100 Civet Cats: పెళ్లి కూతురికి కట్నంగా 100 పునుగు పిల్లులు..
ABN , Publish Date - Jun 09 , 2025 | 02:04 PM
100 Civet Cats: ఆ 100 పునుగు పిల్లుల ఖరీదు 50 లక్షల రూపాయలు పైనే ఉంటుంది. తల్లిదండ్రులు తమ కూతురికి పునుగు పిల్లులు కట్నం కింద ఇవ్వటం వెనుక ఓ బలమైన కారణం ఉంది.

పెళ్లి సమయంలో ఆడవాళ్లకు కట్నం కింద డబ్బులు, బంగారం, స్థలాలు ఇవ్వటం కామన్. కానీ, వియత్నాంకు చెందిన 22 ఏళ్ల ఓ యువతికి మాత్రం ఆమె తల్లిదండ్రులు కట్నం కింద డబ్బు, బంగారం, స్థలాలతో పాటు అత్యంత అరుదైన పునుగు పిల్లుల్ని కూడా ఇచ్చారు. ఒకటో రెండో కాదు.. ఏకంగా 100 పునుగు పిల్లుల్ని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. కేవలం ఆ 100 పునుగు పిల్లుల ఖరీదు 50 లక్షల రూపాయలు పైనే ఉంటుంది. తల్లిదండ్రులు తమ కూతురికి పునుగు పిల్లులు కట్నం కింద ఇవ్వటం వెనుక ఓ బలమైన కారణం ఉంది.
పునుగు పిల్లుల ద్వారా కోపి లువాక్ కాఫీ గింజలు తయారు చేస్తారు. ఏషియన్ పామ్ పునుగు పిల్లులకు కాఫీ గింజల్ని తినిపిస్తారు. ఆ గింజలను పునుగు పిల్లులు పూర్తిగా అరిగించుకోలేవు. మలం ద్వారా బయటకు విసర్జిస్తాయి. వాటిని సేకరించి అమ్ముతూ ఉంటారు. ఈ కాఫీ గింజలు చాలా ఖరీదు. వాటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. తమ కూతురు ఆ పిల్లులతో కాఫీ గింజల బిజినెస్ చేసుకుంటుందని ఆ తల్లిదండ్రులు వాటిని ఇచ్చారు. పిల్లులతో పాటు 25 గోల్డ్ బార్లు..
17 లక్షల రూపాయల నగదు.. 10 లక్షలు విలువ చేసే కంపెనీ షేర్లు.. ఏడు స్థలాలతో పాటు చాలా ఖరీదైన ఆస్తుల్ని ఆమెకు కట్నం కింద ఇచ్చారు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రమే కాదు.. అత్తింటి వారు కూడా పెద్ద మొత్తంలో కానుకలు ఇచ్చారు. ఆరున్నర లక్షల డబ్బు.. పది గోల్డు బార్లు, వజ్రాల ఆభరణాలు బహుమతిగా ఇచ్చారు. కూతురికి పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వటంపై పెళ్లి కూతురి తండ్రి మాట్లాడుతూ.. ‘మా కూతురు బిజినెస్ స్కూల్లో చదివింది. తన కాళ్ల మీద తను నిలబడాలన్న ఉద్ధేశ్యంతో వాటిని ఇచ్చాము’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
విమానం ఎక్కుతూ ట్రంప్ తడబాటు.. కొంచెం ఉంటే..