Baykar Kızılelma: మానవరహిత ఫైటర్ జెట్ నుంచి బీవీఆర్ మిసైల్ ప్రయోగం.. చరిత్ర సృష్టించిన టర్కీ సంస్థ
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:52 PM
తుర్కియేకు చెందిన రక్షణ రంగ సంస్థ బెయికార్ సంచలనం సృష్టించింది. మానవరహిత ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించిన బీవీఆర్ మిసైల్‌తో గగనతలంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
ఇంటర్నెట్ డెస్క్: తుర్కియేకు చెందిన ప్రైవేటు రక్షణ రంగ సంస్థ బెయికార్ సంచలనం సృష్టించింది. మానవ రహిత ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) మిసైల్‌తో గగనతలంలోని మరో జెట్ ఇంజన్ ఆధారిత విహంగాన్ని ధ్వంసం చేసింది. రాడార్ ద్వారా టార్గెట్‌ను ట్రాక్ చేసి మరీ అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. మానవసహిత ఫైటర్ జెట్లకు మాత్రమే సాధ్యమయ్యే ఈ ఫీట్‌ను విజయవంతంగా పూర్తి చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. సినోప్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు (Baykar Kızılelma unmanned fighter jet).
కిజిలెల్మా అనే మానవరహిత ఫైటర్ జెట్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించారు. వాస్తవానికి కిజిలెల్మా.. జెట్ ఇంజెన్ ఆధారంగా నడిచే డ్రోన్. అయితే, సాధారణ మానవసహిత ఫైటర్ జెట్ సామర్థ్యాలు అనేకం దీని సొంతం. ఇక తాజా ప్రయోగంలో ఈ జెట్ ప్రయోగించిన గోక్డోగాన్ మిసైల్.. రాడార్ సాయంతో లక్ష్యాన్ని గుర్తించి ధ్వంసం చేసింది. ఫైటర్ జెట్‌లోని అసెల్సాన్ మురాద్ రాడార్ సాయంతో లక్ష్యాన్ని ట్రాక్ చేశారు. అచ్చు మానవ సహిత ఫైటర్ జెట్‌ల తరహా సామర్థ్యం కిజిలెల్మాకు ఉన్నట్టు ఈ ప్రయోగంతో స్పష్టంగా నిరూపితమైంది.
విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం, శత్రుదేశాలకు చిక్కకుండా ఉండే సామర్థ్యంలో ఈ ఫైటర్ జెట్ ఇప్పటికే టాప్‌లో ఉంది. బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్‌తో గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించడంలో తాజాగా విజయం సాధించింది. వైమానిక యుద్ధ రీతుల్లో ఇదో కొత్త అధ్యాయం. ఇక ఈ ఫైటర్ జెట్‌తో గుట్టుచప్పుడు కాకుండా శత్రుదేశాల గగనతల లక్ష్యాలను టార్గెట్ చేయొచ్చు. ఫైటర్ జెట్స్‌కు 40 కిలోమీటర్లకు మించి దూరాన ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేసే మిసైల్స్‌ను రక్షణ రంగ పరిభాషలో బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ అని పిలుస్తారు. అత్యాధునిక బీవీఆర్ మిసైల్స్ 100-150 కిలోమీటర్ల దూరంలోని గగనతల లక్ష్యాలను కూడా ఛేదించగలవు.
డ్రోన్ తయారీలో అగ్రగామిగా ఉన్న బెయికార్ సంస్థ 2023లో ఎగుమతుల ద్వారా ఏకంగా 1.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. సంస్థ ఆదాయంలో 90 శాతం వాటా ఎగుమతులదే. గత నాలుగేళ్లుగా తుర్కియేలో టాప్ రక్షణ, ఎయిరోస్పేస్ రంగ సంస్థగా బెయికార్ నిలిచింది.
ఇవి కూడా చదవండి
యూకేలో 80 శాతం మేర తగ్గిన వలసలు.. పెద్ద సంఖ్యలో బ్రిటన్‌ను వీడిన భారతీయులు
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్
Read Latest International And Telugu News