Relationships: భాగస్వామితో ఇలాంటి మాటలంటే మీ బంధానికి బీటలు
ABN , Publish Date - May 30 , 2025 | 11:41 PM
మీ లవర్స్ లేదా జీవిత భాగస్వామితో కొన్ని మాటలు అంటే బంధం బలహీనపడటం పక్కా అని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: మాటలకు ఉన్న శక్తి అంతాఇంతా కాదు. ఆచితూచి మాట్లాడకపోతే ఎంతటి బంధమైనా తెగిపోతుంది. ప్రేమికులు లేదా పెళ్లైన వారు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. మరి మనసుకు నచ్చిన వారితో ఎన్నడూ అనకూడని పదాలు ఏంటో తెలుసుకుందాం.
నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదంటూ భాగస్వామిపై నెపం నెట్టే ప్రయత్నం చేయొద్దు. నిజాయితీగా మనసులో ఉన్నది సానుకూల పదాలతో పంచుకుంటే అభిప్రాయభేదాలు తొలగిపోతాయి.
నా కంటే నీకు స్నేహితులు, కుటుంబమే ఎక్కువని నిందించడం కూడా బంధానికి చేటు తెస్తుంది. బంధాలు బలపడేందుకు సమతౌల్యం ఎంత అవసరమో వివరంగా చెబితే మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి మనసు క్రమంగా మారుతుంది.
నా అంతటి వ్యక్తిని పార్ట్‌నర్‌గా పొందే అర్హత నీకు లేదని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా అవతలి వారిని హర్ట్ చేస్తుంది. ఆధిక్య భావన కు ఇలాంటి కామెంట్స్ ప్రధాన సూచికలు
నేను లేకపోతే నువ్వు లేవని అనడం కూడా తప్పే. దీంతో, అవతలివారు తాము అల్పులమన్న భావనకు లోనవుతారు. చివరకు అసలుకే ఎసరు వస్తుంది. కాబట్టి, జీవిత భాగస్వామిలోని సానుకూలతలను కూడా గుర్తించాలి. తప్పులెంచడమే పనిగా పెట్టుకోకూడదు.
మీ అమ్మానాన్నలు నీకేమీ నేర్పించలేదా అని నిందించడం కూడా తప్పే. ఇది అసలు సమస్య మరుగున పడేలా చేస్తుంది. మనసులోని ఆందోళన గురించి కుటుంబాల ప్రస్తావన లేకుండా సున్నితంగా పంచుకునేందుకు ప్రయత్నిస్తే అరమరికలు తొలగిపోతాయి.
నువ్వంటే నాకిష్టం లేదు అని అంటే ఇక బంధానికి చెప్పినట్టే. ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య. పర్యవసానాలు కూడా అదేస్థాయిలో ఉంటాయి. కాబట్టి, ఇలాంటి కఠినమైన కామెంట్స్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.
ఒక్కోసారి ఏదోక కారణంతో డబ్బులు ఊహించిన దాని కంటే ఎక్కువ ఖర్చవుతాయి. అలాంటి సమయాల్లో భాగస్వామిని బాధ్యులను చేయడం కూడా సరికాదన్న విషయం మర్చిపోకూడదు.
నీ అభిప్రాయాలతో నాకు అవసరం లేదన్న మాటలు కూడా అవతలి వారి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. కాబట్టి, భాగస్వామితో ఎంత పెద్ద వివాదం జరిగినా ఈ మాటను మాత్రం అస్సలు వాడొద్దు.
తప్పంతా నీదే అంటూ ప్రతి చిన్న సమస్యకు జీవిత భాగస్వామిపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తే బంధం కచ్చితంగా బలహీన పడుతుంది. కలిసి ప్రయాణించేటప్పుడు తప్పొప్పుల బాధ్యత కూడా చెరి సగం ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు
మనం విడిపోదాం లేదా నాకు డైవర్స్ కావాలని కోపంలో అన్నా కూడా భారీ నష్టం జరిగిపోతుంది. ఒక్కసారి ఇలా అన్నాక మళ్లీ మాటలను వెనక్కు తీసుకోలేము. కాబట్టి, మనసులో ఆందోళనను సున్నితంగా మాట్లాడుతూ జీవిత భాగస్వామితో పంచుకోవడమే బెటర్.
Also Read:
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..
ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో చూశారా
For More Lifestyle News