Share News

Travel Tips: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ మోసాలపై జాగ్రత్త.!

ABN , Publish Date - Jul 29 , 2025 | 09:21 PM

మీరు టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎందుకంటే, పర్యాటకుల్ని మోసం చేసే సాధారణ మోసాలు కొన్ని ఉన్నాయి. వాటి నుండి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Travel Tips:  టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ మోసాలపై జాగ్రత్త.!
Travel Tips

ఇంటర్నెట్ డెస్క్‌: నకిలీ గైడ్‌లు, టాక్సీ మోసాలు, తారుమారు కరెన్సీ మార్పిడులు ఇవన్నీ పర్యటనలో తరచూ ఎదురయ్యే సాధారణ మోసాలు. మీరు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పర్యాటకుల్ని మోసం చేసే సాధారణ మోసాలు కొన్ని ఉన్నాయి. వాటి నుండి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


టాక్సీ మీటర్ మోసం

పర్యాటకులు ఎక్కువగా ఎదురయ్యే మోసాల్లో టాక్సీ మోసం చాలా సాధారణం. ఇది ముఖ్యంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు వంటి రద్దీ గల ప్రాంతాల్లో జరుగుతుంది. డ్రైవర్ మీటర్ ఆఫ్ చేసి, అది పాడైందని చెబుతాడు. అసలు ఛార్జీ కంటే రెండు మూడు రెట్లు డబ్బు వసూలు చేస్తాడు. మీకు తెలియని నగరమైతే, చిన్నదారి ఉండగా కావాలనే పొడవైన మార్గంలో తీసుకెళ్తారు. గూగుల్ మ్యాప్స్ వంటి యాప్‌లు ఉపయోగించనివారికి ఇది పెద్ద నష్టంగా మారుతుంది. కాబట్టి,మోసానికి గురికాకుండా ఉండాలంటే మీటర్ తప్పనిసరిగా ఉండే టాక్సీ ఎంచుకోండి, ప్రీపెయిడ్ టాక్సీలు లేదా ఒలా, ఉబర్ లాంటి యాప్‌లను ఉపయోగించండి. గూగుల్ మ్యాప్స్‌లో మీ మార్గాన్ని ట్రాక్ చేయండి. అధికారిక స్టాండ్ల నుంచి మాత్రమే టాక్సీ తీసుకోండి.


నకిలీ టూర్ గైడ్‌లు

పర్యాటకులు ఎక్కువగా నకిలీ టూర్ గైడ్‌లతో మోసపోతారు. వారు అధికారిక గైడ్‌ల మాదిరిగా ప్రవర్తిస్తూ, తప్పుదారి పట్టిస్తారు. తక్కువ డబ్బులు తీసుకుంటా అని మొదలుపెట్టి చివరికి భారీగా ఛార్జ్ చేస్తారు. కాబట్టి, ముందుగా గైడ్‌ను బుక్ చేసుకోండి. అనధికారిక వ్యక్తులపై ఆధారపడొద్దు.


నకిలీ బుకింగ్ వెబ్‌సైట్‌లు

ఈ డిజిటల్ యుగంలో ట్రావెల్ బుకింగ్‌ ఎక్కువగా ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుంది. అదే సమయంలో నకిలీ వెబ్‌సైట్‌లు పర్యాటకులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నాయి. మొదట తక్కువ ధర చూపించి, బుకింగ్ చివర్లో అధిక సేవల రుసుములు, టాక్స్‌లు, హిడెన్ ఛార్జీలను వేస్తారు.పేమెంట్ చేసిన తర్వాత రిఫండ్ ఇవ్వరు, లేదా బుక్ అయినట్లు మెసేజ్ వచ్చినా రియల్ రిజర్వేషన్ లేదని గుర్తవుతుంది.

కరెన్సీ ఎక్స్చేంజ్

అసలు కరెన్సీ బదులు నకిలీ నోట్లు, చిరిగిన నోట్లు లేదా వేరే దేశ కరెన్సీ ఇచ్చే అవకాశమూ ఉంది. నోట్ల కట్టల మధ్య నకిలీ నోట్లు జోడించి ఆకస్మికంగా మార్చడం సాధారణంగా జరుగుతుంది. గందరగోళంగా మాట్లాడటం, త్వరగా మార్చమని తొందరపడటం వంటివి చేస్తూ మీరు నోట్లను లెక్కించకుండా వెళ్లేలా చూస్తారు. కాబట్టి, బ్యాంకులు, ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ఛేంజ్ కౌంటర్లు, లేదా ఆధికారికంగా లైసెన్స్ పొందిన ఎఫ్ఎక్స్ ఏజెంట్లు వద్ద మాత్రమే డబ్బు మార్పిడి చేయండి.


ఇవి కూడా చదవండి:

అల్యూమినియం పాత్రల్లో ఇన్నేళ్లకు మించి వండితే కిడ్నీ సమస్యలు..!

హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.

Also Read Lifestyle News

Updated Date - Jul 29 , 2025 | 09:25 PM