Employability: ఈ డిగ్రీలు ఉన్న వారికి అద్భుత ఉద్యోగావకాశాలు.. స్కిల్స్ రిపోర్టులో వెల్లడి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:06 AM
ఏఐ జమానాలో కంప్యూటర్ సైన్స్, ఐటీ డిగ్రీ పట్టాలు ఉన్న వారికి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఇండియా స్కిల్స్ రిపోర్టు తేల్చింది. ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎంబీఏ కాస్త వెనుకబడగా కామర్స్ గణనీయంగా మెరుగైనట్టు కూడా నివేదికలో తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ జమానాలో ఉద్యోగాల తీరుతెన్నులు సమూలంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాలేజీ చదువులు పూర్తి చేసుకునే యువత ముందున్న అవకాశాలపై ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెక్ డిగ్రీలు ఉన్న వారికి ప్రస్తుతం అద్భుత అవకాశాలు ఉన్నాయని నివేదిక తేల్చింది. అయితే, కెరీర్‌కు భరోసా కల్పించే ఎంబీఏ డిగ్రీ ఈసారి కాస్త వెనుకబడింది (Employability).
నివేదిక ప్రకారం, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉన్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఏకంగా 80 శాతంగా ఉంది. ఆ తరువాత స్థానంలో ఉన్న ఐటీ డిగ్రీలకు ఉద్యోగావకాశాలు 78 శాతం. ఇక బీఈ, బీటెక్ డిగ్రీలకు జాబ్ ఛాన్స్ 70.15 శాతం. ఎంబీఏ డిగ్రీలు చేసిన వారి ఉద్యోగావకాశాలు 72.76 శాతంగా ఉన్నాయి. బీకామ్, నాన్ ఐటీ సైన్స్ డిగ్రీలు, ఆర్ట్స్ వంటి డిగ్రీలు ఉన్న వారి ఉద్యోగావకాశాలు 62 నుంచి 55 శాతం మధ్య ఉన్నాయి.
కంప్యూటర్ సైన్స్, ఐటీ పట్టభద్రులకు ఎప్పటిలాగే ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని నివేదిక తేల్చింది. అయితే, నాన్ టెక్నికల్, వొకేషనల్ డిగ్రీలు ఉన్న వారు కూడా గతంలో కంటే మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోనున్నారు.
ఏఐ వినియోగం పెరుగుతుండటంతో సీఎస్, ఐటీ డిగ్రీలు ఉన్న వారికి అవకాశాలు పెరిగాయని ఈ నివేదిక తేల్చింది. అడ్వాన్స్డ్ అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కేవలం కోడింగ్‌కే పరిమితం కాకుండా అటు ఇంజినీరింగ్, ఇటు డాటా రంగంలో పట్టున్న యువ గ్రాడ్యుయేట్స్ వైపు సంస్థలు మొగ్గుచూపుతున్నాయి.
ఇక ఫ్రెషర్‌లకు అధిక అవకాశాలు ఉన్న రంగాల్లో ఐటీ ఎప్పటిలాగే ముందంజలో ఉంది. కొత్తగా కాలేజీ చదువులు పూర్తి చేసుకున్న వారిలో 35 శాతం మందికి ఐటీ రంగంలో జాబ్స్ లభిస్తున్నాయి. ఎంబీఏకు ఉపాధి అవకాశాలు కాస్త తగ్గినట్టు నివేదిక తేల్చింది. గతంలో 78 శాతం ఉండగా ఈసారి 72.6 శాతానికి ఉపాధి అవకాశాలు తగ్గాయి. కేవలం ఎంబీఏ డిగ్రీలు కాకుండా టెక్ రంగంపై కూడా పట్టున్న వారి వైపు సంస్థలు మొగ్గు చూపడం ఇందుకు కారణమని నివేదిక తేల్చింది. ఏఐ రాకతో వ్యాపార మోడల్స్ మారుతున్న నేపథ్యంలో పాత మోడల్ ఎంబీఏ చదువులకు కాస్త ప్రాధాన్యత తగ్గింది. కామర్స్ గ్రాడ్యుయేట్స్ నుంచి పోటీ పెరగడం కూడా ఎంబీఏలున్న వారి అవకాశాలు తగ్గడానికి మరొక కారణం.
ఈ డాటా యుగంలో ఫైనాన్స్, ఆపరేషన్స్, బిజినెస్ ఎనలిటిక్స్‌పై పట్టున్న వారికి డిమాండ్ అధికంగా ఉండటంతో కామర్స్ డిగ్రీలున్న వారికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం వారికి జాబ్స్ లభించే అవకాశాలు 62.81 శాతంగా ఉన్నాయి. ఇక పారిశ్రామిక రంగంలో వృద్ధి, విద్యుత్ వాహనాల వినియోగం పెరగడం, టెక్ ఆధారిత కార్యకలాపాలు ఎక్కువకావడం వల్ల ఐటీఐ గ్రాడ్యుయేట్స్ (45.65 శాతం), పాలీటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్‌కు (32.92) కూడా ఉపాధి అవకాశాలు పెరిగాయి.
డిగ్రీల వారీగా ఉద్యోగ అవకాశాలు
కంప్యూటర్ సైన్స్ (CS): 80%
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT): 78%
ఎమ్‌బీయే: 72.76% (గతంలో ఇది సుమారు 78%గా ఉండేది)
ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్): 70.15%
కామర్స్ (బీకామ్/ ఇతర డిగ్రీలు): 62.81%
సైన్స్ (IT యేతర డిగ్రీలు): ~61%
ఆర్ట్స్ (సాంకేతికేతర డిగ్రీలు): ~55.55%
ఐటీఐ: 45.95%
పాలిటెక్నిక్ (డిప్లొమా): 32.92%
ఇవీ చదవండి:
ఈ ఏఐ జమానాలో యువత కెరీర్‌కు శ్రీరామ రక్ష ఇదే
ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. కొత్త తేదీలివే..