Share News

Fatty Liver Disease: మందు ముట్టని యువ టెకీకి లివర్ సమస్యలు.. జాగ్రత్తపడాలంటూ పోస్టు

ABN , Publish Date - May 31 , 2025 | 10:19 PM

24 ఏళ్ల వయసులోనే లివర్ సమస్య బారిన పడ్డ ఓ టెకీ నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. మద్య, ధూమపానం అలవాటు లేకపోయినా తాను లివర్ సమస్య బారిన పడ్డానంటూ అతడు పెట్టిన పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

Fatty Liver Disease: మందు ముట్టని యువ టెకీకి లివర్ సమస్యలు.. జాగ్రత్తపడాలంటూ పోస్టు
techie liver damage

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు జస్ట్ 24 ఏళ్ళు. పూర్తి ఆరోగ్యంతో ఉండాల్సిన వయసు అది. కానీ, ఊహించని విధంగా లివర్ సమస్యలు చుట్టుముట్టాయి. తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అతడు అస్సలు ఊహించలేదు. టెస్టుల్లో విషయం బయటపడ్డాక షాకయిపోయాడు. చివరకు అసలు ఏం జరిగిందీ చెబుతూ నెట్టింట పోస్టు పెట్టాడు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

‘‘నేను ఐటీ రంగంలో ఉన్నా. మద్యం అలవాటు అస్సలు లేదు. అయినా లివర్ డ్యామేజీ అయ్యింది. అయితే, ఈ పరిస్థితిని మరెందరో యువ కార్పొరేట్ రంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. వీళ్లందరూ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫోన్‌పే లాంటి బడా సంస్థల్లో పనిచేస్తున్నారు. పెద్ద నగరాల్లో ఉంటున్నారు. అందరిదీ ‘సాధారణ ఐటీ ఉద్యగి జీవితమే’. వీళ్లందరిలో ఎస్‌జీపీటీ, ఎస్‌జీఓటీ లెవెల్స్ అధికంగా ఉన్నాయి’


‘నాకు లివర్ సమస్య వచ్చినప్పుడు కాస్త షాకయ్యా. నా ఒక్కడికే ఇలా జరిగి ఉంటుందని అనుకున్నా. ఏదో కారణంతో టెస్టుల్లో ఫలితం ఇలా వచ్చి ఉంటుందని అనుకున్నా. క్యాటీన్‌లో నా తోటి ఉద్యోగులతో చర్చల సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించా. అయితే, తమకూ ఇదే సమస్య ఉందని అనేక మంది చెప్పడం నన్ను ఆశ్చర్య పరిచిందది. వీళ్లందరి వయసు ముప్ఫైలోపే.. ఈ వయసులో వారికి రాకూడని సమస్య ఇది. మాలో చాలా మందికి మద్య, ధూమపాన అలవాటు కూడా లేదు. కానీ టెస్టుల్లో మాత్రం అనారోగ్య లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’

‘బాగా ఆలోచించగా ఇదంతా జీవనశైలి కారణంగా తలెత్తిన పరిణామమని తేలింది. మేము రోజుకు 10 నుంచి 12 గంటలు కూర్చొనే పని చేస్తాము. ఫుడ్‌ను బయట నుంచి తెప్పించుకుని తింటాము. ఇంట్లో వంట చేసుకునేందుకు సమయమే ఉండదు. మీటింగ్‌ల హడావుడిలో పడి ఒక్కోసారి మధ్యాహ్నం భోజనం కూడా తినము. ఇక రాత్రిళ్లు కూడా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల వంక చూస్తూ నిద్రపోకుండా గడిపేస్తుంటాము. ఇవి చాలవన్నట్టు ఉద్యోగ జీవితంలో ఒత్తిడి కూడా ఎక్కువ’


‘ఇవన్నీ కలగలిసి చివరకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ బారిన పడేలా చేస్తున్నాయి. అయితే, ఇంట్లో చేసుకున్న ఆహారం తినడం, రోజూ 30 నిమిషాల కసరత్తు, కంటి నిండా నిద్రతో మా కోలీగ్స్ అనేక మంది కేవలం రోజుల వ్యవధిలోనే పూర్తిగా కోలుకోవడం చూశా. కాబట్టి, సమస్య మొదలవగానే వైద్య సహాయం తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంది’ అని సదరు టెకీ రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. యువకుడి సూచనలతో అనేక మంది ఏకీభవించారు.

ఇవి కూడా చదవండి:

భాగస్వామితో ఇలాంటి మాటలంటే మీ బంధానికి బీటలు

విటమిన్-ఈ సప్లిమెంట్స్ తీసుకుంటారా.. ఈ లిమిట్ దాటితే డేంజర్

Read Latest and Health News

Updated Date - Jun 01 , 2025 | 10:09 PM