Share News

భారత్‌లో మిడిల్ క్లాస్ వర్గం ఇక కనుమరుగేనా..

ABN , Publish Date - Apr 20 , 2025 | 09:29 PM

ఏఐ ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయని ఓ మార్కెట్ ఎనలిస్టు పేర్కొన్నారు. ఫలితంగా ఉద్యోగాలపై ఆధారపడే మధ్య తరగతి వర్గం కూడా కనుమరుగు కావొచ్చని తెలిపారు.

భారత్‌లో మిడిల్ క్లాస్ వర్గం ఇక కనుమరుగేనా..
salaried middle-class decline

ఇంటర్నెట్ డెస్క్: చిన్నప్పుడు బాగా చదువుకోవాలి.. పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేయాలి.. పెళ్లి చేసుకోవాలి.. పిల్లల్ని కనాలి.. రిటైర్‌మెంట్‌లోపు ఓ ఇంటిని కొనుక్కుని, పిల్లల బాధ్యతలన్నీ తీర్చేసుకుని కృష్ణారామా అనుకుంటూ వృద్ధాప్యంలో కాలం వెళ్లబుచ్చాలి. వ్యాపారస్తుల విషయాన్ని పక్కన పెడితే.. దాదాపు ప్రతి మధ్య తరగతి వ్యక్తి జీవితం ఇలాగే గడుస్తుంది. గడవాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఇదే దృష్టితో పెంచుతారు. ఈ ఫార్ములాను ఉగ్గుపాలతో నూరిపోయడం మొదలెడతారు. అయితే, ఇలా జీతాలపై జీవించే మధ్యతరగతి వర్గం భారత్‌లో కనుమరుగు కానుందని ఓ మార్కెట్ ఎనలిస్టు చెప్పుకొచ్చారు.

పోర్టు ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థ మార్సెలస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ ముఖర్జీయా ఈ పోస్టు పెట్టారు. భారత్‌లో కొత్త ఆర్థిక దశ మొదలైందని అన్నారు. జీతాలపై జీవించే మధ్యతరగతి వర్గం క్రమంగా కనుమరుగైపోతుందని చెప్పారు.


‘‘ఈ దశాబ్దాన్ని ఒక్క ముక్కలో నిర్వచించాలంటే.. జీతాలిచ్చే ఉపాధి కనుమరుగు కావడమే. మంచి చదువులు చదివి కష్టపడి పనిచేసే వారికి జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఉండవు. ఇది మన తల్లిదండ్రుల తరం నాటి మోడల్. అప్పట్లో ఒక సంస్థ కోసం 30 ఏళ్ల పాటు పనిచేసే ఉపాధి మార్గం కనుమరుగవుతోంది. ఇంతకాలం భారత మధ్య తరగతి వార్గాన్ని అండగా నిలిచిన ఈ వ్యవస్థ ఇకపై ఎక్కువ కాలం మనలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

కష్టపడి పనిచేసే మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలను ఇకపై ఆటోమేషన్, ఏఐ భర్తి చేయనున్నాయని తెలిపారు. ‘‘వైట్ కాలర్ ఉద్యోగస్థులు చేసే పనులను ఇప్పుడు ఏఐ చక్కబెడుతోంది. గూగుల్‌లో మూడొంతుల కోడింగ్ బాధ్యతలు ఏఐ నిర్వహిస్తోందని ఆ సంస్థ ఇటీవలే ప్రకటించింది. భారతీయ ఐటీ, మీడియా, ఫైనాన్స్ రంగాల్లోనూ ఇదే జరగబోతోంది’’ అని ముఖర్జీయా తెలిపారు. ఆధునిక సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో మధ్యస్థాయి కెరీర్ అవకాశాలు తమ ఉనికినే కోల్పోతున్నాయని అన్నారు. ఈ సమయంలో భారతీయులకు.. ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్, ఆధార్, మొబైల్ క్లౌడ్ వంటివి అక్కరకు వస్తాయని చెప్పారు.


శాలరీ, స్థిరత్వంపై ప్రజల దృష్టి కోణం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మనకు ఇప్పటివరకూ విజయం అంటే డబ్బే. కానీ ఇది మారాలి. నెలనెలా వచ్చే జీతాలు కాకుండా సంతోషం, మన పని ప్రభావశీలత వంటి అంశాలపై మళ్లాలి’’ అని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా తల్లిదండ్రులు పిల్లల పెంపకాన్ని చేపట్టకూడదని అన్నారు. ఆ ఉద్యోగాలు ఇక ఎంతమాత్రం అందుబాటులో ఉండవని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

కాబోయే భర్తపై ప్రియుడితో దాడి చేయించిన యువతి.. కోమాలో బాధితుడు

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..

Read Latest and Viral News

Updated Date - Apr 20 , 2025 | 10:16 PM