎ అబ్దుల్ సలాం నేతృత్వంలోని బృందం అతన్ని విచారించింది.
ఇక, దాడులు జరిపిన హోటల్ నుండి మాత్రం పోలీసులు ఎటువంటి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోలేకపోయారు. దీంతో సదరు హోటల్ మీద పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
ఇదిలా ఉంటే, మలయాళ ప్రముఖ నటి విన్సీ అలోషియస్ ఇటీవలే ఫిల్మ్ ఛాంబర్‌లో టామ్ చాకో మీద ఫిర్యాదు చేసింది. మాదకద్రవ్యాల ప్రభావంతో చాకో "అనుచిత ప్రవర్తన" చేశాడని ఆరోపించింది. ఈ విషయాన్ని నటి.. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA)కి కూడా నివేదించింది. అయితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా, వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఘటన ఇంకా రిలీజ్ కాని "సూత్రవాక్యం" అనే సినిమా సెట్స్‌లో జరిగిందని తెలుస్తోంది.
Also Read:
అక్షయ తృతీయ గోల్డ్ బదులు ఇవి కొన్నా అదృష్టమే.
గుడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులు జారీ..
Andhra Pradesh News and Telugu News..