Shakira Medical Records: పాప్ స్టార్ మెడికల్ రికార్డులు లీక్.. ఆసుపత్రిపై రూ.1.57 కోట్ల జరిమానా
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:36 PM
ప్రముఖ పాప్ స్టార్ మెడికల్ రికార్డులను లీక్ చేసిన ఓ ఆసుపత్రిపై పెరూ దేశ వైద్య నియంత్రణ మండలి రూ.1.57 కోట్ల జరిమానా విధించింది. పేషెంట్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్త వహించడం ఆసుపత్రుల బాధ్యతేనని స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పాప్ సింగర్ షకీరా వైద్య రికార్డులను బయటపెట్టిన ఓ ఆసుపత్రిపై పెరూ దేశ వైద్య నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఆనా ఎస్ఏ అనే ఆసుపత్రిపై ఏకంగా రూ.1.57 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. డెల్గాడోలోని ఆనా ఎస్ఏకు చెందిన ఆసుపత్రిపై ఈ జరిమానా విధించింది (Shakira Medical Records Leak).
పెరూలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన ఆనా ఎస్‌ఏ ప్రధాన కేంద్రం లీమాలోని మిరాపొలిస్ ప్రాంతంలో ఉంది. ఇతర ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. సెలబ్రిటీలకు వైద్యమందించే ఆసుపత్రిగా ఆనా ఎస్‌ఏ స్థానికంగా పాప్యులర్. ఇందుకు తగినట్టే మిరాపొలిస్ బ్రాంచ్‌లో రోగుల సౌకర్యార్థం ఏకంగా హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు.
ఇటీవల షకీరా తన మ్యూజిక్ టూర్‌లో భాగంగా పెరూకు వచ్చిన సమయంలో ఆమె మెడికల్ రికార్డులు బహిర్గతమయ్యాయి. రాజధాని లీమాకు చేరుకోగానే షకీరా అనారోగ్యం బారిన పడ్డారు. వెంటనే డెల్గాడోలోని ఆనా ఎస్‌ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే, ఆమె చికిత్స కొనసాగుతుండగానే మెడికల్ రికార్డులు రియల్ టైమ్‌లో లీకయ్యాయి. ఈ క్రమంలోనే షకీరా తన మొదటి కాన్సర్ట్‌ను క్యాన్సల్ చేసుకుంది. అనారోగ్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. కానీ రికార్డులు లీకైన ఉదంతంపై మాత్రం స్పందించలేదు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పెరూ దేశ వైద్య నియంత్రణ మండలి.. డెల్గాడోలోని ఆసుపత్రిపై భారీ జరిమానా విధించింది. ఈ డేటా లీక్ తీవ్రమైన ఉల్లంఘన అని అభిప్రాయపడింది. పేషెంట్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆసుపత్రిదేనని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
కెనడాపై ట్రంప్ ఆగ్రహం.. వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటన
ట్రంప్ వీసా ఆంక్షలతో వైద్య సిబ్బంది కొరత.. అందోళనలో అమెరికా ఆసుపత్రులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి