Share News

థాయ్‌లాండ్ బౌద్ధ మతాధికారుల్ని కుదిపేస్తున్న భారీ హనీ ట్రాప్

ABN , Publish Date - Jul 18 , 2025 | 04:53 PM

థాయ్‌లాండ్ బౌద్ధ మతాధికారులను ఇప్పుడు భారీ హనీ ట్రాప్ కుదిపేస్తోంది. బౌద్ధ సన్యాసులను ప్రలోభపెట్టి రూ.100 కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు ఒక థాయ్ మహిళపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్స్, బ్లాక్‌మెయిల్..

థాయ్‌లాండ్ బౌద్ధ మతాధికారుల్ని కుదిపేస్తున్న భారీ హనీ ట్రాప్
Monks Massive Sex Scandal Shakes Thailand

ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్ బౌద్ధ మతాధికారులను ఇప్పుడు భారీ హనీ ట్రాప్ కుదిపేస్తోంది. బౌద్ధ సన్యాసులను ప్రలోభపెట్టి రూ.100కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు థాయ్ మహిళపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్స్, బ్లాక్‌మెయిల్, నమ్మక ద్రోహం వంటి అంశాలు ఇప్పుడక్కడ చర్చనీయాంశమయ్యాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఈ హనీ ట్రాప్ థాయ్‌లాండ్ బౌద్ధ ఆచారాల్ని కంపించేలా చేసింది.

విలావన్ ఎమ్సావత్ అనే ఆ యువతి విసిరిన వలపు వలలో తొమ్మిది మందికి పైగా సన్యాసులు చిక్కుకున్నట్టు సమాచారం. 80వేల ఫొటోలు, ప్రైవేట్ వీడియోలు చూపించి ఆమె గత మూడేళ్లుగా బెదిరిస్తుండటంతో సదరు బౌద్ధ సన్యాసులు రూ.100 కోట్లకు పైగా సమర్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆ కిలాడీ లేడీకి థాయ్ పోలీసులు మిస్‌ గోల్ఫ్‌ అని పేరుపెట్టారు. కాగా, జూన్‌ నెలలో బాధితుల్లో ఒకరు సన్యాసానికి దూరం కావడం, దానిపై పోలీసులు దృష్టి సారించడంతో ఈ లైంగిక బ్లాక్ మెయిల్ వ్యవహారం బయటపడింది.

2024 మే నెలలో విలావన్ ఎమ్సావత్ ఓ సన్యాసితో లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ బంధం వల్ల ఒక బిడ్డకు జన్మనిచ్చానని అతనికి చెప్పింది. ఖర్చుల కోసం 7 మిలియన్‌ బాట్‌ (రూ.1.85కోట్లు) ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇదే తరహాలో మరికొంతమంది సన్యాసులతో ఇలాగే చేసి భారీగా సొమ్ములు స్వాహా చేసిందని పోలీసులు గుర్తించారు.

ఈ హనీ ట్రాప్ మీద థాయ్‌లాండ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బ్యాంకాక్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడించారు. విలావన్ ఎమ్సావత్ బ్యాంకు ఖాతాల ద్వారా కేవలం మూడు సంవత్సరాలలో 385 మిలియన్ బాట్ (సుమారు రూ. 101 కోట్లు) మనీలాండరింగ్ జరిపినట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ఆమెను బ్యాంకాక్ ఉత్తర ప్రాంతంలో అరెస్టు చేశారు. సదరు సొమ్ముల్లో కొంత మొత్తాన్ని విలావన్ ఆన్ లైన్ బెట్టింగ్ కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.


కాగా, ఈ డబ్బులో ఎక్కువ భాగం ఆలయ ఖజానా నుంచి వచ్చిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆమె ప్రలోభపెట్టిన సీనియర్ సన్యాసుల నుంచి సేకరించిన డబ్బు పెద్ద మొత్తంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సన్యాసులను ఈ లైంగిక ఉచ్చులో రాజీపడేలా చేసిన వారిలో కొందరు మఠాధిపతి హోదా కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇలా ఉంటే, డిజిటల్ ఫోరెన్సిక్‌ నివేదికలు, విలావన్ హార్డ్ డిస్క్‌లలో నిల్వ చేసిన వేలాది ఫొటోలు, మెసేజ్‌లు, ఇంకా వీడియోలను పూర్తిగా పరిశీలిస్తే బాధితుల జాబితా పెరుగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు.

ఈ హనీ ట్రాప్ పై థాయ్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. థాయిలాండ్ తాత్కాలిక ప్రధాన మంత్రి ఫుమ్తామ్ వెచాయాచాయ్ ఆలయ ఆర్థిక వ్యవహారాలను తక్షణమే సమీక్షించాలని, సన్యాసుల ప్రవర్తనను నియంత్రించడానికి కఠినమైన నియమాలను ప్రవేశపెట్టాలని కోరారు. మతాధికారుల అనైతిక ప్రవర్తనను నివేదించడానికి ఒక ప్రత్యేక పబ్లిక్ పోర్టల్ కూడా ప్రారంభించారు.

థాయ్ ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారని, అనుచితంగా ప్రవర్తించారని సదరు బౌద్ధ సన్యాసులను ఉద్దేశిస్తూ థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ పేర్కొన్నారు. ఈ మేరకు తన 73వ పుట్టినరోజు వేడుకలకు హాజరుకావాల్సిన 80 మందికి పైగా సన్యాసులకు ఆహ్వానాలను రద్దు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి 11 మంది సన్యాసులను తొలగించినప్పటికీ, దేశంలోని బౌద్ధమత జాతీయ కార్యాలయం ఈ లైంగిక వ్యవహారంపై విస్తృత పోలీసు దర్యాప్తుతో ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రతిజ్ఞ చేసింది.


ఇవి కూడా చదవండి..

సైబర్‌ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టేలా చట్టాల్లో మార్పులు: రఘురామకృష్ణంరాజు

2047 నాటికి నెం 1గా తెలుగు జాతి: నిమ్మల రామానాయుడు

Read latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2025 | 07:40 PM