Share News

Typhoon Kalmaegi: తుపాను బీభత్సం.. దెబ్బతిన్న వేల కొద్దీ ఇళ్లు

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:49 PM

కాల్మెగీ తుపాను వియత్నాం దేశంలో బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి దాదాపు 2600 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను గాలులకు ఇళ్ల టాపులు కొట్టుకుపోయాయి. 57 ఇళ్లు పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి. ఇక ఫిలిప్పీన్స్‌లో తుపానుకు చిక్కి సుమారు 200 మంది మరణించారు.

Typhoon Kalmaegi: తుపాను బీభత్సం.. దెబ్బతిన్న వేల కొద్దీ ఇళ్లు
Typhoon Kalmaegi Vietnam

ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్ దేశాన్ని అతలాకుతలం చేసిన కాల్మెగీ తుపాను వియత్నాంలో కూడా బీభత్సం సృష్టించింది. గియా లాయ్, డాక్ లక్ ప్రావిన్సుల్లో వేల కొద్దీ ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటి పైప్పులు తుపాను గాలులకు కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. గంటకు దాదాపు 149 కిలోమీటర్ల వేగంతో భయానక గాలులు వీచడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. వియత్నాం ఎదుర్కొన్న భారీ తుపాన్లలో ఇదీ ఒకటని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది (Typhoon Kalmaegi).

తుపానుతో ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. సుమారు 2600 ఇళ్లకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఒక్క గియా లాయ్ ప్రావిన్స్‌లోనే సుమారు 2400 ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. 57 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయని అన్నారు. డాక్ లాక్ ప్రావిన్స్‌లో ముగ్గురు, గియా లాయ్ ప్రావిన్స్‌లో ఇద్దరు మరణించారు. పొరుగున ఉన్న కాంగ్‌ ఎన్‌గాయ్ ప్రావిన్స్‌లో గల్లంతైన ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. తుపాను బీభత్సానికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చెట్లు నేలకూలడం, విద్యుత్ తీగలు తెగడంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. భీకర గాలుల ధాటికి అనేక ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి.


ఇక కాల్మెగీ కారణంగా ఫిలిప్పీన్స్‌లో దాదాపు 200 మంది మరణించారు. 135 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ వారం మొదట్లో ఫిలిప్పీన్స్ తీరాన్ని తాకిన కాల్మెగీ తుపాను ఆ తరువాత వియత్నాంలో బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం కాస్త బలహీనపడి పొరుగున ఉన్న కాంబోడియాలో ప్రవేశించింది. అయితే, ఫిలిప్పీన్స్‌కు సమీపంలోని సముద్ర జలాల్లో మరో తుపాను రూపుదిద్దుకుంటుండటంతో దేశ ప్రధాని ఫెర్డినాండ్ మార్కోస్ గురువారం జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారు. వాతావరణ మార్పుల కారణంగా ఆగ్నేయ ఆసియాలో తుపాన్లు, వరదల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 03:45 PM