Smart Packing Tips: టూర్‌లపై వెళ్లే వారు తమ సూట్‌కేసుల్లో పెట్టకూడని వస్తువులు ఇవీ
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:19 AM
పర్యటనలకు వెళ్లే సమయంలో కొందరు అతిజాగ్రత్తలకు పోయి పలు వస్తువులను తమ సూట్‌కేసుల్లో ప్యాక్ చేసుకుని చివరకు ఇక్కట్ల పాలవుతుంటారు. మరి టూరిస్టులు తమ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేని వస్తువులు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: కొత్త ప్రదేశాలకు టూర్‌లపై వెళ్లేటప్పుడు కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా అనేక వస్తువులను తమ సూట్ కేసుల్లో కుక్కి పెడుతుంటారు. చివరకు లగేజీ బరువు పెరగడంతో వాటిని మోయలేక టూర్ అంతా చిరాకుగా గడిపేస్తారు. అయితే, పర్యటనలను ఎంజాయ్ చేయాలనుకునే వారు తమ సూట్‌కేసుల్లో కొన్ని వస్తువులను అస్సలు పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఏదైనా సందర్భంలో అక్కరకు రావచ్చనే ఉద్దేశంతో కొందరు తమ సూట్‌కేసుల్లో నెయిల్ కట్టర్, కత్తెర, ఆర్మీ నైఫ్‌లను కూడా పెట్టుకుంటారు. వాస్తవానికి ఇలాంటి వాటి కోసం సూట్‌కేసుల్లో ప్రత్యేక అరలు కూడా ఉంటాయి. చాలా దేశాలు వీటిని అనుమతిస్తాయి. అయితే, కొన్ని దేశాలు మాత్రం వీటి విషయంలో నిక్కచ్చిగా ఉంటాయి. ఫలితంగా తనిఖీల సమయంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాబట్టి, విదేశీ పర్యటనల సందర్భంగా వీటిని వెంట తీసుకెళ్లకుండా ఉండటమే మంచిది.
కొందరు తమ వెంట చెప్పుల జతలను కూడా తీసుకెళుతుంటారు. వివిధ సందర్భాలకు అనువుగా ఉండేందుకు పలు జతలను ఎంపిక చేస్తారు. ఈ తీరు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అన్ని సందర్భాలకు అనువుగా ఉండే ఒక జత తీసుకెళ్లడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఇక కొందరు రకరకాల షాంపూలు, లోషన్లు వంటివి కూడా తీసుకెళుతుంటారు. చాలా మంది చేసే సాధారణ పొరపాటు ఇది. దీని వల్ల సూట్ కేసు బరువు కూడా పెరుగుతుంది. కాబట్టి, పర్యటనలకు అనువుగా ఉంటే చిన్న సైజు టాయిలెటరీస్‌ను ఎంచుకోవాలి. దీంతో, మీ సూట్‌కేసులో ఇతర వస్తువులు పెట్టుకునేందుకు జాగా మిగులుతుంది. చాలా హోటళ్లు తమ అతిథులకు ఇవి ఉచితంగానే ఇస్తాయన్న విషయం మర్చిపోకూడదు.
పర్యటనల్లో కాలక్షేపం కోసం కొందరు తమ వెంట బోలెడన్ని పుస్తకాలను కూడా తీసుకెళతారు. దీని వల్ల లగేజీ బరువు మరింత పెరిగి ఇబ్బందికరంగా మారుతుంది. ఇతర ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లేందుకు కావాల్సిన జాగా కూడా లగేజీలో ఉండదు. కాబట్టి, పుస్తకాలకు బదులు ఈ-బుక్స్‌ను ఎంచుకుంటే కొంత వరకూ ప్రయోజనం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
వానాకాలంలో కారులో దుర్వాస పోవాలంటే ఈ టిప్స్‌ను పాటించాలి
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్